హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్వీ ఉదంతంతో బ్రోకింగ్ పరిశ్రమలో కన్సాలిడేషన్ మరింత వేగవంతమయ్యే అవకాశముందని కొటక్ సెక్యూరిటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఫండమెంటల్ రీసెర్చ్ విభాగం హెడ్) రష్మిక్ ఓఝా అంచనా వేశారు. దీని వల్ల పెద్ద సంఖ్యలో క్లయింట్స్.. క్రమంగా చిన్న సంస్థల నుంచి పటిష్టమైన, పెద్ద సంస్థల వైపు మళ్లే అవకాశాలున్నాయని మంగళవారమిక్కడ విలేకరులతో చెప్పారు. క్లయింట్ల సెక్యూరిటీలను సొంత అవసరాలకు వాడుకుందని కార్వీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
మరోవైపు, వచ్చే ఏడాది ఆఖరు నాటికి నిఫ్టీ 13,400 పాయింట్లు, సెన్సెక్స్ 45,500 పాయింట్లకు చేరవచ్చని కొటక్ సెక్యూరిటీస్ అంచనా వేస్తున్నట్లు ఓఝా చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో పరిస్థితులు నిరాశావహంగా కనిపిస్తున్నప్పటికీ.. మార్కెట్ మాత్రం సానుకూలంగా ఉంటోందని పేర్కొన్నారు. కార్పొరేట్ ట్యాక్స్ రేటు తగ్గింపు, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల రాకతో పాటు దేశీయంగా సిప్ రూపంలో పెట్టుబడులు వస్తుండటం మార్కెట్లకు దోహదపడుతోందని ఓఝా తెలిపారు.
మార్కెట్లు, ఎకానమీ మధ్య వైరుధ్యాలు మరికొంత కాలం కొనసాగవచ్చని, బడ్జెట్‌లో తాయిలాలపై ఆశలతో మార్కెట్లు అధిక స్థాయిలోనే ఉండవచ్చని ఆయన తెలిపారు. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియ వంటి అంశాలు వచ్చే ఏడాది కీలకంగా ఉండగలవని చెప్పారు. మందగమనం, ఆదాయాల్లో పెద్దగా మార్పులు లేకపోవడం, అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధ తీవ్రత మొదలైనవి దేశీ మార్కెట్లపై ప్రభావం చూపవచ్చని ఓఝా చెప్పారు.
ఆకర్షణీయంగా ఈ రంగాలు..
కార్పొరేట్ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు (పటిష్టమైన మాతృసంస్థల మద్దతున్నవి), ఆయిల్ అండ్ గ్యాస్, క్యాపిటల్ గూడ్స్, నిర్మాణ, హెల్త్‌కేర్, అగ్రోకెమికల్స్ రంగాల షేర్లపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చని ఓఝా పేర్కొన్నారు. సిమెంటు, ఫార్మా రంగాల్లో మిడ్ క్యాప్ కంపెనీలు కూడా పరిశీలించవచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment