ప్రతీకాత్మక చిత్రం
ప్రముఖ వస్త్ర తయారీదారు, ఫ్యాషన్ రీటైలర్ రేమండ్ గ్రూప్, ముకేశ్ అంబానీ నేతృత‍్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ఎకోవేరా వస్త్రాలను విడుదల చేసింది. గ్రీన్ ఫైబర్ ప్రమోషన్‌లో భాగంగా రిలయన్స్ సొంతమైన పర్యావరణ అనుకూలమైన ఆర్ ఎలాన్ టెక్నాలజీ సహాయంతో ఈ ఎకోవేరా దుస్తులను ప్రారంభించింది.
ఆర్‌ఐఎల్ భాగస్వామ్యంతో సహజ సిద్ధమైన, మ్యాన్‌మేడ్ ఫైబర్‌తో నాణ్యమైన దుస్తులను తయారు చేసినట్టు రేమాండ్స్ తెలిపింది. జీవ ఇంధనాలు, ఇంధన-సామర్థ్య ప్రక్రియతో వాడి పారేసిన పెట్ బాటిల్స్ రీ సైకిలింగ్ ద్వారా రూపొందించిన ఆర్‌ఎలాన్ గ్రీన్‌గోల్డ్‌తో ఈ ఎకోవేరా దుస్తులను తయారు చేశామని వెల్లడించింది. సుమారు 700 నగరాల్లో 1,500 దుకాణాల్లో త్వరలోనే ఇవి లభ్యం కానున్నాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
అత్యాధునిక నాణ్యతా ప్రమాణాలతో ప్రపంచంలోనే అత్యధిక పర్యావరణ అనుకూలమైన దుస్తులను లాంచ్ చేశామని రేమండ్స్ టెక్స్‌టైల్స్ అధ్యక్షుడు సుధాన్షు పోఖ్రియాల్ తెలిపారు. భూమాతను, ప్రకృతిని కాపాడే తమ లక్ష్యసాధనలో ఇది మరో అడుగని వ్యాఖ్యానించారు. ఇందుకు ఒక మిలియన్ వ్యర్ధ పెట్ బాటిల్స్‌ను రీసైకిల్ చేయాలని భావిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment