ఇన్ఫీ బోణీ బాగుంది! | Q4 results in line with expectations | Sakshi
Sakshi News home page

ఇన్ఫీ బోణీ బాగుంది!

Published Sat, Apr 14 2018 12:01 AM | Last Updated on Sat, Apr 14 2018 12:01 AM

Q4 results in line with expectations - Sakshi

సలీల్‌ పరేఖ్‌తో ఇన్ఫీ సీఓఓ ప్రవీణ్‌ రావు, సీఎఫ్‌ఓ రంగనాథ్‌

బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌... మెరుగైన ఫలితాలతో బోణీ చేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం(2017–18, క్యూ4)లో రూ.3,690 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,603 కోట్ల తో పోలిస్తే లాభం 2.4 శాతం వృద్ధి చెందింది. ఇక కంపెనీ మొత్తం ఆదాయం కూడా 5.6 శాతం వృద్ధితో రూ.17,120 కోట్ల నుంచి రూ.18,083 కోట్లకు ఎగబాకింది. మార్కెట్‌ విశ్లేషకులు క్యూ4లో కంపెనీ రూ.3,670 కోట్ల నికర లాభాన్ని నమోదు చేయొచ్చని అంచనా వేశారు. దీనికి అనుగుణంగానే ఫలితాలు వెలువడ్డాయి. కొత్త సీఈఓ సలీల్‌ పరేఖ్‌ నేతృత్వంలో తొలిసారిగా పూర్తిస్థాయి త్రైమాసిక ఫలితాలను కంపెనీ ప్రకటించింది. శుక్రవారం బీఎస్‌ఈలో ఇన్ఫోసిస్‌ షేరు 0.58% లాభంతో రూ.1,169 వద్ద ముగిసింది. మార్కెట్‌ ముగిసిన తర్వాత ఫలితాలు వెల్లడయ్యాయి. 

సీక్వెన్షియల్‌గా... 
2017–18 ఏడాది మూడో త్రైమాసికంతో పోలిస్తే (రూ.5,129 కోట్లు) సీక్వెన్షియల్‌ ప్రాతిపదికన క్యూ4లో ఇన్ఫీ నికర లాభం 28 శాతం తగ్గింది. దీనికి ప్రధానంగా క్యూ3లో అమెరికాలో పన్ను ప్రయోజనం 22.5 కోట్ల డాలర్ల మేర లభించడమే కారణం. ఇక మొత్తం ఆదాయం సీక్వెన్షియల్‌గా 1.6 శాతం వృద్ధి చెందింది. క్యూ3లో ఆదాయం 17,794 కోట్లుగా నమోదైంది. 

పూర్తి ఏడాదికి... 
2017–18 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్‌ కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ.16,029 కోట్లకు ఎగబాకింది. 2016–17లో లాభం రూ.14,353 కోట్లతో పోలిస్తే 11.7 శాతం పెరిగింది. మొత్తం ఆదాయం గడిచిన ఆర్థిక సంవత్సరంలో 3 శాతం వృద్ధితో రూ.70,522 కోట్లుగా నమోదైంది. 2016–17లో ఆదాయం రూ.68,684 కోట్లు. 

గైడెన్స్‌ ఇలా... 
ప్రస్తుత 2018–19 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం(స్థిర కరెన్సీ ప్రాతిపదికన) 6–8 శాతం వృద్ధి చెందవచ్చని ఇన్ఫోసిస్‌ గైడెన్స్‌ ఇచ్చింది. ఇక డాలరు రూపేణా ఆదాయం 7–9 శాతం పెరుగుతుందని లెక్కగట్టింది. 

డివిడెండ్‌ బొనాంజా... 
గడిచిన ఆర్థిక సంవత్సరానికి(2017–18) గాను రూ.5 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.20.5 చొప్పున తుది డివిడెండ్‌ను, అదేవిధంగా రూ.10 చొప్పున ప్రత్యేక డివిడెండ్‌ను కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫార్సు చేసింది. ప్రతి ఏటా వచ్చే లాభాల్లో(ఫ్రీ క్యాష్‌ ఫ్లో) 70 శాతాన్ని ఇన్వెస్టర్లకు పంచాలన్న ప్రస్తుత పాలసీని కొనసాగించాలని నిర్ణయించింది. దీంతోపాటు నగదు నిల్వల్లో రూ.13,000 కోట్ల వరకూ మొత్తాన్ని వాటాదారులకు చెల్లించాలని నిర్ణయించింది. దీనిలో రూ.2,600 కోట్లను ఈ ఏడాది(2018) జూన్‌లో రూ.10 ప్రత్యేక డివిడెండ్‌ రూపంలో ఇవ్వనుంది. మిగతా రూ.10,400 కోట్లను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018–19)లో బోర్డు నిర్ణయించిన విధానంలో వాటాదారులకు చెల్లించనున్నారు. 

క్యూ4లో ఆదాయ వృద్ధి, లాభదాయకత, నగదు ప్రవాహం విషయంలో కంపెనీ మంచి పురోగతిని సాధించింది. క్లయింట్లతో పటిష్టమైన సంబంధాలు, మా ఉద్యోగుల నిబద్ధతే ఈ మెరుగైన పనితీరుకు దోహదం చేసింది. డిజిటల్‌ వ్యాపారాన్ని మరింత పెంచడం; ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)–ఆటోమేషన్‌ ద్వారా క్లయింట్లకు సాంకేతికంగా తోడ్పాటు; ఉద్యోగుల నైపుణ్యాలను సానబట్టడం; అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా వంటి మార్కెట్లలో స్థానికతను విస్తరించడం వంటి నాలుగు కీలక అంశాలతో కంపెనీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. 
– సలీల్‌ పరేఖ్, ఇన్ఫోసిస్‌ సీఈఓ–ఎండీ  

ఏప్రిల్‌ 1 నుంచి జీతాలు పెంపు...
ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి అమలయ్యే విధంగా దాదాపు సిబ్బంది అందరికీ(85 శాతం వరకూ) ఓ మోస్తరు నుంచి మెరుగ్గానే(హై సింగిల్‌ డిజిట్‌) వేతనాలను పెంచనున్నామని ఇన్ఫోసిస్‌  సీఓఓ ప్రవీణ్‌ రావు పేర్కొన్నారు. మిగిలిన ఉద్యోగులకు ముఖ్యంగా మధ్యస్థాయి, సీనియర్‌ మేనేజ్‌మెంట్‌కు జూలై 1 నుంచి జీతాల పెంపు ఉంటుందని చెప్పారు. ఆన్‌సైట్, ఆఫ్‌షోర్‌ సిబ్బంది అందరికీ ఇది వర్తిస్తుందన్నారు. ఈ ఏడాది మార్చి నాటికి కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 2,04,107కు చేరింది. క్యూ4లో స్థూలంగా 12,329 మంది, నికరంగా 2,416 మంది ఉద్యోగులు జతయ్యారు. కిరణ్‌ మజుందార్‌ షాను ప్రధాన ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా కంపెనీ నియమించింది. క్యూ4లో డిజిటల్‌ సేవల విభాగం ఆదాయం 26.8 శాతం వృద్ధి చెందింది. 90.5 కోట్ల డాలర్ల విలువైన 10 పెద్ద కాంట్రాక్టులను దక్కించుకున్నట్లు రావు తెలిపారు.  2017–18లో మొత్తం కొత్త కాంట్రాక్టుల విలువ 3 బిలియన్‌ డాలర్లుగా నమోదైందని వివరించారు. 

పనయా, స్కవా విక్రయం...
కంపెనీ అనుబంధ సంస్థలైన స్కవా, పనయాలను విక్రయించాలని ఇన్ఫోసిస్‌ నిర్ణయించింది. తగిన కొనుగోలుదారులను గుర్తించేపనిలోపడింది. ఈ అమ్మకాన్ని ఈ 2019 మార్చికల్లా పూర్తిచేయాలని భావిస్తోంది. ఈ రెండింటికీ కలిపి రూ.2,060 కోట్ల ఆస్తులు, రూ.324 కోట్ల రుణాలు ఉన్నాయి. కాగా, ఇజ్రాయెల్‌కు చెందిన పనయా కొనుగోలులో(20 కోట్ల డాలర్ల మొత్తానికి) అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ వెలుగులోకి రావడంతో ప్రమోటర్లు అప్పటి కంపెనీ యాజమాన్యంపై తీవ్ర ఆరోపణలు, అసంతృప్తి వ్యక్తం చేయడం తెలిసిందే. కార్పొరేట్‌ గవర్నెన్స్‌ లోపాలకు సంబంధించి ప్రమోటర్లతో విభేదాల కారణంగా విశాల్‌ సిక్కా గతేడాది ఆగస్టులో కంపెనీకి అర్ధంతరంగా గుడ్‌బై చెప్పడంతో ఆ స్థానంలో సలీల్‌ పరేఖ్‌ను కొత్త సీఈఓగా నియమించారు. సిక్కా, పరేఖ్‌ ఇద్దరూ ఇన్ఫోసిస్‌కు ప్రమోటర్‌యేతర సీఈఓలే కావడం గమనార్హం. 

అమెరికా కంపెనీ కొనుగోలు... 
ఆమెరికాకు చెందిన డిజిటల్‌ సేవల కంపెనీ  ‘వాంగ్‌డూడీ’ని కొనుగోలు చేయనున్నట్లు ఇన్ఫీ ప్రకటించింది. ఈ డీల్‌ విలువ దాదాపు 7.5 కోట్ల డాలర్లు(సుమారు రూ.490 కోట్లు) ఉంటుందని, ఈ మేరకు ఇరు కంపెనీల మధ్య శుక్రవారం ఒప్పందం కుదిరినట్లు వెల్లడించింది. ఈ కొనుగోలుతో తమ సృజనాత్మక, బ్రాండింగ్, కస్టమర్‌ సేవల సామర్థ్యాలు మరింత పటిష్టం అవుతాయని... ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో డీల్‌ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు ఇన్ఫీ తెలిపింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement