గృహ, వాహన రుణాలిక చౌక! | Raghuram Rajan opens the liquidity floodgates, gives banks ultimatum on rate cut | Sakshi
Sakshi News home page

గృహ, వాహన రుణాలిక చౌక!

Published Wed, Apr 6 2016 7:01 AM | Last Updated on Sun, Sep 3 2017 9:16 PM

గృహ, వాహన రుణాలిక చౌక!

గృహ, వాహన రుణాలిక చౌక!

రెపో రేటు పావు శాతం తగ్గింపు; ఇక 6.5 శాతం
అంచనాలకు అనుగుణంగానే ఆర్‌బీఐ నిర్ణయం
ఆరు నెలల తర్వాత తొలి రేట్ల కోత ఇదే...
ఎంఎస్‌ఎఫ్ రేటు ముప్పావు శాతం తగ్గింపు...
దీంతో బ్యాంకులకు తగ్గనున్న నిధుల సమీకరణ భారం
సీఆర్‌ఆర్ యథాతథంగా 4 శాతంగా కొనసాగింపు...
రెపో, రివర్స్ రెపోల మధ్య వ్యత్యాసం  అర శాతానికి కుదింపు
భవిష్యత్తులో మరిన్ని కోతలు ఉంటాయని సంకేతం
తదుపరి పాలసీ సమీక్ష జూన్ 7న...

 ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2016-17)లో చేపట్టిన తొలి ద్రవ్య, పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) చర్యలు మెజారిటీ అంచనాలకు అనుగుణంగానే వెలువడ్డాయి. కీలకమైన పాలసీ వడ్డీరేటు రెపోను పావు శాతం తగ్గించి 6.5 శాతానికి చేర్చింది. నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్)ని యథాతథంగా 4 శాతంగానే కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటు(ఎంసీఎల్‌ఆర్) వ్యవస్థను ఆర్‌బీఐ ఇప్పటికే అమల్లోకి తీసుకొచ్చిన నేపథ్యంలో తాజా రెపో కోత ప్రయోజనాన్ని బ్యాంకులు తప్పనిసరిగా రుణగ్రహీతలకు బదలాయించాల్సిన పరిస్థితి నెలకొంది.

దీంతో త్వరలోనే బ్యాంకులు కూడా తమ రుణాలపై వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను 1.3 శాతం వరకూ తగ్గించడం, బడ్జెట్‌లో ప్రభుత్వం ద్రవ్యలోటు కట్టడి లక్ష్యాలకు కట్టుబడే ఉంటామంటూ స్పష్టతనివ్వడం వంటి చర్యలతో పాటు ద్రవ్యోల్బణం కూడా అదుపులోనే కొనసాగుతుండటం కూడా ఆర్‌బీఐ రేట్ల తగ్గింపునకు దోహదం చేసిన అంశాల్లో ప్రధానంగా ఉన్నాయి.

 ఐదేళ్ల కనిష్టానికి రెపో...
కాగా, తాజా రెపో రేటు ఐదేళ్ల కనిష్టం కావడం గమనార్హం. అంతక్రితం 2011 జనవరిలో రెపో ఈ స్థాయిలో ఉంది. మరోపక్క, గతేడాది జనవరి నుంచి చూస్తే ఆర్‌బీఐ ఇప్పటివరకూ రెపో రేటును 1.5% తగ్గించినట్లు లెక్క. ఇక గడచిన ఆరు నెలల్లో ఇదే తొలి పాలసీ రేట్ల కోత కావడం విశేషం. గతేడాది సెప్టెంబర్‌లో చివరిగా ఆర్‌బీఐ రెపోను 0.5% తగ్గించింది.

 ఇతర లిక్విడిటీ పెంపు చర్యలు కూడా...
బ్యాంకులకు లిక్విడిటీ(ద్రవ్య సరఫరా) పెంపునకు వీలుగా ఆర్‌బీఐ ఇతరత్రా కొన్ని చర్యలను చేపట్టింది. ప్రధానంగా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ(ఎంఎస్‌ఎఫ్) రేటును మాత్రం ముప్పావు శాతం తగ్గించడం ద్వారా బ్యాంకులకు నిధుల సమీకరణ భారం మరింత తగ్గేలా చేసింది.  దీనివల్ల ప్రాధాన్య రంగాలకు మరిన్ని రుణాలను ఇచ్చేవిధంగా చర్యలు తీసుకుంది. ఆర్‌బీఐ వద్ద బ్యాంకులు రోజువారీగా ఉంచాల్సిన నగదు పరిమాణాన్ని కూడా 5 శాతం తగ్గించడం ద్వారా లిక్విడిటీ పెంచేందుకు తోడ్పాటునందించింది. ఇక ఇప్పటివరకూ రెపో రేటు, రివర్స్ రెపో రేటుల మధ్య వ్యత్యాసం ఒక శాతంగా ఉండగా.. దీన్ని అర శాతానికి కుదిస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. దీంతో ప్రస్తుతం రివర్స్ రెపో రేటు 6 శాతానికి పెరగనుంది.

 
పాలసీ, నివేదికలో ముఖ్యాంశాలివీ...

సాధారణ రుతుపవన వర్షపాతం గనుక నమోదైతే... ఈ ఏడాది(2016-17) స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 7.6 శాతంగా ఉండొచ్చు (కేంద్ర ప్రభుత్వ అంచనా 7-7.75 శాతం).

ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలు కారణంగా వినియోగం పెరిగి జీడీపీ వృద్ధి రేటుకు అదనంగా 0.4% జతయ్యేందుకు వీలవుతుంది. మరోపక్క, రిటైల్ ద్రవ్యోల్బణాన్ని కూడా 1-1.5% వరకూ ఎగదోసే అవకాశం ఉంది.

బ్యాంకింగ్ లావాదేవీల్లో మరింతగా డిజిటల్ పరిజ్ఞానాన్ని ఉపయోగించేలా చేయడం ద్వారా క్యాష్ వినియోగాన్ని భారీగా తగ్గించేందుకు చర్యలు తీసుకుంటాం. ఈ దిశగా పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ వ్యవస్థపై విజన్-2018 డాక్యుమెంట్‌ను ఈ నెలాఖరుకల్లా అందుబాటులోకి తెస్తాం.

బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంకుపై సైబర్ దాడుల కారణంగా చోటుచేసుకున్న 95 కోట్ల డాలర్ల భారీ స్కామ్ నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీని పెంచేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నాం.

త్వరలో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కారణంగా నగదు ప్రవాహం పెరిగేందుకు దారితీస్తోంది. ఈ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాం. ప్రస్తుతం ప్రజల చేతిలో అదనంగా రూ.60 వేల కోట్ల వరకూ క్యాష్ చలామణి అవుతోంది. మార్చి 18తో ముగిసిన పక్షం రోజులకు చూస్తే అంతక్రితం ఇదే వ్యవధితో పోలిస్తే కరెన్సీ చలామణి 48 శాతం పెరిగి రూ. 2 లక్షల కోట్లకు పెరగడమే దీనికి నిదర్శనం.

  తదుపరి పాలసీ సమీక్ష జూన్ 7న ఉంటుంది. డిఫాల్టర్ల పేర్లన్నీ బయటపెడితే  వ్యాపారాల మూతే...
మొండిబకాయిల(ఎన్‌పీఏ)కు సంబంధించిన కేసుల్లో ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తుల ప్రధానోద్దేశం.. నిబంధనలకు విరుద్ధంగా, ఉద్దేశపూర్వకంగా జరిగిన మోసాలను(క్రిమినాలిటీ) బట్టబయలు చేయడమేనని రాజన్ స్పష్టం చేసేవారు. అంతేకానీ, ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడేవిధంగా బ్యాంకు రుణాలకు ఎలాంటి ఆటంకం ఉండకూడదన్నదే ఆర్‌బీఐ, ప్రభుత్వం ఆలోచన అని కూడా ఆయన చెప్పారు. ‘డిఫాల్లర్ల(రుణ ఎగవేతదారులు) పేర్లన్నీ బయటపెట్టడం కుదరదు. దీనివల్ల వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా మూతపడేందుకు, అనవసర కల్లోలానికి దారితీస్తుంది.

ఇటీవల తాము ఇచ్చిన డిఫాల్టర్ల లిస్టులోని పేర్లను బయటపెట్టాల్సిందిగా సుప్రీం కోర్టు ఆర్‌బీఐని ఆదేశిస్తుందని నేను భావించడం లేదు. పేర్లను రహస్యంగా ఉంచాలని మేం కోరాం. అయితే, ఇందులో కొన్ని అంశాలను వెల్లడించవచ్చుకానీ, ఇప్పుడు మేం చెప్పడం కుదరదు’ అని రాజన్ పేర్కొన్నారు. బ్యాంకుల్లో  మొండిబకాయిలు తీవ్రంగా ఎగబాకిన నేపథ్యంలో రూ. 500 కోట్లకు మించిన ఎన్‌పీఏలు ఉన్న డిఫాల్టర్ల జాబితాను ఇవ్వాల్సిందిగా సుప్రీం ఆదేశించడం, ఆర్‌బీఐ దీన్ని సీల్డు కవర్‌లో సమర్పించడం తెలిసిందే.

రుణగ్రహీతలకు ఆర్‌బీఐ తీపి కబురు తెచ్చింది. గృహ, వాహన, ఇతరత్రా రుణాలపై వడ్డీరేట్లు దిగొచ్చేవిధంగా పాలసీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో అటు సామాన్యులతో పాటు కార్పొరేట్ రంగానికి కూడా వడ్డీరేట్ల ఊరట లభించనుంది. అంతేకాదు రానున్న కాలంలోనూ సరళ పాలసీనే కొనసాగిస్తామని చెప్పడం ద్వారా అవసరమైతే మరిన్ని రేట్ల కోతలు ఉంటాయని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ సంకేతాలిచ్చారు. పాలసీ నిర్ణయంపై కేంద్రం, కార్పొరేట్ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.

సరళ పాలసీనే కొనసాగిస్తాం...
ఎంసీఎల్‌ఆర్ విధానం వల్ల పాలసీ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని బ్యాంకులు కచ్చితంగా రుణగ్రహీతలకు అందిస్తాయి. ఇప్పటికే బ్యాంకులు 0.25-0.5 శాతం మేర రుణ రేట్లను తగ్గించాయి. తాజా రెపో కోత కారణంగా రుణాలు మరింత చౌక కానున్నాయి.  మేం అనుసరిస్తున్న సరళ పాలసీ విధానాన్ని కొనసాగిస్తాం. వచ్చే ఏడాది మార్చినాటికి రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 5 శాతానికి కట్టడి చేయాలన్నదే మా లక్ష్యం. ఇది కాస్త అటూఇటుగా సాకారం అయ్యే అవకాశం ఉంది. అయితే, ఏడో వేతన సంఘం సిఫార్సు మేరకు ఉద్యోగుల జీతాలు పెరిగితే రానున్న రెండేళ్లలో ద్రవ్యోల్బణాన్ని 1.5 శాతం వరకూ ఎగదోసే అవకాశం ఉంది. ఇక కొత్త బ్యాంకింగ్ లెసైన్సుల విషయానికొస్తే.. విభిన్న తరహా సేవలు ముఖ్యంగా కస్టోడియన్ బ్యాంకులు; హోల్‌సేల్, దీర్ఘకాలిక ఫైనాన్సింగ్‌పై దృష్టిపెట్టే తరహా బ్యాంకుల ఆవిర్భావానికి ఆర్‌బీఐ అవకాశాలను అన్వేషిస్తుంది.

పావు శాతం రెపో రేటు కోతను మార్కెట్ ముందుగానే అంచనావేసింది. ద్రవ్య సరఫరా పెంపునకు వీలుగా తీసుకున్న చర్యలు నిజంగా ఊహించని బహుమతే. దీనివల్ల ఆర్‌బీఐ కల్పించిన రేట్ల కోత ప్రయోజనాన్ని రుణ గ్రహీతలకు వేగంగా బదలాయించేందుకు వీలవుతుంది.  - అరుంధతీ భట్టాచార్య, ఎస్‌బీఐ చీఫ్

 లిక్విడిటీ పెంపు, నిర్వహణకు సంబంధించి ఆర్‌బీఐ తీసుకున్న చర్యలు బ్యాంకులకు సానుకూలంగా ఉన్నాయి. దీంతో రుణాలపై వడ్డీరేట్ల తగ్గింపునకు వీలుగా బ్యాంకులకు వెసులుబాటు లభిస్తుంది. - చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ, ఎండీ

వృద్ధికి ఊతం: పరిశ్రమ
ఆర్‌బీఐ పావు శాతం రేట్ల తగ్గింపును పారిశ్రామిక రంగం స్వాగతించింది. రుణాలు చౌక కావడంతో వృద్ధి పుంజుకోవడానికి దోహదం చేస్తుందని అభిప్రాయపడింది. ‘వాస్తవానికి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో వ్యాపార విశ్వాసాన్ని పెంచేందుకు రెపో రేటును కనీసం అర శాతం తగ్గించి ఉండాల్సింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం అంచనాలు, అంతర్జాతీయంగా కమోడిటీ ధరల తగ్గుదల, చిన్న మొత్తాల పొదుపు రేట్లను కేంద్రం తగ్గించడం, బడ్జెట్‌లో ప్రభుత్వం తీసుకున్న ఆర్థిక క్రమశిక్షణ చర్యలు ఆర్‌బీఐని రేట్ల కోత దిశగా ప్రోత్సహించాయి’.
  - చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డెరైక్టర్ జనరల్

 ఆర్థిక వ్యవస్థలో భారీ రంగాలు... ముఖ్యంగా తయారీ, నిర్మాణం, ఇన్‌ఫ్రా రంగాల్లో నెలకొన్న తీవ్ర మందగమనాన్ని చూస్తే, రెపో రేటు తగ్గింపు మరింత అధికంగా ఉండాల్సింది.  - సునిల్ కనోరియా, అసోచామ్ ప్రెసిడెంట్

 ఆర్‌బీఐ ఊరటతో పెట్టుబడులు పుంజుకునేలా ఇక బ్యాంకులు కూడా రుణ రేట్లను తగ్గిస్తాయని భావిస్తున్నాం.
- హర్షవర్ధన్ నోతియా, ఫిక్కీ ప్రెసిడెంట్

 ఆర్‌బీఐ రెపో కోత కారణంగా గృహ రుణాలపై వడ్డీరేట్లు దిగిరావడం ద్వారా ఇళ్ల అమ్మకాలు పుంజుకునే ఆస్కారం ఉంది. గృహ కొనుగోలుదారులకు అర శాతం వడ్డీరేటు ఊరట ఉంటుందని భావిస్తున్నాం.  - గీతాంబర్ ఆనంద్, క్రెడాయ్ ప్రెసిడెంట్

 ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం...
ఆర్‌బీఐ రెపో రేట్ల కోత ఆర్థిక వ్యవస్థకు మంచి ఉత్తేజాన్నిస్తుంది. ఆర్‌బీఐ చర్యలకు అనుగుణంగా ప్రభుత్వం కూడా ఇక ద్రవ్య, పరపతి పరమైన చర్యల అమలుకు నడుంబిగిస్తుంది. అంతిమంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అవసరమైన తోడ్పాటునందించడమే ఆర్‌బీఐ, ప్రభుత్వం తక్షణ కర్తవ్యం. - జయంత్ సిన్హా, ఆర్థిక శాఖ సహాయ మంత్రి

 ఇక బ్యాంకులు అనుసరిస్తాయి...
ఆర్‌బీఐ పాలసీ నిర్ణయంతో ఇక బ్యాంకులు కూడా దీన్ని అనుసరించాల్సి ఉంటుంది. ఎంసీఎల్‌ఆర్ విధానం ఆధారంగా ఇప్పటికే కొన్ని బ్యాంకులు తమ రుణ రేట్లను సవరించాయి. ఇప్పుడు రెపో కోతతో వడ్డీరేట్లను మరింతగా తగ్గించాల్సిన అవసరం ఉంది.
- శక్తికాంత్ దాస్, కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement