విదేశాలకు రహస్యాలు పంపారు!
► అందుకోసం షికాగో వర్సిటీ మెయిల్ ఐడీ వాడారు
► కావాలనే అధిక వడ్డీరేట్లతో పరిశ్రమల్ని మాంద్యంలోకి నెట్టారు
► ఆర్‌బీఐ గవర్నర్ రాజన్‌పై సుబ్రమణ్య స్వామి 6 ఆరోపణలు
► తక్షణం తొలగించాలంటూ ప్రధాని మోదీకి లేఖ
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్‌పై బీజేపీ పార ్లమెంటు సభ్యుడు సుబ్రమణ్య స్వామి మరోసారి విరుచుకుపడ్డారు. రాజన్ ఆర్‌బీఐ గవర్నర్‌గా అత్యంత ముఖ్యమైన పదవిలో ఉంటూ రహస్యమైన, కీలకమైన ఆర్థిక సమాచారాన్ని విదేశాలకు చేరవేశారనే తీవ్రమైన ఆరోపణ చేశారు. దీంతో పాటు మరో 5 ఆరోపణలు చే స్తూ... తక్షణం ఆయన్ను పదవి నుంచి తప్పించాల్సిందిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు మోదీకి ఆయనొక లేఖ రాశారు. ఐఎంఎఫ్‌లో ఒకనాడు చీఫ్ ఎకనమిస్ట్‌గా పనిచేసిన రాజన్... వడ్డీ రేట్లు పెంచేటపుడు దానివల్ల జరిగే పర్యవసానాలు కూడా తెలుసుకుని ఉండాలని, తన చర్యలు దేశ ప్రయోజనాలకు విరుద్ధమని తెలిసి కూడా ఆయన ఉద్దేశపూర్వకంగా వడ్డీ రేట్లు పెంచారని స్వామి ఆరోపించారు. అయితే భారతదేశంలో ఎక్కువ మంది పొదుపుపైన, వాటిపై వచ్చే వడ్డీపైన ఆధారపడతారు కనక వడ్డీరేట్లను భారీగా తగ్గించటం మంచిది కాదని గతంలో రాజన్ చెప్పటం ఈ సందర్భంగా గమనార్హం.
అమెరికా గ్రీన్ కార్డు అలాగే ఉంది...
‘దేశీ పరిశ్రమల్ని బలవంతంగా మాంద్యంలోకి నెట్టడానికే రాజన్ వడ్డీరేట్లు తగ్గించలేదు. ఆర్‌బీఐ చట్టం అనుమతించకపోయినా ఆర్థిక సంస్థలు షరియా నిబంధనల ప్రకారం నడుచుకునేందుకు రాజన్ ఓకే అన్నారు. అమెరికాలో తనకున్న గ్రీన్ కార్డును అలాగే ఉంచుకుని... కీలకమైన రహస్య సమాచారాన్ని ప్రపంచమంతటికీ పంపించారు. ఇలా పంపించడానికి షికాగో యూనివర్సిటీ మెయిల్ ఐడీని ఉపయోగించుకున్నారు. పెపైచ్చు బహిరంగంగా మోదీని వ్యతిరేకించారు. కారణమేమిటంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవటానికి అమెరికా ఏర్పాటు చేసుకున్న 30 మంది గ్రూపులో ఈయన కూడా సభ్యుడు’’ అంటూ స్వామి తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. ప్రాథమిక ఆధారాలున్నాయి కనక ఆయన్ను తక్షణం పదవి నుంచి తొలగించాలని మోదీని కోరారు. ఆర్‌బీఐ గవర్నర్ పదవిలో ఉన్నవారికి కాస్త దేశభక్తీ ఉండాలని చెప్పారాయన.
రాజన్ వల్లే నిరుద్యోగులు పెరిగారు...
అధిక వడ్డీ రేట్ల కోసం రాజన్ ఒత్తిడి చేయటం వల్ల పరిశ్రమలు మాంద్యంలోకి వెళ్లాయని, పలువురు నిరుద్యోగులయ్యారని స్వామి ఆరోపించారు. ప్రభుత్వ పరమైన పదవిలో ఉండి కూడా బహిరంగంగా మోదీ ప్రభుత్వాన్ని విమర్శించటం సరికాదన్నారు. కాగా ఈ వ్యాఖ్యలపై రఘురామ్ రాజన్ నుంచి ఎలాంటి ప్రతిస్పందనా రాలేదు. కాగా, స్వామి ఆరోపణల నేపథ్యంలో రాజన్‌ను ఆర్‌బీఐ గవర్నరు పదవి నుంచి తప్పిస్తారా? అని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను విలేకరులు ప్రశ్నించగా... బీజేపీ అధికారికంగా చెప్పే మాటల్నే తాను చెబుతానంటూ ఆయన తప్పించుకున్నారు.
వ్యక్తిగత ఆరోపణల్ని ఆమోదించం: జైట్లీ
ఎవరైనా సరే! వేరొకరిని వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుని చేసే విమర్శల్ని తాము ఆమోదించబోమని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. స్వామి ఆరోపణలపై విలేకరులు ప్రశ్నించగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆర్‌బీఐ చాలా కీలకమైన వ్యవస్థ. దాని నిర్ణయాలు అందరినీ ప్రభావితం చేస్తాయి. ఆ నిర్ణయాలు సరైనవా? కావా? అన్నది చర్చించటంలో తప్పులేదు. కానీ వ్యక్తిగతంగా చేసే విమర్శల్ని మేం ఆమోదించం’’ అన్నారాయన.