
సాక్షి, బిజినెస్ విభాగం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికాని(క్యూ3)కి సంబంధించి కార్పొరేట్ కంపెనీల ఫలితాలు ఈ వారం నుంచే మొదలవుతున్నాయి. 10న టీసీఎస్, 11న ఇన్ఫోసిస్‌తో క్యూ3 సీజన్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఫలితాలు ఎలా ఉంటాయనే అంశంపై విశ్లేషకుల అంచనాలు దాదాపుగా ఒకే రీతిన ఉన్నాయి. అంతా కూడా... నిఫ్టీ–50 కంపెనీల క్యూ3 ఆదాయాల్లో మోస్తరు వృద్ధిని నమోదు చేయవచ్చనే అంచనా వేస్తున్నారు. కొన్ని రంగాలు నిదానించడం, అంతక్రితం ఏడాది ఇదే కాలంలో అధిక వృద్ధి నమోదు కావడం ఇందుకు కారణాలుగా ఉండొచ్చని చెబుతున్నారు. తయారీ వ్య యాల తగ్గుదల కారణంగా మార్చి త్రైమాసికంలో వృద్ధి వేగాన్ని అందుకోవచ్చని భావిస్తున్నారు.
మోస్తరుగానే...
ఆదాయాలు ఎనిమిది త్రైమాసికాల కనిష్ట స్థాయిలో 7.5 శాతం చొప్పున వృద్ధి చెందొచ్చన్నది మెజారిటీ విశ్లేషకుల అంచనా. 2017 డిసెంబర్ త్రైమాసికంలో నమోదైన వృద్ధి 13 శాతంగా ఉంది. ఇక నికర లాభాలు వరుసగా మూడో త్రైమాసికంలోనూ ఒకే అంకె స్థాయిలో ఉంటాయని, 6.7 శాతంగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఆటోమొబైల్స్, సిమెంట్, ఆయిల్, గ్యాస్, ఫార్మాస్యూటికల్స్, టెలికం రంగ కంపెనీల ఫలితాలు పరిమితంగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు. ప్రైవేటు రంగ బ్యాంకులు, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ రంగ కంపెనీలు మెరుగైన ఫలితాలు ఇస్తాయన్న అంచనాలు విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. ‘‘2018 డిసెంబర్ క్వార్టర్లో పారిశ్రామిక లోహాల ధరలు తక్కువగా ఉన్నాయి. చమురు ధరలు కూడా తగ్గాయి. దీంతో చమురు, మెటల్స్ ముడి పదార్థాలుగా వినియోగించే కంపెనీలకు ప్రయోజనం. రూపాయి కూడా 9 శాతం పడిపోయింది. ఇది దిగుమతిదారులపై, విదేశీ మారకంలో రుణాలు తీసుకునే వారిపై భారాన్ని మోపుతుంది’’అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసాని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి తిరిగి పుంజుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. నిఫ్టీ–50 ఈపీఎస్ డిసెంబర్ క్వార్టర్లో 18–28% మధ్య పెరగొచ్చని మార్కెట్ వర్గాల అంచనా. మరోవైపు, క్యూ3లో దేశీ కార్పొరేట్ల ఆదాయాలు, లాభాల వృద్ధి తగ్గొచ్చని రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో పేర్కొంది. కమోడిటీల ఆధారిత రంగాల ఆదాయాలు గణనీయంగా పెరగొచ్చని సీనియర్ డైరెక్టర్ ప్రసాద్ కొపార్కర్ తెలిపారు. వీటిలో నేచురల్ గ్యాస్ (37 శాతం), ఉక్కు ఉత్పత్తులు (27%), సిమెంటు (10) శాతం మేర వృద్ధి సాధించొచ్చని క్రిసిల్ తెలిపింది. ఇక ఇన్‌ఫ్రాకు సంబంధించిన నిర్మాణ తదితర రంగాల వృద్ధి 12 శాతం స్థాయిలో ఉండొచ్చని అంచనా. వివిధ రంగాలవారీగా విశ్లేషకుల అంచనాలు పరిశీలిస్తే..
ఆటోమొబైల్స్
ఆటోమొబైల్ కంపెనీల ఫలితాలు ఆకట్టుకునే విధంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే మెజారిటీ కంపెనీల విక్రయాలు తగ్గడం, లేదా ఒకే అంకె వృద్ధికి పరిమితం కావడాన్ని చూస్తూనే ఉన్నాం. పండుగల సీజన్‌లో డిమాండ్ లేకపోవడం, డీలర్ల దగ్గర నిల్వలు పెరిగిపోవడం వంటివి ఆటోమొబైల్ కంపెనీల మార్జిన్లపై ఒత్తిడి పెంచేవే. ఆటో కంపెనీల ఆదాయాల వృద్ధి సుమారు 4 శాతానికి పరిమితం కావొచ్చని క్రిసిల్ అంచనా.
బ్యాంకింగ్
మొండి బకాయిల కోసం బ్యాంకులు చేసే ప్రొవిజన్లు తగ్గొచ్చు. బ్యాంకుల్లో కొత్తగా మరిన్ని మొండిబాకీలు నమోదు కావడం తగ్గుముఖం పడుతోంది. దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్‌పై తక్కువ ఈల్డ్ వల్ల ట్రెజరీ ఆదాయం అధికంగా వస్తుందని, ఇది బ్యాంకుల లాభాలను పెంచేదిగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
క్యాపిటల్ గూడ్స్
ప్రభుత్వం నుంచి ఆర్డర్లు నిలకడగా ఉండడం ఈ రంగంలోని కంపెనీలు అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికం ఫలితాలకు కలసిరానుంది. అంతకుముందు కొన్ని త్రైమాసికాలుగా ప్రాజెక్టుల విషయంలో నత్తనడక కొనసాగింది. అయితే, ఇటీవలి కాలంలో ప్రభుత్వం చేపట్టిన పాలసీ చర్యలు, సంస్కరణలతో వాటి నిర్మాణం వేగాన్ని పుంజుకుంటోంది. ఈ రంగంలో అగ్రగామి కంపెనీ ఎల్ అండ్ టీ డిసెంబర్ త్రైమాసికంలో అంచనాల కంటే తక్కువ ఆర్డర్లనే సంపాదించింది. దీంతో ఈ కంపెనీ చేసే వ్యాఖ్యలను పరిశీలించాల్సి ఉంది.
సిమెంట్
దేశవ్యాప్తంగా సిమెంట్ ధరలు డిసెంబర్‌లో బ్యాగుపై 2 శాతం వరకు తగ్గి రూ.308 స్థాయికి పరిమితం అయ్యాయి. పలు ప్రాంతాల్లో సిమెంట్‌కు డిమాండ్ పెరిగినప్పటికీ పోటీ కారణంగా ధరలు పెంచే పరిస్థితి లేకపోయింది. పెద్ద కంపెనీలైన ఏసీసీ, అంబుజా సిమెంట్, దాల్మియా భారత్, శ్రీసిమెంట్ కంపెనీలు 10–15 శాతం మధ్యలో అమ్మకాల వృద్ధిని నమోదు చేయవచ్చని, కానీ ఆదాయ వృద్ధి మాత్రం 3–9 శాతానికే పరిమితం అవుతుందని అంచనా వేస్తున్నారు.
ఎఫ్‌ఎంసీజీ
పండుగల సమయంలో అధిక విక్రయాలు, జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రభావం ఈ రంగ కంపెనీలపై కనిపించనుంది. గత కొన్ని క్వార్టర్లుగా గ్రామీణ డిమాండ్ వృద్ధికి దన్నుగా నిలిచింది. డిసెంబర్ క్వార్టర్లో మాత్రం ఇది ఒక మోస్తరుగా ఉండొచ్చని భావిస్తున్నారు. అధిక ముడి ఉత్పత్తి వ్యయాల రూపంలో మార్జిన్లపై ప్రభావం ఉంటుంది. అయితే, జీఎస్టీ రేట్ల తగ్గింపు కొంత ఉపశమనం కలిగించేది. ఎఫ్‌ఎంసీజీ రంగం 8 శాతం వృద్ధి నమోదు చేయొచ్చని అంచనా.
మెటల్స్
ఈ ఏడాది అక్టోబర్– డిసెంబర్ త్రైమాసికంలో చాలా వరకు కమోడిటీల ధరలు క్షీణించాయి. స్టీల్ ధరలు 15 శాతం వరకు తగ్గడం జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్ కంపెనీలకు ప్రతికూలంగా పరిణమించనుంది. అల్యూమినియం ధరలు తగ్గడం హిందాల్కో, వేదాంత కంపెనీలపై ప్రభావం చూపించనుంది. వేదాంత లిమిటెడ్‌కు చమురు ఉత్పత్తి కూడా ఉంది. చమురు ధరల తగ్గుదల ప్రభావం కూడా ఈ కంపెనీపై పడనుంది.
ఫార్మా
అమెరికా, దేశీయ మార్కెట్లలో సమస్యల నేపథ్యంలో ఫార్మా కంపెనీలు మెప్పించే ఫలితాలను ప్రకటించే అవకాశం లేదని విశ్లేషకుల అంచనా. అమెరికా మార్కెట్లో ధరల పతనానికి బ్రేక్ పడటం ఎగుమతి చేసే ఫార్మా కంపెనీలకు ఊరట కలిగించే విషయం. గత క్వార్టర్‌లో రూపాయి 11 శాతం క్షీణించిన దరిమిలా ఫార్మా 10 శాతం, ఐటీ రంగం 21 శాతం మేర వృద్ధి నమోదు చేయొచ్చని క్రిసిల్ అంచనా వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment