సాక్షి, ముంబై : రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కేంద్రానికి భారీ బొనాంజా ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 1.76 లక్షల కోట్లను కేంద్రానికి అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఆర్‌బీఐ బోర్డు సోమవారం నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ నివేదికను బోర్డు ఆమోదించింది. రికార్డు స్థాయిలో ఈ మొత్తాన్ని ప్రకటించడం చర్చనీయాంశమైంది.
2018-19 సంవత్సరానికి ఎకనామిక్ కాపిటల్ ఫ్రేమ్‌వర్క్ (ఇసిఎఫ్)గుర్తించిన 1,23,414 కోట్ల రూపాయల డివిడెండ్‌కు అదనంగా రూ.52,637కోట్ల మిగులు నిల్వను జోడించి మొత్తం రూ.1,76,051 కోట్లను భారత ప్రభుత్వానికి బదిలీ చేయాలని సెంట్రల్ బ్యాంక్ బోర్డు నిర్ణయించిందని బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. ఇది ఊహించని పరిణామమని ఎనలిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రస్తుతం ఆర్‌బీఐ వద్ద స్థూల ఆస్తుల్లో 28 శాతానికి సమానమైన (రూ.9 లక్షల కోట్లు) మిగులు నిధులున్నాయని సమాచారం. అంతర్జాతీయంగా పలు దేశాల సెంట్రల్ బ్యాంకులకు ప్రామాణికమైన 14 శాతంతో పోలిస్తే ఆర్‌బీఐ వద్ద రెట్టింపు మిగులు నిధులున్నాయన్నది ఆర్థిక శాఖ వాదన. ఆర్‌బీఐ మిగులు నిధుల నిర్వహణ కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, మిగులు నిధుల్లోంచి రూ.3-4 లక్షల కోట్లు తమ ఖజానాకు బదిలీ చేయాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆర్‌బీఐ వద్ద ఎంత పరిమాణంలో మిగులు నిధులు ఉండవచ్చన్న అంశాన్ని పరిశీలించిన బిమల్ జలాన్ నాయకత్వంలోని కమిటీ తన నివేదికలను అందించింది. మరోవైపు బాండ్ల మార్కెట్‌కు, సోమవారం భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లలో ఆర్‌బీఐ డివిడెండ్ ప్రకటన ఇన్వెస్టర్లకు మరింత ఉత్సాహానివ్వనుంది.
Comments
Please login to add a commentAdd a comment