‘రాంకీ’కి గల్ఫ్‌లో 3 కొత్త ప్రాజెక్టులు | Ramky Infra jumps on buzz of sale of 3 highway projects to Piramal Group | Sakshi
Sakshi News home page

‘రాంకీ’కి గల్ఫ్‌లో 3 కొత్త ప్రాజెక్టులు

Published Sat, Sep 20 2014 1:55 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 PM

‘రాంకీ’కి గల్ఫ్‌లో 3 కొత్త ప్రాజెక్టులు

‘రాంకీ’కి గల్ఫ్‌లో 3 కొత్త ప్రాజెక్టులు

మూడు రోడ్డు ప్రాజెక్టులు విక్రయానికి సిద్ధం 
రాంకీ గ్రూప్ చైర్మన్ అయోధ్య రామిరెడ్డి వెల్లడి


సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: సివిల్ కన్‌స్ట్రక్షన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వేస్ట్ మేనేజ్‌మెంట్ రంగాల్లో నిమగ్నమైన రాంకీ గ్రూప్ గల్ఫ్ దేశాల్లో మూడు కొత్త ప్రాజెక్టులను చేపట్టనుంది. పర్యావరణ, వేస్ట్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి ఓమన్, సౌదీ అరేబియా దేశాల్లో రూ. 200 కోట్లతో ప్రాజెక్టులను చేపడుతున్నామని రాంకీ గ్రూప్ చైర్మన్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తెలిపారు.
 
గల్ఫ్ దేశాల్లో పర్యటిస్తున్న అయోధ్య రామిరెడ్డి గురువారం సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ...ఓమన్‌లో ఖింజీ రామ్‌దాస్ సంస్థతో రామ్‌కీ ఎన్విరో ఇంజనీర్స్ తాజాగా వేస్ట్‌మేనేజ్‌మెంట్ ప్రాజెక్టు చేపడుతున్నామన్నారు. మెటీరియల్ రీసైక్లింగ్ ఫెసిలిటీ కోసం ఇందాద్‌తో కలసి మరో ప్రాజెక్టు చేస్తున్నామన్నారు. కింగ్‌డమ్ ఆఫ్ సౌదీ అరేబియాలో అట్కో గ్రూప్‌తో కలసి ఇంకో ప్రాజెక్టు చేపడుతున్నామని చెప్పారు. తాజా పెట్టుబడులతో గల్ఫ్ దేశాల్లో తమకు మరింత పట్టు పెరుగుతుందన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా పెట్టుబడులు చేసే యోచనలో ఉన్నామని తెలిపారు.
 
తుది దశలో రోడ్డు ప్రాజెక్టుల విక్రయం?
రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న క్యాష్ ఫ్లో లోటు సమస్య నుండి బయటపడేందుకు నామ్ ఎక్స్‌ప్రెస్‌వే, సెహోర్ కోస్మి, రాంకీ ఎస్లామిక్స్ హైదరాబాద్ రింగ్ రోడ్ ప్రాజెక్టులను విక్రయానికి పెట్టామని, సరైన కొనుగోలుదారు దొరికితే విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ గౌతం రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.  ఈ ప్రాజెక్టుల విక్రయం ద్వారా రూ వెయ్యి కోట్లు ఆశిస్తున్నామన్నారు. ప్రస్తుతం తమ సంస్థకు రూ. 1,400 కోట్ల రుణాలున్నాయని, వీటిని తీర్చేందుకు ఈ డీల్ ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. ఒక నెలలోగా ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు.
 
అజయ్ పిరమల్ గ్రూప్ ఈ ప్రాజెక్టులను చేజిక్కించుకునే రేస్‌లో మొదటి స్థానంలో ఉందన్న ఊహాగానాలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ గౌతం రెడ్డిని ఇదే విషయమై ప్రశ్నించగా, ప్రస్తుతం తామేమీ వ్యాఖ్యానించలేమన్నారు. ‘‘రోడ్డు ప్రాజెక్టుల విక్రయానికి సంబంధించి పలు సంస్థలతో సంప్రదిస్తున్నాం. కొన్ని సంస్థలతో నాన్ డిస్క్లోజర్ ఒప్పందాలు చేసుకున్నాం. మేం సంప్రదిస్తున్న కంపెనీల్లో  సింగపూర్‌కు చెందిన కన్సార్షియంతో పాటు కొన్ని ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు కూడా ఉన్నాయి’’ అని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement