రుణ మాఫీ హామీలు సరికాదు | Raghuram Rajan bats for banning of loan waiver promises in poll manifestos | Sakshi
Sakshi News home page

రుణ మాఫీ హామీలు సరికాదు

Published Sat, Dec 15 2018 4:50 AM | Last Updated on Sat, Dec 15 2018 4:50 AM

Raghuram Rajan bats for banning of loan waiver promises in poll manifestos - Sakshi

న్యూఢిల్లీ: ఎన్నికల్లో రాజకీయ పార్టీలిస్తున్న రుణాల మాఫీ హామీలను రిజర్వు బ్యాంకు మాజీ గవర్నరు రఘురామ్‌ రాజన్‌ తప్పుబట్టారు. రుణాల మాఫీ అనేది ఎన్నికల హామీల్లో భాగం కాకూడదన్నారు. ‘‘దీనివల్ల వ్యవసాయ రంగంలో పెట్టుబడులకు తీవ్ర విఘాతం కలుగుతుంది. రాష్ట్రాల ద్రవ్య పరిస్థితులపై ఒత్తిడికి దారి తీస్తుంది’’ అన్నారాయన. పార్టీలు ఇలాంటి హామీలివ్వకుండా చూడాలంటూ తాను ఎన్నికల కమిషన్‌కు లేఖ కూడా రాసినట్లు చెప్పారాయన.

‘‘నిజం చెప్పాలంటే వ్యవసాయ రంగంలోని నైరాశ్య పరిస్థితుల్ని పరిష్కరించాల్సిన అవసరం చాలా ఉంది. కాకపోతే అది రుణాల మాఫీ ద్వారానేనా? అన్నది మాత్రం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ రుణాలు తీసుకునేది కొందరు మాత్రమే’’ అని రాజన్‌ చెప్పారు.  ‘భారతదేశానికి కావాల్సిన ఆర్థిక వ్యూహం’ అనే అంశంపై ఒక నివేదికను విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రుణాలు కాస్తంత పలుకుబడి కలిగిన వారికే వస్తుంటాయని, వారికే ఈ మాఫీతో లబ్ధి కలుగుతుందని చెప్పారాయన. ఈ మాఫీలు రుణ సంస్కృతిని విషతుల్యం చేస్తాయని, కేంద్ర– రాష్ట్రాల బడ్జెట్లపై ఒత్తిడి పెంచుతాయని వ్యాఖ్యానించారు.  

రుణాల పంపిణీ లక్ష్యాలు కూడా...
ప్రభుత్వ రంగ బ్యాంకులపై ప్రభుత్వాలు మోపే రుణాల పంపిణీ లక్ష్యాలు కూడా ప్రమాదకరమైనవేనని రాజన్‌ వ్యాఖ్యానించారు. ‘‘ప్రభుత్వం నిధులివ్వకుండా పీఎస్‌బీలపై ఇలాంటి లక్ష్యాలు రుద్దటం సరికాదు. ఇవి భవిష్యత్తు ఎన్‌పీఏల వాతావరణానికి దారితీస్తాయి. పీఎస్‌బీలను తగినంత నిధులతో పటిష్టం చేయాలి’’ అని చెప్పారు. ఏదైనా అవసరం ఉండి చేస్తే దానికి వెంటనే బడ్జెట్‌ నిధుల నుంచి సర్దుబాటు చేయాలని సూచించారు.

ప్రయివేటీకరణే పరిష్కారం కాదు...
ప్రభుత్వరంగ బ్యాంకుల సమస్యలకు ప్రైవేటీకరణ ఒక్కటే పరిష్కారం కాదని రఘురామ్‌ రాజన్‌ స్పష్టంచేశారు. రుణాల పంపిణీ లక్ష్యాలు, ప్రభుత్వ పథకా>ల పంపిణీ బాధ్యతలు ప్రభుత్వ బ్యాంకులపై రుద్దడం వంటి జోక్యాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియోను తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లిక్విడిటీ కవరేజీ రేషియో, నెట్‌ స్టెబుల్‌ ఫండింగ్‌ రేషియోలను దీనికి ప్రత్యామ్నాయంగా పేర్కొన్నారు. వచ్చే జనవరి నుంచి అమల్లోకి వచ్చే విధంగా లిక్విడిటీ రేషియోను పావు శాతం తగ్గిస్తూ ఆర్‌బీఐ ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇది 19 శాతం ఉండగా, ప్రతీ త్రైమాసికానికి పావు శాతం చొప్పున 18 శాతానికి వచ్చే వరకు తగ్గించాలన్నది ఆర్‌బీఐ నిర్ణయం.

బ్యాంకిం గ్‌ రంగంలో భారీ ఎన్‌పీఏల సమస్య నేపథ్యంలో... పీఎస్‌బీల బోర్డులను నిపుణులతో భర్తీ చేయాల్సిన అవసరాన్ని రాజన్‌ గుర్తు చేశారు. పీఎస్‌బీ బోర్డుల్లో నియామకాలకు ప్రభుత్వం దూరంగా ఉండాలని సూచించారు. ‘‘ఎక్కువ సమస్య పీఎస్‌బీల్లో ఉంది. అలాగని, ప్రైవేటు రంగ బ్యాంకులు ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంకు, ఇతర పాత తరం ప్రైవేటు బ్యాంకులు కూడా దీనికి అతీతం కాదు. పాలనను, పారదర్శకతను ప్రోత్సాహకాలను మెరుగుపరచాలి. కొన్ని ప్రైవేటు రంగ బ్యాంకుల్లోనూ సమస్యలున్న నేపథ్యంలో... ప్రభు త్వరంగ బ్యాంకులను ప్రైవేటు పరం చేయడమే అన్ని సమస్యలకు పరిష్కారం కాబోదు’’ అని రాజన్‌ వివరించారు.

గవర్నెన్స్‌ విధానంపై లోతుగా అధ్యయనం
ఆర్‌బీఐ బోర్డు సమావేశంలో నిర్ణయం
ముంబై: కొత్త గవర్నర్‌గా నియమితులైన శక్తికాంత దాస్‌ సారథ్యంలో శుక్రవారం తొలిసారిగా భేటి అయిన ఆర్‌బీఐ బోర్డు.. గవర్నెన్స్‌ విధానాలపై మరింత లోతుగా పరిశీలన జరపాలని నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, దేశీయంగాను.. అంతర్జాతీయంగాను ఎదురవుతున్న సవాళ్లు, లిక్విడిటీ, రుణ వితరణ, కరెన్సీ నిర్వహణ, ఆర్థిక అక్షరాస్యత తదితర అంశాలపై చర్చించింది. ’ఆర్‌బీఐ గవర్నెన్స్‌ అంశంపై బోర్డు చర్చించింది. దీన్ని మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని నిర్ణయించింది’ అని రిజర్వ్‌ బ్యాంక్‌ పేర్కొంది. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన సమావేశం అనంతరం ఆర్‌బీఐ క్లుప్తంగా ఒక ప్రకటన జారీ చేసింది. 2017–18లో బ్యాంకింగ్‌ తీరుతెన్నులు, పురోగతి విషయాలకు సంబంధించిన ముసాయిదా నివేదిక గురించి 18 మంది సభ్యుల బోర్డు చర్చించినట్లు వెల్లడించింది.  

రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ అనూహ్యంగా రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో మాజీ బ్యూరోక్రాట్‌ శక్తికాంత దాస్‌ను కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే. 25వ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత దాస్‌ సారథ్యంలో బోర్డు సమావేశం కావడం ఇదే తొలిసారి. గతంలో ఉర్జిత్‌ పటేల్‌ సారథ్యంలో నవంబర్‌ 19న ఆర్‌బీఐ బోర్డు సమావేశమైంది. దాదాపు పది గంటల పాటు ఇది సాగింది. రిజర్వ్‌ బ్యాంక్‌ వద్ద ఎంత స్థాయిలో అత్యవసర నిల్వలు ఉండాలి తదితర అంశాలను సూచించేందుకు ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో బోర్డు నిర్ణయించింది. అయితే, ఆరుగురు సభ్యులతో ఏర్పాటు కావాల్సిన ఈ కమిటీకి చైర్మన్‌గా ఎవరిని నియమించాలన్న విషయంలో కేంద్రం, ఆర్‌బీఐకి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ ప్రతిపాదన ముందుకు సాగలేదు.

అది జోక్యం చేసుకోవడం కాదు
ఆర్‌బీఐతో విభేదాలపై జైట్లీ
న్యూఢిల్లీ: ఎన్నికైన సార్వభౌమ ప్రభుత్వం రుణాలు, ద్రవ్య లభ్యత అంశాలను పరిష్కరించాలని ఆర్‌బీఐని కోరడం, ఆ సంస్థ స్వయంప్రతిపత్తిలో జోక్యం చేసుకోవడం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ స్పష్టం చేశారు. ఆర్‌బీఐతో అంశాలు పరిష్కారం అవుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆర్‌బీఐ స్వతంత్రతను గౌరవిస్తున్నాం కనుకనే మార్కెట్‌ ఎదుర్కొంటున్న ఈ అంశాల గురించి మాట్లాడుతున్నామని ఫిక్కీ వార్షిక సమావేశంలో పాల్గొన్న సందర్భంగా జైట్లీ చెప్పారు. ప్రభుత్వం చెబుతున్న అంశాలు ఆర్‌బీఐ అధికార, చట్ట పరిధిలోనే ఉన్నాయన్నారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో రుణాలు, లిక్విడిటీ వంటి మరో సవాలు దేశీయంగా అవసరం లేదని చెప్పారు.

సమాచారం, చర్చించడం, దృష్టికి తీసుకురావడం అన్నది ఆర్థిక వ్యవస్థ పనిచేసే విధానంలో భాగమేనని గుర్తు చేశారు.  మార్కెట్‌ ఎదుర్కొంటున్న సవాళ్లను ఒక్క ప్రభుత్వమే కాదని, పారిశ్రామిక సంఘాలైన ఫిక్కీ సైతం ఆర్‌బీఐ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ద్రవ్యలోటు లక్ష్యానికి కట్టుబడి ఉన్నాం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును 3.3 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని జైట్లీ స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా అనిశ్చితులు ఉన్నప్పటికీ భారత్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 7–8 శాతం మధ్య వృద్ధిని నమోదు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తద్వారా ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ గుర్తింపును నిలబెట్టుకుంటుందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement