చైనా‘వాల్’ను..ఇప్పట్లో దాటలేం!
ఆ దేశ పరిమాణంలో మనది అయిదో వంతే...
- ప్రపంచ వృద్ధి చోదకంగా మారేందుకు బోలెడు సమయం కావాలి
- ఎకానమీ సమస్యల పరిష్కారానికి సంస్కరణలే మార్గం...
- సెంట్రల్ బ్యాంకుల అతి జోక్యం అనర్థదాయకం...
- ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్
లండన్: భారత్ ఎంత వేగంగా ఎదిగినా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వృద్ధి చోదకంగా చైనాను అధిగమించాలంటే చాలా కాలమే పట్టేస్తుందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. చైనా పరిమాణంలో భారత్ నాలుగో వంతో, అయిదో వంతో మాత్రమే ఉంటుందని ఒక ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు. ఒకవేళ వృద్ధి రేటులో చైనాను భారత్ అధిగమించినా, చాలా కాలం పాటు దాని ప్రభావం అతి తక్కువ స్థాయిలోనే ఉంటుందని ఆయన చెప్పారు.
చైనా మందగమనంతో.. గ్లోబల్ ఎకానమీ ప్రత్యామ్నాయ వృద్ధి చోదక శక్తిగా ఎదిగే అవకాశాలను భారత్ అందిపుచ్చుకోవాలన్న వార్తలు ఊపందుకున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ సంక్షోభాన్ని అవకాశంగా మలచుకునేందుకు భారత ఎకానమీని పటిష్టం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కూడా పిలుపునిచ్చారు. అంతర్జాతీయ సంక్షోభం గురించి ఆందోళన చెందనక్కర్లేదని, వేగవంతమైన సంస్కరణలతో భారత్ వృద్ధి చెందేందుకు ఇది సరైన అవకాశమని అటు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సైతం చెప్పారు.
ఈ నేపథ్యంలో నే రాజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం అమెరికా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 17 లక్షల కోట్ల డాలర్లు కాగా చైనా జీడీపీ 10 లక్షల కోట్ల డాలర్లు. వీటితో పోలిస్తే భారత్ జీడీపీ 2 లక్షల కోట్ల డాలర్లే. పెద్ద దేశమైన చైనా.. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలక దేశంగా ఎదిగిందని రాజన్ చెప్పారు. ఎక్కడ ఏం జరిగినా ప్రపంచమంతటా ఆ ప్రభావాలు కనిపిస్తాయని, అయితే గ్లోబల్ మార్కెట్లు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ చైనాయే కారణమని నెట్టేయడం తప్పవుతుందన్నారు.
సెంట్రల్ బ్యాంకులపై భారం మోపొద్దు..
ప్రపంచవ్యాప్తంగా సమస్యల వలయంలో చిక్కుకున్న దేశాలు పరిస్థితులను చక్కదిద్దే భారాన్ని సెంట్రల్ బ్యాంకులపై వేస్తున్నాయని, ఇది సరికాదని రాజన్ చెప్పారు. ఇప్పటి పరిస్థితుల్లో సెంట్రల్ బ్యాంకులు మితిమీరి జోక్యం చేసుకుంటే మేలు కన్నా ఎక్కువగా కీడే జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎకానమీలో సమస్యలను సంస్కరణల ద్వారానే పరిష్కరించాలి తప్ప సెంట్రల్ బ్యాంకుల మితిమీరిన జోక్యం అనర్థదాయకమవుతుందని రాజన్ తెలిపారు. వడ్డీ రేట్లను సున్నా స్థాయికి తగ్గించేసిన తర్వాత ఇక వాటి దగ్గర వేరే సాధనాలేమీ మిగలవని రాజన్ చెప్పారు.
భారత్‌లో పరిస్థితి వేరు..
మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని రాజన్ చెప్పారు. ఇక్కడ ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో దాదాపు 6 శాతం మేర ఉందని, దీన్ని పరిష్కరించాల్సిందేని పేర్కొన్నారు. ఈ ఏడాది మూడు దఫాలు తగ్గించినప్పటికీ వడ్డీ రేట్లు 7.25 శాతంగా ఇంకా అధిక స్థాయిలోనే ఉన్నాయని ఆయన చెప్పారు.
మన విదేశీ నిల్వలు సరిపోవు: కౌశిక్ బసు
ముంబై: ప్రస్తుతం మనకున్న 35,400 కోట్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలు సంక్షోభాన్ని తట్టుకోవడానికి సరిపోవని ప్రపంచ బ్యాంక్ ముఖ్య ఆర్ధికవేత్త కౌశిక్ బసు వ్యాఖ్యానించారు. మరిన్ని కరెన్సీ నిల్వలను సమకూర్చుకోవడమే సరైన వ్యూహమని పేర్కొన్నారు. చైనా విదేశీ మారక ద్రవ్య నిల్వలు 4 లక్షల కోట్ల డాలర్లని, దీంతో పోల్చితే మన నిల్వలు ఏ మూలకు సరిపోవని వివరించారు. ప్రస్తుత సంక్షోభాన్ని తట్టుకునే స్థాయిలోనే మన విదేశీ మారక ద్రవ్య నిల్వలున్నాయని ఇటీవల ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్న విషయం తెలిసిందే.
మరో సంక్షోభ భయాలు అక్కర్లేదు..
2007-08 నాటి అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే అంచనా వేసిన రాజన్.. ప్రస్తుతం మాత్రం సమీప భవిష్యత్‌లో మరో భారీ సంక్షోభ భయాలేమీ అక్కర్లేదని చెప్పారు. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా తలెత్తిన బలహీనతలను పరిష్కరించుకోవడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.