మోదీ సర్కార్‌పై అతి అంచనాలు
అయినా మెరుగ్గానే కొత్త ప్రభుత్వం పనితీరు
⇒ పెట్టుబడులకు అనువైన పరిస్థితుల కల్పన
⇒ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్
న్యూయార్క్: ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో గతేడాది ఏర్పడిన కొత్త ప్రభుత్వంపై వాస్తవ పరిస్థితులను మించి అంచనాలు నెలకొన్నాయని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. అయితే, ఇన్వెస్టర్ల సమస్యలను పరిగణనలోకి తీసుకుంటూ ప్రభుత్వం.. పెట్టుబడులకు అనుకూల పరిస్థితులను కల్పించేందుకు చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు.
ఎకనామిక్ క్లబ్ ఆఫ్ న్యూయార్క్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రాజన్ ఈ విషయాలు చెప్పారు. ‘ఈ ప్రభుత్వం భారీ అంచనాలతో అధికారంలోకి వచ్చింది. ఏ కొత్త ప్రభుత్వంపైనైనా ఇంత భారీగా ఆశలు ఉండటం సరికాకపోవచ్చు. అప్పట్లో రోనాల్డ్ రీగన్ (అమెరికా మాజీ అధ్యక్షుడు) మార్కెట్ వ్యతిరేక శక్తులను సంహరించేందుకు శ్వేతాశ్వంపై వచ్చిన తరహా ఇమేజ్‌తో ప్రస్తుతం మోదీని ఊహించుకున్నారు. ఈ రెండింటికీ పొంతన లేదు’ అని ఆయన పేర్కొన్నారు.
ఇన్వెస్టర్ల ఆందోళనలను అర్థం చేసుకున్న కొత్త ప్రభుత్వం.. ఆర్థికపరమైన సమస్యల పరిష్కారంపై దృష్టి పెడుతోందని రాజన్ పేర్కొన్నారు. వివాదాస్పదమైన రెట్రాస్పెక్టివ్ ట్యాక్సేషన్ (గతకాలపు లావాదేవీలపై పన్నులు)ను మళ్లీ ప్రవేశపెట్టబోమని స్పష్టం చేసిందని చెప్పారు. అలాగే కార్పొరేట్ ట్యాక్స్ కూడా ఏటా ఒక్క శాతం చొప్పున తగ్గనుందన్నారు. ఇక, ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని చూరగొనేలా, వృద్ధికి దోహదపడేలా చర్యలు తీసుకోవడంలో మోదీ సర్కార్ గణనీయమైన పురోగతి సాధించిందన్నారు.
పెట్రోల్, డీజిల్ సబ్సిడీలను ఎత్తివేయడంతో పాటు వంట గ్యాస్ సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు రాజన్ చెప్పారు. వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానం వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నాటికల్లా అమల్లోకి రాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.
భారీ పెట్టుబడి ప్రణాళికలు..
రవాణా కారిడార్‌లు, పారిశ్రామిక కారిడార్‌లు మొదలైన వాటిపై కొత్త ప్రభుత్వం భారీ పెట్టుబడి ప్రణాళికలు సిద్ధం చేసిందని రాజన్ చెప్పారు. ఇతర కరెన్సీలతో పోలిస్తే రూపాయి మారకం విలువలో భారీ మార్పులు తగ్గాయని, డాలర్‌తో పోలిస్తే అత్యంత స్థిరంగా ఉన్న కరెన్సీల్లో రూపాయి కూడా ఒకటిగా ఉంటోందని రాజన్ చెప్పారు. అలాగే ద్రవ్యోల్బణమూ దిగి వస్తోందన్నారు. పెట్టుబడులు మరింత వేగం పుంజుకోవాల్సి ఉందని రాజన్ చెప్పారు. అటు బ్యాంకింగ్ వ్యవస్థను కూడా ప్రక్షాళన చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు.
సెంట్రల్ బ్యాంకులు బాధ్యతల నుంచి తప్పుకోలేవు
దేశీయంగా తీసుకోవాల్సిన చర్యలు ఎలా ఉన్నప్పటికీ వివిధ దేశాలకు చెందిన సెంట్రల్ బ్యాంకులు అంతర్జాతీయంగా తమ బాధ్యతల నుంచి తప్పుకోజాలవని రాజన్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వంటి సంస్థలు, అసాధారణమైన ద్రవ్య విధానాలన్నింటినీ విశ్లేషించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. దాదాపు ప్రతి పారిశ్రామిక దేశంలోనూ ప్రజాకర్షక విధానాలపైనే దృష్టి ఉంటోందని, దీనివల్ల వాణిజ్య, ఆర్థికాంశాల విషయంలో ప్రతికూల విధానాలు ఉంటున్నాయని రాజన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ ద్రవ్య విధానంలో ఒక పద్ధతంటూ లేకపోవడం వల్ల ఇటు వృద్ధికి అటు ఆర్థిక రంగానికి గణనీయమైన రిస్కులు పొంచి ఉన్నాయన్నారు.