కంపెనీలకు దివాలా చర్యల భయం ఉండాలి..
న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు ఎగవేస్తే కఠిన చర్యలు ఉంటాయనే భయం కంపెనీలకు ఉండాలని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను రక్షించేందుకు సంస్కరణలు అత్యంత ఆవశ్యకమని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దివాలా చట్టానికి సంబంధించిన కొత్త కోడ్‌ను తేవడం అవసరమని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్త దివాలా కోడ్‌ను తీసుకొచ్చే ప్రక్రియను ఇప్పటికే చేపట్టింది.
ఇలాంటివి లేకపోతే కంపెనీలకు దివాలా చర్యల భయం ఉండదని, ఎంతసేపూ వాటిని గట్టెక్కించే భారం బ్యాంకులపై ఉంటుందని రాజన్ చెప్పారు. ‘‘దివాలా చట్టం లేకపోతే.. ‘నా సమస్య ఇప్పుడు నీ సమస్య కూడా .. నువ్వెంత నష్టపోవడానికి సిద్ధంగా ఉన్నావంటూ’ కంపెనీలు బ్యాంకులను బెదిరించే పరిస్థితి ఉంటుంది. ఇలా వ్యాపారవేత్తలకు పూర్తి ప్రయోజనకరంగాను .. బ్యాంకులకు ప్రతికూలంగానూ పరిస్థితి ఉండకూడదు.
ఇది మారాలి’ అని రాజన్ వ్యాఖ్యానించారు. కాంట్రాక్టును అక్షరాల అమలు చేయాల్సిందేనన్న సిసలైన క్యాపిటలిజం ధోరణిని మళ్లీ తేవాలని ఒక ఆంగ్ల టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యులో రాజన్ చెప్పారు. ఇందులో భాగంగానే ఒప్పందాల విషయంలో పక్కాగా వ్యవహరించేలా బ్యాంకులకు మరిన్ని అధికారాలు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నామని ఆయన పేర్కొన్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో దివాలా చట్టానికి సంబంధించిన సంస్కరణలను ప్రభుత్వం ప్రవేశపెట్టగలదని రాజన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
సులభతరంగా వ్యాపార నిర్వహణ అంశంపై ప్రపంచ బ్యాంకు 189 దేశాలపై జరిపిన సర్వేలో భారత్ కు 130వ ర్యాంకు దక్కిన సంగతి తెలిసిందే. రెండు దేశీ సంస్థల మధ్య కాంట్రాక్టు వివాదం పరిష్కరించడానికి భారత్‌లో 1,420 రోజులు పడుతుందని, క్లెయిమ్ మొత్తంలో దాదాపు 40 శాతం ఖర్చవుతుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. ఈ విషయంలో భారత్‌కు 178వ స్థానం దక్కింది.