జైట్లీతో రాజన్ భేటీ
న్యూఢిల్లీ: స్థూల ఆర్థిక అంశాలు చర్చించేందుకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. సాధారణంగానే జరిగే సమావేశాల్లో ఇది కూడా ఒకటని, ప్రత్యేకత ఏమీ లేదని భేటీ అనంతరం విలేఖరులకు రాజన్ తెలిపారు. ఆర్‌బీఐ వైఖరిని ఈ నెల 2న ప్రకటించిన పరపతి విధానంలోనే వివరించడం జరిగిందని ఆయన చెప్పారు. మరోవైపు, బ్యాంకుల వార్షిక పనితీరు, మొండి బకాయిల అంశాల గురించి చర్చించేందుకు జైట్లీ శుక్రవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో సమావేశం కానున్నారు.
ఆర్‌బీఐ కీలక పాలసీ రేట్లను తగ్గించినందున ఆ ప్రయోజనాలను ఖాతాదారులకు బదలాయించి.. వృద్ధికి తోడ్పడాలని ఆయన సూచించనున్నట్లు సమాచారం. అలాగే, జన ధన యోజన పథకం, సామాజిక భద్రత పథకాల పురోగతి గురించి చర్చించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్‌బీఐ రెపో రేటును (బ్యాంకులకిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ తీసుకునే వడ్డీ రేటు) ఇటీవలి పాలసీ సమీక్షలో 7.5 శాతం నుంచి 7.25 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే.