వృద్ధిపై మన సీఈవోల విశ్వాసమే మెండు..
న్యూఢిల్లీ: అంతర్జాతీయ సీఈవోలతో పోలిస్తే భారతీయ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు (సీఈవో) వారి కంపెనీల పనితీరు, వృద్ధిపై అధిక విశ్వాసంగా ఉన్నారు. పీడబ్ల్యూసీ 19వ వార్షిక గ్లోబల్ సీఈవో సర్వే (ఇండియా నివేదిక) ప్రకారం.. వచ్చే ఏడాది కాలంలో వారి వారి కంపెనీలు మంచి వృద్ధిని నమోదు చేస్తాయని సర్వేలో పాల్గొన్న 64 శాతం మంది భారతీయ సీఈవోలు అంచనా వేశారు. ఇక కంపెనీల వృద్ధిపై ఆశావహంగా ఉన్న అంతర్జాతీయ సీఈవోలు 35 శాతంగా మాత్రమే ఉన్నారు.
వృద్ధి మార్కెట్లలో గ్లోబల్ సీఈవోల ర్యాంకింగ్‌లో గతేడాది 6వ స్థానంలో ఉన్న ఇండియా ఈసారి 5వ స్థానానికి ఎగబాకింది. గత మూడేళ్లలో కన్నా ఈ ఏడాది వృద్ధి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని 75 శాతం మంది సీఈవోలు తెలిపారు. వేగవంతమైన టెక్నాలజీ మార్పు కంపెనీ వృద్ధిపై ప్రభావం చూపుతుందని 79 శాతం మంది పేర్కొన్నారు. దాదాపు 70 శాతం మంది సీఈవోలు వచ్చే ఏడాది కాలంలో సిబ్బంది పెంపునకు ప్రణాళికలు రూపొందిస్తుంటే, 89 శాతం మంది సీఈవోలు సిబ్బంది అధికారాలు, సంక్షేమానికి పెద్దపీట వేయడం గురించి ఆలోచిస్తున్నారు.