మర్యాదగా చెబితే మిస్త్రీ వినలేదు!
ఉద్వాసనకు ముందే రాజీనామా కోరిన టాటా
• తిరస్కరించడంతో తొలగింపు
• ఆయనపై నమ్మకం కోల్పోవడం వల్లే
• కంపెనీ లా ట్రిబ్యునల్‌కు టాటాసన్స్ వెల్లడి
ముంబై: టాటా గ్రూపు చైర్మన్‌గా సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలికే ముందు టాటా సన్స్ ఆయనకు రాజీనామా చేసే అవకాశం ఇచ్చిందట. టాటా సన్స్ బోర్డు మిస్త్రీపై నమ్మకం కోల్పోవడంతో రాజీనామా చేయాలని ఆయన్ను రతన్‌టాటా స్వయంగా అడిగారు. కానీ, రాజీనామా చేసేందుకు మిస్త్రీ నిరాకరించడంతో మెజారిటీ ఓటు మేరకు తొలగించాల్సి వచ్చిందని టాటా సన్స్ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు వివరించింది. మిస్త్రీ కుటుంబానికి చెందిన ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీలు టాటాసన్స్, రతన్‌టాటాలకు వ్యతిరేకంగా కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. వారి పిటిషన్లకు సమగ్రమైన స్పందనను 204 పేజీల అఫిడవిట్ రూపంలో టాటా సన్స్ దాఖలు చేసింది. మిస్త్రీ నాయకత్వంలో ఎటువంటి పురోగతి లేకపోవడం లేదా చాలా తక్కువగా ఉండడంతో గతేడాది అక్టోబర్ 24న చైర్మన్‌గా ఆయన్ను తొలగించినట్టు తెలిపింది.
టాటాసన్స్ బోర్డులోని తొమ్మిది మంది డైరెక్టర్లకు గాను ఫరీదా ఖంబటా గైర్హాజరు కాగా... మిగిలిన వారిలో ఏడుగురు మిస్త్రీని మార్చేందుకుఅనుకూలంగా ఓటు వేశారని, డైరెక్టర్‌గా మిస్త్రీని ఓటు వేసేందుకు అనర్హుడిగా ప్రకటించినట్టు పేర్కొంది. ‘‘2016 అక్టోబర్ 24న టాటాసన్స్ బోర్డు సమావేశానికి ముందే రతన్‌టాటా, నితిన్ నోహ్రియా సైరస్ మిస్త్రీతో వ్యక్తిగతంగా మాట్లాడారు. ఎగ్జిక్యూటివ్‌చైర్మన్ పదవికి రాజీనామా చేసే అవకాశం ఆయన ముందుంచారు. కానీ, తప్పుకునేందుకు మిస్త్రీ తిరస్కరించారు’’ అని టాటాసన్స్ తెలిపింది. అంతేకానీ, ఈ నిర్ణయం ఆకస్మికంగా, తొందరపాటుతో తీసుకోలేదని పేర్కొంది.
టాటా గ్రూపు నిర్మాణాన్ని బలహీనపరిచారు..
‘‘నాలుగేళ్ల మిస్త్రీ నాయకత్వంలో కలతకు గురిచేసే ఎన్నో వాస్తవాలు చోటు చేసుకున్నాయి. మూలధన కేటాయింపు నిర్ణయాల్లో క్రమశిక్షణ లోపించింది. నిర్వహణలో జాప్యం, వ్యూహాత్మక, వ్యాపార ప్రణాళికలు లేకపోవడం, వృద్ధికి అవకాశం ఉన్నకొత్త వ్యాపారాల్లోకి అడుగు పెట్టే అర్థవంతమైన చర్యలు లోపించడం, ఉన్నత స్థాయి యాజమాన్యం బలహీనపడడం వంటివి జరిగాయి. టాటా గ్రూపులోని మేజర్ కంపెనీల్లో టాటాసన్స్ డైరెక్టర్ల ప్రాతినిథ్యాన్ని తగ్గించేందుకు మిస్త్రీ క్రమపద్ధతిలో ప్రణాళికమేరకు వ్యవహరించారు. క్రమపద్ధతిలో పలుచన చేసే ఈ చర్యలు... టాటా విలువలు, సంస్కృతి, పరిపాలన మార్గదర్శకాలు, గ్రూపు వ్యూహాత్మక విధానాలు, నిర్మాణాన్ని నిర్వీర్యపరిచాయి’’ అని అఫిడవిట్‌లో టాటాసన్స్ వివరించింది.
నాయకుడిగానూ విఫలం: వెనుకటి నుంచీ ఉన్న సమస్యలకే మిస్త్రీ దృష్టి పరిమితం అయిందని విమర్శించింది. ఇన్వెస్టర్లు, వాటాదారులతో సానుకూల సంబంధాలు నెలకొల్పడం నాయకుడి ప్రధాన విధుల్లో భాగమని, వీటిలోనూ మిస్త్రీవిఫలమయ్యారని పేర్కొంది. దీంతో టాటాసన్స్, టాటా ట్రస్ట్‌ల మధ్య విశ్వాస అంతరం పెరిగిపోయిందని పేర్కొంది. టాటా సన్స్ చైర్మన్‌గా మిస్త్రీని రతన్ టాటానే ఆహ్వానించారని... ఆ హోదాలోనే రతన్Sటాటా టాటాసన్స్ బోర్డు డైరెక్టర్ల సమావేశాల్లోపాల్గొనే హక్కు కలిగి ఉన్నారని పేర్కొంది. అయినప్పటికీ గతేడాది అక్టోబర్ 24 నాటి సమావేశానికి ముందెప్పుడూ రతన్‌టాటా గౌరవ చైర్మన్ హోదాలో పాల్గొన్న సందర్భం లేదని వివరించింది.
మిస్త్రీ కుటుంబానికి ఆ హక్కులేదు...
టాటా సన్స్ బోర్డులో డైరెక్టర్‌ను నియమించే హక్కు మిస్త్రీ కుటుంబానికి లేదని టాటా సన్స్ స్పష్టం చేసింది. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ప్రకారం ఇందుకు అవకాశం లేదని తెలిపింది. టాటా గ్రూపు నిర్వహణ కంపెనీ అయిన టాటా సన్స్... డైరెక్టర్‌పదవి నుంచి మిస్త్రీని తప్పించేందుకు ఫిబ్రవరి 9న సమావేశం కానున్న విషయం తెలిసిందే. ‘‘టాటా సన్స్‌లో షాపూర్జీ పల్లోంజీ కుటుంబానికి 1965 నుంచీ 18.4 శాతం వాటా ఉంది. అయినప్పటికీ పల్లోంజీ షాపూర్జీ మిస్త్రీ టాటా సన్స్ బోర్డులోడైరెక్టర్‌గా 1980లో తొలిగా నియమితులయ్యారు. 2004లో రిటైర్ అయ్యారు. రెండేళ్ల తర్వాత రతన్ టాటా ప్రతిపాదించగా ఆయన కుమారుడైన సైరస్ మిస్త్రీ టాటా సన్స్ బోర్డులో డైరెక్టర్‌గా చేరారు. అంతేగానీ పల్లోంజీ మిస్త్రీ లేదా సైరస్ మిస్త్రీ నైతికంగానియామక హక్కు కలిగి లేరు’’ అని టాటా సన్స్ తన అఫిడవిట్‌లో పేర్కొంది.