స్వామిపై బీజేపీ పెద్దల ఆగ్రహం!
బీజేపీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి.. కేంద్రంలోని సీనియర్ మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులపై చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీ పెద్దలకు చికాగు పుట్టిస్తున్నాయి. బీజేపీ అగ్రనేతలు స్వామి పట్ల ఆగ్రహంతో ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆర్ఎస్ఎస్ కూడా స్వామి వ్యాఖ్యలను సమర్థించదని బీజేపీ నేతలు చెప్పారు. కేంద్ర మంత్రులు, బ్యూరోక్రాట్లపై స్వామి చేసే వ్యక్తిగత ఆరోపణలను ఆర్ఎస్ఎస్ ఆమోదించదని తెలిపారు.
ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ను పదవి నుంచి తొలగించాలని స్వామి డిమాండ్ చేయగా, బీజేపీ తప్పుబట్టిన సంగతి తెలిసిందే. స్వామిది వ్యక్తిగత అభిప్రాయమని, ఆయన అభిప్రాయాలతో ఏకీభవించడంలేదని బీజేపీ స్పష్టం చేసింది. అరవింద్ పై ప్రభుత్వానికి పూర్తి విశ్వాసం ఉందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు.
విదేశీ పర్యటనలో ఉన్న మంత్రులు సంప్రదాయ, లేదా మన దేశానికే చెందిన ఆధునిక దుస్తులు ధరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, వారు టై, కోట్ ధరిస్తే వెయిటర‍్లలా కనిపిస్తారంటూ స్వామి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. స్వామి తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటంతో బీజేపీ పెద్దలకు కోపం తెప్పించినట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.