Reserve Bank Governor Raghuram Rajan
-
విదేశాలకు రహస్యాలు పంపారు!
► అందుకోసం షికాగో వర్సిటీ మెయిల్ ఐడీ వాడారు ► కావాలనే అధిక వడ్డీరేట్లతో పరిశ్రమల్ని మాంద్యంలోకి నెట్టారు ► ఆర్బీఐ గవర్నర్ రాజన్‌పై సుబ్రమణ్య స్వామి 6 ఆరోపణలు ► తక్షణం తొలగించాలంటూ ప్రధాని మోదీకి లేఖ న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్‌పై బీజేపీ పార ్లమెంటు సభ్యుడు సుబ్రమణ్య స్వామి మరోసారి విరుచుకుపడ్డారు. రాజన్ ఆర్బీఐ గవర్నర్‌గా అత్యంత ముఖ్యమైన పదవిలో ఉంటూ రహస్యమైన, కీలకమైన ఆర్థిక సమాచారాన్ని విదేశాలకు చేరవేశారనే తీవ్రమైన ఆరోపణ చేశారు. దీంతో పాటు మరో 5 ఆరోపణలు చే స్తూ... తక్షణం ఆయన్ను పదవి నుంచి తప్పించాల్సిందిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు మోదీకి ఆయనొక లేఖ రాశారు. ఐఎంఎఫ్‌లో ఒకనాడు చీఫ్ ఎకనమిస్ట్‌గా పనిచేసిన రాజన్... వడ్డీ రేట్లు పెంచేటపుడు దానివల్ల జరిగే పర్యవసానాలు కూడా తెలుసుకుని ఉండాలని, తన చర్యలు దేశ ప్రయోజనాలకు విరుద్ధమని తెలిసి కూడా ఆయన ఉద్దేశపూర్వకంగా వడ్డీ రేట్లు పెంచారని స్వామి ఆరోపించారు. అయితే భారతదేశంలో ఎక్కువ మంది పొదుపుపైన, వాటిపై వచ్చే వడ్డీపైన ఆధారపడతారు కనక వడ్డీరేట్లను భారీగా తగ్గించటం మంచిది కాదని గతంలో రాజన్ చెప్పటం ఈ సందర్భంగా గమనార్హం. అమెరికా గ్రీన్ కార్డు అలాగే ఉంది... ‘దేశీ పరిశ్రమల్ని బలవంతంగా మాంద్యంలోకి నెట్టడానికే రాజన్ వడ్డీరేట్లు తగ్గించలేదు. ఆర్బీఐ చట్టం అనుమతించకపోయినా ఆర్థిక సంస్థలు షరియా నిబంధనల ప్రకారం నడుచుకునేందుకు రాజన్ ఓకే అన్నారు. అమెరికాలో తనకున్న గ్రీన్ కార్డును అలాగే ఉంచుకుని... కీలకమైన రహస్య సమాచారాన్ని ప్రపంచమంతటికీ పంపించారు. ఇలా పంపించడానికి షికాగో యూనివర్సిటీ మెయిల్ ఐడీని ఉపయోగించుకున్నారు. పెపైచ్చు బహిరంగంగా మోదీని వ్యతిరేకించారు. కారణమేమిటంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవటానికి అమెరికా ఏర్పాటు చేసుకున్న 30 మంది గ్రూపులో ఈయన కూడా సభ్యుడు’’ అంటూ స్వామి తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. ప్రాథమిక ఆధారాలున్నాయి కనక ఆయన్ను తక్షణం పదవి నుంచి తొలగించాలని మోదీని కోరారు. ఆర్బీఐ గవర్నర్ పదవిలో ఉన్నవారికి కాస్త దేశభక్తీ ఉండాలని చెప్పారాయన. రాజన్ వల్లే నిరుద్యోగులు పెరిగారు... అధిక వడ్డీ రేట్ల కోసం రాజన్ ఒత్తిడి చేయటం వల్ల పరిశ్రమలు మాంద్యంలోకి వెళ్లాయని, పలువురు నిరుద్యోగులయ్యారని స్వామి ఆరోపించారు. ప్రభుత్వ పరమైన పదవిలో ఉండి కూడా బహిరంగంగా మోదీ ప్రభుత్వాన్ని విమర్శించటం సరికాదన్నారు. కాగా ఈ వ్యాఖ్యలపై రఘురామ్ రాజన్ నుంచి ఎలాంటి ప్రతిస్పందనా రాలేదు. కాగా, స్వామి ఆరోపణల నేపథ్యంలో రాజన్‌ను ఆర్బీఐ గవర్నరు పదవి నుంచి తప్పిస్తారా? అని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను విలేకరులు ప్రశ్నించగా... బీజేపీ అధికారికంగా చెప్పే మాటల్నే తాను చెబుతానంటూ ఆయన తప్పించుకున్నారు. వ్యక్తిగత ఆరోపణల్ని ఆమోదించం: జైట్లీ ఎవరైనా సరే! వేరొకరిని వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుని చేసే విమర్శల్ని తాము ఆమోదించబోమని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. స్వామి ఆరోపణలపై విలేకరులు ప్రశ్నించగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆర్బీఐ చాలా కీలకమైన వ్యవస్థ. దాని నిర్ణయాలు అందరినీ ప్రభావితం చేస్తాయి. ఆ నిర్ణయాలు సరైనవా? కావా? అన్నది చర్చించటంలో తప్పులేదు. కానీ వ్యక్తిగతంగా చేసే విమర్శల్ని మేం ఆమోదించం’’ అన్నారాయన. -
ఆర్థిక మంత్రి జైట్లీతో రాజన్ భేటీ
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ బుధవారం సమావేశమయ్యారు. జూన్ 7న పాలసీ సమీక్ష నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్ లోటు వంటి కీలకాంశాలపై వీరిరువురి మధ్యా చర్చ జరిగిందని భావిస్తున్నారు. సెప్టెంబర్ 4తో ముగుస్తున్న రాజన్ పదవీకాలాన్ని పొడిగించరాదని, అధిక వడ్డీరేట్ల వ్యవస్థతో ఆయన దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టారని ఒకపక్క బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యం స్వామి విమర్శల నేపథ్యంలో జైట్లీ-రాజన్ భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. సమావేశానంతరం విలేకరులతో మాట్లాడటానికి జైట్లీ నిరాకరించారు. -
జైట్లీతో ఆర్బీఐ గవర్నర్ భేటీ
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ మంగళవారం సమావేశమయ్యారు. పలు ఆర్థిక అంశాలపై వీరిరువురి మధ్యా చర్చ జరిగినట్లు భావిస్తున్నారు. కాగా ఇది మామూలుగా జరిగే సమావేశమేనని జైట్లీతో సమావేశం అనంతరం రాజన్ అన్నారు. ఫిబ్రవరి 2వ తేదీన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరపనుంది. రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్‌లో 14 నెలల గరిష్ట స్థాయి 5.41 శాతానికి ఎగయడం, వేతనాల పెంపు నేపథ్యంలో 3.9 శాతం వద్ద (జీడీపీలో) ద్రవ్యలోటు కట్టడి లక్ష్య సాధనపై అనుమానాలు, ఎనిమిది పారిశ్రామిక రంగాల గ్రూప్ 2015 నవంబర్‌లో 2014 నవంబర్‌తో పోల్చిచూస్తే... ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా 1.3 శాతం క్షీణత (మైనస్), తయారీ రంగం డిసెంబర్లో భారీగా పడిపోయిందని వివిధ సంస్థల అంచనాలు, చైనాలో మందగమనంపై తాజా ఆందోళనలు... తత్సంబంధ అంశాల నేపథ్యంలో జరిగిన తాజా జైట్లీ-రాజన్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. -
కంపెనీలకు దివాలా చర్యల భయం ఉండాలి..
న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు ఎగవేస్తే కఠిన చర్యలు ఉంటాయనే భయం కంపెనీలకు ఉండాలని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను రక్షించేందుకు సంస్కరణలు అత్యంత ఆవశ్యకమని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దివాలా చట్టానికి సంబంధించిన కొత్త కోడ్‌ను తేవడం అవసరమని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్త దివాలా కోడ్‌ను తీసుకొచ్చే ప్రక్రియను ఇప్పటికే చేపట్టింది. ఇలాంటివి లేకపోతే కంపెనీలకు దివాలా చర్యల భయం ఉండదని, ఎంతసేపూ వాటిని గట్టెక్కించే భారం బ్యాంకులపై ఉంటుందని రాజన్ చెప్పారు. ‘‘దివాలా చట్టం లేకపోతే.. ‘నా సమస్య ఇప్పుడు నీ సమస్య కూడా .. నువ్వెంత నష్టపోవడానికి సిద్ధంగా ఉన్నావంటూ’ కంపెనీలు బ్యాంకులను బెదిరించే పరిస్థితి ఉంటుంది. ఇలా వ్యాపారవేత్తలకు పూర్తి ప్రయోజనకరంగాను .. బ్యాంకులకు ప్రతికూలంగానూ పరిస్థితి ఉండకూడదు. ఇది మారాలి’ అని రాజన్ వ్యాఖ్యానించారు. కాంట్రాక్టును అక్షరాల అమలు చేయాల్సిందేనన్న సిసలైన క్యాపిటలిజం ధోరణిని మళ్లీ తేవాలని ఒక ఆంగ్ల టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యులో రాజన్ చెప్పారు. ఇందులో భాగంగానే ఒప్పందాల విషయంలో పక్కాగా వ్యవహరించేలా బ్యాంకులకు మరిన్ని అధికారాలు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నామని ఆయన పేర్కొన్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో దివాలా చట్టానికి సంబంధించిన సంస్కరణలను ప్రభుత్వం ప్రవేశపెట్టగలదని రాజన్ ఆశాభావం వ్యక్తం చేశారు. సులభతరంగా వ్యాపార నిర్వహణ అంశంపై ప్రపంచ బ్యాంకు 189 దేశాలపై జరిపిన సర్వేలో భారత్ కు 130వ ర్యాంకు దక్కిన సంగతి తెలిసిందే. రెండు దేశీ సంస్థల మధ్య కాంట్రాక్టు వివాదం పరిష్కరించడానికి భారత్‌లో 1,420 రోజులు పడుతుందని, క్లెయిమ్ మొత్తంలో దాదాపు 40 శాతం ఖర్చవుతుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. ఈ విషయంలో భారత్‌కు 178వ స్థానం దక్కింది. -
చైనా‘వాల్’ను..ఇప్పట్లో దాటలేం!
ఆ దేశ పరిమాణంలో మనది అయిదో వంతే... - ప్రపంచ వృద్ధి చోదకంగా మారేందుకు బోలెడు సమయం కావాలి - ఎకానమీ సమస్యల పరిష్కారానికి సంస్కరణలే మార్గం... - సెంట్రల్ బ్యాంకుల అతి జోక్యం అనర్థదాయకం... - ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ లండన్: భారత్ ఎంత వేగంగా ఎదిగినా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వృద్ధి చోదకంగా చైనాను అధిగమించాలంటే చాలా కాలమే పట్టేస్తుందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. చైనా పరిమాణంలో భారత్ నాలుగో వంతో, అయిదో వంతో మాత్రమే ఉంటుందని ఒక ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు. ఒకవేళ వృద్ధి రేటులో చైనాను భారత్ అధిగమించినా, చాలా కాలం పాటు దాని ప్రభావం అతి తక్కువ స్థాయిలోనే ఉంటుందని ఆయన చెప్పారు. చైనా మందగమనంతో.. గ్లోబల్ ఎకానమీ ప్రత్యామ్నాయ వృద్ధి చోదక శక్తిగా ఎదిగే అవకాశాలను భారత్ అందిపుచ్చుకోవాలన్న వార్తలు ఊపందుకున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ సంక్షోభాన్ని అవకాశంగా మలచుకునేందుకు భారత ఎకానమీని పటిష్టం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కూడా పిలుపునిచ్చారు. అంతర్జాతీయ సంక్షోభం గురించి ఆందోళన చెందనక్కర్లేదని, వేగవంతమైన సంస్కరణలతో భారత్ వృద్ధి చెందేందుకు ఇది సరైన అవకాశమని అటు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సైతం చెప్పారు. ఈ నేపథ్యంలో నే రాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం అమెరికా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 17 లక్షల కోట్ల డాలర్లు కాగా చైనా జీడీపీ 10 లక్షల కోట్ల డాలర్లు. వీటితో పోలిస్తే భారత్ జీడీపీ 2 లక్షల కోట్ల డాలర్లే. పెద్ద దేశమైన చైనా.. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలక దేశంగా ఎదిగిందని రాజన్ చెప్పారు. ఎక్కడ ఏం జరిగినా ప్రపంచమంతటా ఆ ప్రభావాలు కనిపిస్తాయని, అయితే గ్లోబల్ మార్కెట్లు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ చైనాయే కారణమని నెట్టేయడం తప్పవుతుందన్నారు. సెంట్రల్ బ్యాంకులపై భారం మోపొద్దు.. ప్రపంచవ్యాప్తంగా సమస్యల వలయంలో చిక్కుకున్న దేశాలు పరిస్థితులను చక్కదిద్దే భారాన్ని సెంట్రల్ బ్యాంకులపై వేస్తున్నాయని, ఇది సరికాదని రాజన్ చెప్పారు. ఇప్పటి పరిస్థితుల్లో సెంట్రల్ బ్యాంకులు మితిమీరి జోక్యం చేసుకుంటే మేలు కన్నా ఎక్కువగా కీడే జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎకానమీలో సమస్యలను సంస్కరణల ద్వారానే పరిష్కరించాలి తప్ప సెంట్రల్ బ్యాంకుల మితిమీరిన జోక్యం అనర్థదాయకమవుతుందని రాజన్ తెలిపారు. వడ్డీ రేట్లను సున్నా స్థాయికి తగ్గించేసిన తర్వాత ఇక వాటి దగ్గర వేరే సాధనాలేమీ మిగలవని రాజన్ చెప్పారు. భారత్‌లో పరిస్థితి వేరు.. మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని రాజన్ చెప్పారు. ఇక్కడ ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో దాదాపు 6 శాతం మేర ఉందని, దీన్ని పరిష్కరించాల్సిందేని పేర్కొన్నారు. ఈ ఏడాది మూడు దఫాలు తగ్గించినప్పటికీ వడ్డీ రేట్లు 7.25 శాతంగా ఇంకా అధిక స్థాయిలోనే ఉన్నాయని ఆయన చెప్పారు. మన విదేశీ నిల్వలు సరిపోవు: కౌశిక్ బసు ముంబై: ప్రస్తుతం మనకున్న 35,400 కోట్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలు సంక్షోభాన్ని తట్టుకోవడానికి సరిపోవని ప్రపంచ బ్యాంక్ ముఖ్య ఆర్ధికవేత్త కౌశిక్ బసు వ్యాఖ్యానించారు. మరిన్ని కరెన్సీ నిల్వలను సమకూర్చుకోవడమే సరైన వ్యూహమని పేర్కొన్నారు. చైనా విదేశీ మారక ద్రవ్య నిల్వలు 4 లక్షల కోట్ల డాలర్లని, దీంతో పోల్చితే మన నిల్వలు ఏ మూలకు సరిపోవని వివరించారు. ప్రస్తుత సంక్షోభాన్ని తట్టుకునే స్థాయిలోనే మన విదేశీ మారక ద్రవ్య నిల్వలున్నాయని ఇటీవల ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్న విషయం తెలిసిందే. మరో సంక్షోభ భయాలు అక్కర్లేదు.. 2007-08 నాటి అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే అంచనా వేసిన రాజన్.. ప్రస్తుతం మాత్రం సమీప భవిష్యత్‌లో మరో భారీ సంక్షోభ భయాలేమీ అక్కర్లేదని చెప్పారు. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా తలెత్తిన బలహీనతలను పరిష్కరించుకోవడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. -
జైట్లీతో రాజన్ భేటీ
న్యూఢిల్లీ: స్థూల ఆర్థిక అంశాలు చర్చించేందుకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. సాధారణంగానే జరిగే సమావేశాల్లో ఇది కూడా ఒకటని, ప్రత్యేకత ఏమీ లేదని భేటీ అనంతరం విలేఖరులకు రాజన్ తెలిపారు. ఆర్బీఐ వైఖరిని ఈ నెల 2న ప్రకటించిన పరపతి విధానంలోనే వివరించడం జరిగిందని ఆయన చెప్పారు. మరోవైపు, బ్యాంకుల వార్షిక పనితీరు, మొండి బకాయిల అంశాల గురించి చర్చించేందుకు జైట్లీ శుక్రవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో సమావేశం కానున్నారు. ఆర్బీఐ కీలక పాలసీ రేట్లను తగ్గించినందున ఆ ప్రయోజనాలను ఖాతాదారులకు బదలాయించి.. వృద్ధికి తోడ్పడాలని ఆయన సూచించనున్నట్లు సమాచారం. అలాగే, జన ధన యోజన పథకం, సామాజిక భద్రత పథకాల పురోగతి గురించి చర్చించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్బీఐ రెపో రేటును (బ్యాంకులకిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ తీసుకునే వడ్డీ రేటు) ఇటీవలి పాలసీ సమీక్షలో 7.5 శాతం నుంచి 7.25 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. -
ఆర్థిక మంత్రి జైట్లీతో రాజన్ భేటీ
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో బుధవారం ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ భేటీ అయ్యారు. జూన్ 2 పాలసీ సమీక్ష నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సందర్భంగా స్థూల ఆర్థిక అంశాలకు సంబంధించి వీరిద్దరిమధ్యా విస్తృత స్థాయిలో చర్చ జరిగిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ‘మేము పలు అంశాలపై చర్చించుకున్నాము’ అని సమావేశం అనంతరం విలేకరులతో రాజన్ అన్నారు. రేట్ల కోత... కేంద్రం కోరిక! ద్రవ్యోల్బణం రేటు కట్టడిలో ఉన్నందున రేట్ల కోత నిర్ణయం ద్వారా వృద్ధికి ఊతం ఇవ్వాలని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ మంగళవారం ఆకాంక్షించిన నేపథ్యంలో ఈ అంశంపై ఆసక్తి మరింత పెరిగింది. సాధారణంకన్నా తక్కువ వర్షపాతం నమోదయినప్పటికీ, తగిన ఆహార నిల్వలు ఉన్నాయని ఆయన పేర్కొంటూ... ఇది ద్రవ్యోల్బణాన్ని భవిష్యత్తులో కట్టడిలో ఉంచే అంశమని అన్నారు. గత వారం ఆర్థిక మంత్రి సైతం రేట్ల కోత ఆకాంక్షను వ్యక్తం చేశారు. రేట్ల కోతకు ఇది తగిన సమయమని అన్నారు. అసోచామ్, సిటీగ్రూప్ అంచనా అదే... కాగా రానున్న 2వ తేదీన రెపోరేటు పావుశాతం తగ్గింపు నిర్ణయం ఆర్బీఐ తీసుకుంటుందన్న అభిప్రాయాన్ని అసోచామ్, సిటీగ్రూప్‌లు వ్యక్తం చేశా యి. ద్రవ్యోల్బణం అదుపులో ఉన్న నేపథ్యంలో ఆర్బీఐ ఈ దిశలో నిర్ణయం తీసుకుంటుందన్న అభిప్రాయాన్ని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ వ్యక్తం చేశారు. ఈ ఏడాది 50 బేసిస్ పాయింట్ల రెపో కోత ఉంటుందని భావిస్తున్నట్లు కూడా తెలిపారు. కొనుగోలు శక్తి తక్కువగా ఉండి డిమాండ్ తగ్గడం, పారిశ్రామిక ఉత్పత్తి, చమురుయేతర ఎగుమతులు, రుణ వృద్ధి అంశాల్లో ప్రతికూలతలతో పాటు ద్రవ్యోల్బణం తగిన స్థాయిల్లో ఉండడం రేట్ల కోత అంచనాలకు బలాన్నిస్తున్న అంశాలని సిటీగ్రూప్ పరిశోధనా నివేదికలో సంస్థ ఇండియా ఎకనమిస్ట్ అనురాగ్ పేర్కొన్నారు. -
మోదీ సర్కార్‌పై అతి అంచనాలు
అయినా మెరుగ్గానే కొత్త ప్రభుత్వం పనితీరు ⇒ పెట్టుబడులకు అనువైన పరిస్థితుల కల్పన ⇒ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ న్యూయార్క్: ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో గతేడాది ఏర్పడిన కొత్త ప్రభుత్వంపై వాస్తవ పరిస్థితులను మించి అంచనాలు నెలకొన్నాయని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. అయితే, ఇన్వెస్టర్ల సమస్యలను పరిగణనలోకి తీసుకుంటూ ప్రభుత్వం.. పెట్టుబడులకు అనుకూల పరిస్థితులను కల్పించేందుకు చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు. ఎకనామిక్ క్లబ్ ఆఫ్ న్యూయార్క్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రాజన్ ఈ విషయాలు చెప్పారు. ‘ఈ ప్రభుత్వం భారీ అంచనాలతో అధికారంలోకి వచ్చింది. ఏ కొత్త ప్రభుత్వంపైనైనా ఇంత భారీగా ఆశలు ఉండటం సరికాకపోవచ్చు. అప్పట్లో రోనాల్డ్ రీగన్ (అమెరికా మాజీ అధ్యక్షుడు) మార్కెట్ వ్యతిరేక శక్తులను సంహరించేందుకు శ్వేతాశ్వంపై వచ్చిన తరహా ఇమేజ్‌తో ప్రస్తుతం మోదీని ఊహించుకున్నారు. ఈ రెండింటికీ పొంతన లేదు’ అని ఆయన పేర్కొన్నారు. ఇన్వెస్టర్ల ఆందోళనలను అర్థం చేసుకున్న కొత్త ప్రభుత్వం.. ఆర్థికపరమైన సమస్యల పరిష్కారంపై దృష్టి పెడుతోందని రాజన్ పేర్కొన్నారు. వివాదాస్పదమైన రెట్రాస్పెక్టివ్ ట్యాక్సేషన్ (గతకాలపు లావాదేవీలపై పన్నులు)ను మళ్లీ ప్రవేశపెట్టబోమని స్పష్టం చేసిందని చెప్పారు. అలాగే కార్పొరేట్ ట్యాక్స్ కూడా ఏటా ఒక్క శాతం చొప్పున తగ్గనుందన్నారు. ఇక, ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని చూరగొనేలా, వృద్ధికి దోహదపడేలా చర్యలు తీసుకోవడంలో మోదీ సర్కార్ గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. పెట్రోల్, డీజిల్ సబ్సిడీలను ఎత్తివేయడంతో పాటు వంట గ్యాస్ సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు రాజన్ చెప్పారు. వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానం వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నాటికల్లా అమల్లోకి రాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. భారీ పెట్టుబడి ప్రణాళికలు.. రవాణా కారిడార్లు, పారిశ్రామిక కారిడార్లు మొదలైన వాటిపై కొత్త ప్రభుత్వం భారీ పెట్టుబడి ప్రణాళికలు సిద్ధం చేసిందని రాజన్ చెప్పారు. ఇతర కరెన్సీలతో పోలిస్తే రూపాయి మారకం విలువలో భారీ మార్పులు తగ్గాయని, డాలర్‌తో పోలిస్తే అత్యంత స్థిరంగా ఉన్న కరెన్సీల్లో రూపాయి కూడా ఒకటిగా ఉంటోందని రాజన్ చెప్పారు. అలాగే ద్రవ్యోల్బణమూ దిగి వస్తోందన్నారు. పెట్టుబడులు మరింత వేగం పుంజుకోవాల్సి ఉందని రాజన్ చెప్పారు. అటు బ్యాంకింగ్ వ్యవస్థను కూడా ప్రక్షాళన చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. సెంట్రల్ బ్యాంకులు బాధ్యతల నుంచి తప్పుకోలేవు దేశీయంగా తీసుకోవాల్సిన చర్యలు ఎలా ఉన్నప్పటికీ వివిధ దేశాలకు చెందిన సెంట్రల్ బ్యాంకులు అంతర్జాతీయంగా తమ బాధ్యతల నుంచి తప్పుకోజాలవని రాజన్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వంటి సంస్థలు, అసాధారణమైన ద్రవ్య విధానాలన్నింటినీ విశ్లేషించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. దాదాపు ప్రతి పారిశ్రామిక దేశంలోనూ ప్రజాకర్షక విధానాలపైనే దృష్టి ఉంటోందని, దీనివల్ల వాణిజ్య, ఆర్థికాంశాల విషయంలో ప్రతికూల విధానాలు ఉంటున్నాయని రాజన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ ద్రవ్య విధానంలో ఒక పద్ధతంటూ లేకపోవడం వల్ల ఇటు వృద్ధికి అటు ఆర్థిక రంగానికి గణనీయమైన రిస్కులు పొంచి ఉన్నాయన్నారు. -
తక్కువ వడ్డీ రేట్లు ముఖ్యమే, కానీ..
డిమాండే అత్యంత కీలకం: రాజన్ న్యూయార్క్: ద్రవ్యపరపతి విధానాలను సడలించాలంటూ ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులపై ఒత్తిళ్లు పెరుగుతుండటంపై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టుబడులు ఆకర్షించేందుకు తక్కువ స్థాయి వడ్డీ రేట్లు, పన్నులపరమైన ప్రోత్సాహకాలు ముఖ్యమే అయినప్పటికీ.. ఆర్థిక వృద్ధి సాధించాలంటే వినియోగపరమైన డిమాండ్ అత్యంత కీలకమని ఆయన చెప్పారు. న్యూయార్క్‌లోని ఎకనామిక్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రాజన్ ఈ విషయాలు తెలిపారు. అంతర్జాతీయంగా ద్రవ్య విధానంలో ప్రస్తుతం ఒక పద్ధతంటూ లేకపోవడం వల్ల ఇటు నిలకడైన వృద్ధికి అవకాశం లేకుండా పోయిందని, అటు ఆర్థిక రంగానికి గణనీయమైన ముప్పు ఉందని ఆయన చెప్పారు. సాధారణంగా తక్కువ వడ్డీ రేట్లు, పన్నులపరమైన ప్రయోజనాలిచ్చే పెట్టుబడులు, ఉపాధి కల్పనను ప్రోత్సహించడం జరుగుతుందని ఆయన చెప్పారు. అయితే, రుణాల భారం వల్ల సుదీర్ఘకాలం పాటు వినియోగదారుల నుంచి డిమాండ్ బలహీనంగా ఉన్నప్పుడు .. కొత్త పెట్టుబడులపై రాబడులు అంతగా ఉండబోవని రాజన్ తెలిపారు. పాలసీ రేట్లను సున్నా స్థాయి కన్నా కూడా తక్కువకి తగ్గించడం సాధ్యం కాదని, చాలా మటుకు యూరోపియన్ దేశాలు ఈ విషయంలో పరిమితికి మించి చర్యలు తీసుకుంటున్నాయని ఆయన చెప్పారు. -
మేకిన్ ఇండియాకు డిమాండ్ కీలకం: రాజన్
చండీగఢ్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమం విజయవంతం కావాలంటే దేశీయంగా తగినంత డిమాండ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. అలాగే, అంతర్జాతీయంగా విదేశీ కంపెనీలతో దీటుగా పోటీపడేలా దేశీ సంస్థలకు తోడ్పాటునివ్వాల్సి ఉంటుందన్నారు. వ్యవసాయ రంగాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు మేకిన్ ఇండియాను ఉపయోగించుకోవచ్చని రాజన్ పేర్కొన్నారు. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ రూరల్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. -
పొదుపు పెరిగేలా ఐటీ మినహాయింపులు
* ఆర్బీఐ గవర్నర్ రాజన్ సూచన * ద్రవ్యోల్బణం ఆందోళనకరమేనని వ్యాఖ్య ముంబై: ఆదాయపు పన్ను చెల్లించేవారికి సెక్షన్ 80సీ కింద లభించే పన్ను మినహాయింపు పరిమితిని రూ.1.5 లక్షల నుంచి మరింత పెంచాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. చాలా కాలం పాటు రూ. లక్ష వద్దే ఈ పరిమితి ఉందని, మన పొదుపు రేట్లు భారీగా పెరగకపోవడానికి ఇదీ ఒక కారణమని తెలియజేశారు. గత బడ్జెట్లో ఈ మొత్తాన్ని రూ.1.5 లక్షలు చేసినప్పటికీ ఆర్థిక పథకాల ద్వారా వ్యక్తులు మరింత ప్రయోజనం పొందడానికి ఈ మొత్తాన్ని ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. ద్రవ్య పరపతి విధాన సమీక్ష అనంతర సమావేశంలో రాజన్ ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 28న బడ్జెట్ రానుండటంతో రాజన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, న్యూ పెన్షన్ స్కీమ్, బీమా పాలసీలు, ఈక్విటీ అనుసంధాన పొదుపు పధకాలన్నీ 80సీ పరిధిలోకి వస్తాయి. వీటిలో రూ.1.50 లక్షల వరకూ పెట్టే పెట్టుబడులపై ఇపుడు ఐటీ మినహాయింపు ఉంది. 2008 ఆర్థిక సంవత్సరంలో 36.9 శాతంగా ఉన్న దేశ పొదుపు రేటు ప్రస్తుతం 30 శాతానికి పడిపోయిన విషయాన్ని రాజన్ ప్రస్తావించారు. మూలధన పెట్టుబడులు పెరగాలి... ఎటువంటి దుర్వినియోగం కాకుండా సబ్సిడీలను హేతుబద్దీకరించడంతోపాటు మూలధన పెట్టుబడులను పెంచడం ద్వారా ద్రవ్య స్థిరీకరణ జరగాలని ఆర్బీఐ కోరుకుంటున్నట్లు రాజన్ చెప్పారు. దీనివల్ల దేశానికి భారీ ఆర్థిక ప్రయోజనాలు ఒనగూరుతాయన్నారు. మూలధన పెట్టుబడుల పెంపు వల్ల సరఫరాల వైపు సమస్యలూ తగ్గుతాయని, ఇది ద్రవ్యోల్బణం కట్టడికి దోహదపడుతుందని విశ్లేషించారు. ద్రవ్యోల్బణంపై ఇంకా ఆందోళనలున్నాయని రాజన్ ఈ సందర్భంగా చెప్పారు. ప్రస్తుతానికి ద్రవ్యోల్బణం అత్యంత దిగువశ్రేణిలో ఉన్నప్పటికీ తిరిగి ఇవి పెరిగే అవకాశాలు లేకపోలేదని అన్నారు. 9వ తేదీ జీడీపీ గణాంకాలపై దృష్టి! భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలకు సంబంధించి... ఆ గణాంకాలను లెక్కించే పద్ధతుల ప్రాతిపదికన ఆర్బీఐ విధానం మారిపోదని రాజన్ వ్యాఖ్యానించారు. ఇటీవల బేస్ రేటు మార్పుతో (2004-05 నుంచి 2011-12గా) వెలువడిన జీడీపీ సవరింపు గణాంకాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థికాభివృద్ధికి సంబంధించి గాయాల బాధ తీవ్రత నుంచి మనం బైటపడ్డాం తప్ప, గాయాల నుంచి మాత్రం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్పీఏల సంక్షోభం రాదు.. మొండి బకాయిల వల్ల భారత బ్యాంకింగ్ వ్యవస్థలో ఎటువంటి సంక్షోభ పరిస్థితులూ తలెత్తవని రాజన్ చెప్పారు. ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయంటూ... పెట్టుబడుల విషయంలో ఆయా బ్యాంకులకు ప్రభుత్వ మద్దతు ఉన్నందువల్ల వ్యవస్థలో సంక్షోభ పరిస్థితి తలెత్తే అవకాశం ఉండబోదని ఓ ఇంటర్వ్యూలో వివరించారు.