సాక్షి, న్యూఢిల్లీ: ఎయిర్‌లైన్స్ తరహాలో పీక్ సీజన్ సమయంలో అదనపు చార్జీలు వసూలు చేయాలని రైల్వేలు యోచిస్తున్నాయి. పండగ సమయంలోనూ ప్రయాణీకులపై అదనపు చార్జీలు ముక్కుపిండి వసూలు చేసేందుకు కసరత్తు సాగుతోంది. అయితే అదే సమయంలో అన్‌సీజన్‌లో చార్జీల్లో డిస్కౌంట్ ఆఫర్ చేసేందుకూ సన్నద్థమవుతున్నాయి. సీనియర్ రైల్వే అధికారులు, బోర్డు సభ్యులతో ఇటీవల రైల్వే మంత్రి పీయూష్ గోయల్ భేటీ అయిన సందర్భంగా ఈ ప్రతిపాదనపై ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
ఎయిర్‌లైన్స్ అనుసరిస్తున్న డైనమిక్ ప్రైసింగ్ విధానం ప్రవేశపెట్టాలని రైల్వే బోర్డు ఈ సమావేశంలో ప్రతిపాదించగా సానుకూల స్పందన వ్యక్తమైందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు అవసరమైన సూచనలతో తూర్పు, పశ్చిమ, పశ్చిమ కేంద్ర రైల్వే జోన్‌లు సవివర ప్రజెంటేషన్‌తో ముందుకొచ్చాయి. అసౌకర్య వేళల్లో తిరిగే రైళ్లలో ప్రయాణీకులను ఆకర్షించేందుకు చార్జీల్లో భారీ రాయితీలు ఇవ్వాలని జోనల్ అధికారులు సూచించారు.
ఖాళీ బెర్త్‌లపై 10 నుంచి 30 శాతం డిస్కౌంట్ ఇవ్వాలనీ అధికారులు సూచించారు.ఇక పీక్ సీజన్, పండుగ వేళల్లో చార్జీలను 10 నుంచి 20 శాతం మేర పెంచాలని పలు జోనల్ అధికారులు ప్రతిపాదించారు. వారాంతాలతో పాటు దీపావళి, దసరా, క్రిస్‌మస్ వంటి పండుగల సమయంలో అదనపు చార్జీలను వసూలు చేయాలని సూచించారు.హైస్పీడ్ రైళ్లలోనూ ఆ రూట్‌లోని ఇతర రైళ్లతో పోలిస్తే అదనపు చార్జీలు ఉండాలని ప్రతిపాదించారు.
Comments
Please login to add a commentAdd a comment