రైతులకు వడ్డీ రాయితీ అందించండి... | RBI directive to banks | Sakshi
Sakshi News home page

రైతులకు వడ్డీ రాయితీ అందించండి...

Published Fri, Aug 14 2015 12:16 AM | Last Updated on Sun, Sep 3 2017 7:23 AM

రైతులకు వడ్డీ రాయితీ అందించండి...

రైతులకు వడ్డీ రాయితీ అందించండి...

బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశం
 
 ముంబై : వడ్డీ రాయితీతో రైతులకు స్వల్పకాల పంట రుణాలను అందించాలని ఆర్‌బీఐ బ్యాంకులను ఆదేశించింది. ఈ రుణాలకు రూ.3 లక్షల వరకు 2 శాతం వడ్డీ రాయితీ ఇవ్వాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం 2015-16 బడ్జెట్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్వల్పకాల రుణాలకు రూ.3 లక్షల వరకు 2 శాతం వడ్డీ రాయితీ కల్పించే పథకాన్ని అమలు చేయాలని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. పంట రుణం రైతుకు పంపిణీచేసిన నాటి నుంచి ఆ రుణాన్ని రైతు తిరిగి చెల్లించే తేదీ లేక పంట రుణం చెల్లించాల్సిన గడువు తేదీ ఆధారంగా 2 శాతం వడ్డీ రాయితీ లెక్కింపు జరుగుతుందని ఆర్‌బీఐ పేర్కొంది.

రాయితీ కారణంగా క్షేత్రస్థాయిలో రైతులకు పంట రుణాలు 7 శాతం వడ్డీకి లభిస్తాయని తెలిపింది. ఇది కాక సకాలంలో పంట రుణాలను చెల్లించే రైతులకు 3 శాతం అదనపు వడ్డీ రాయితీ అందుబాటులో ఉంటుందని తెలిపింది. అంటే సకాలంలో పంట రుణాలను చెల్లించే రైతులకు మాత్రమే పంట రుణం 4 శాతం వడ్డీకి లభిస్తుందని పేర్కొంది.

 సకాలంలో చెల్లించని రైతులకు ఈ 3 శాతం వడ్డీ ప్రయోజనం ఉండదని వివరించింది. గిట్టుబాటు ధరల లభించన ప్పుడు పంట ఉత్పత్తులను గిడ్డంగుల్లో నిల్వ ఉంచుకునేందుకు, కిసాన్ క్రెడిట్ కార్డులను కల్గిన చిన్న, సన్నకారు రైతులకు 2 శాతం వడ్డీ రాయితీ ప్రయోజనాలను మరో ఆరు నెలల వరకు పొందవచ్చని తెలిపింది. ప్రకృతి వైపరిత్యాల నుంచి రైతులను ఆదుకోవడానికి పునర్వ్యవస్థీకరించిన రుణాలకు తొలి ఏడాది ఈ 2 శాతం వడ్డీ రాయితీ ఉంటుందని, తర్వాతి సంవత్సరం నుంచి సాధారణ వడ్డీయే వర్తిస్తుందని పేర్కొంది.
 
 ప్రభుత్వానికి రూ.65,896 కోట్ల మిగులు
 ఆర్‌బీఐ గురువారం తన మిగులు లాభాన్ని కేంద్ర ప్రభుత్వానికి బదలాయించింది. ఈ మొత్తం రూ.65,896 కోట్లు. గత ఏడాది బదలాయింపులకన్నా ఇది 25 శాతం (రూ.52,679 కోట్లు) అధికం. గురువారం జరిగిన ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డ్ డెరైక్టర్ల సమావేశం ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకుంది. ఈ 553వ   ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డ్ సమావేశానికి గవర్నర్ రఘురామ్ రాజన్ అధ్యక్షత వహించారు. సెంట్రల్ బోర్డ్‌లో ప్రభుత్వ నామినీ డెరైక్టర్లు, ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ కూడా సమావేశానికి హాజరయ్యారు.  
 
 పావుశాతం రెపో కోత: బ్యాంకర్ల అంచనా
 ఆర్‌బీఐ రెపోను సెప్టెంబర్ 29 సమీక్ష సందర్భంగా మరో పావు శాతం తగ్గించే అవకాశం ఉందని (ప్రస్తుతం 7.25 శాతం)బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు.   వినియోగ ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో రికార్డు స్థాయి  కనిష్ట స్థాయి 3.78 శాతానికి పడిపోవడం ఇందుకు కారణమని  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్ ఆదిత్య పురి  గురువారం ఇక్కడ విలేకరులతో అన్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ బీపీ శర్మ మాట్లాడుతూ, రేటు కోతను బ్యాంకర్లు కోరుతున్నారన్నారు. ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయి ఈ ఆశలు పెంచుతోందన్నారు.

ఆర్‌బీఐ బోర్డ్ సమావేశం సందర్భంగా జరిగిన విందు కార్యక్రమం అనంతరం పురి, శర్మలు విలేకరులకు తమ అభిప్రాయాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ అరుంధతీ భట్టాచార్య, ఐసీఐసీఐ బ్యాంక్ చందా కొచర్, యాక్సిస్ బ్యాంక్ శిఖా శర్మ తదితరులు పాల్గొన్నారు.

 విశ్లేషణా సంస్థలదీ ఇదే మాట...: కాగా పలు ఆర్థిక విశ్లేషణా సంస్థలు కూడా సెప్టెంబర్ సమీక్ష సందర్భంగా రెపో రేటును తగ్గించవచ్చనే అంచనాల్లోనే ఉన్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో తక్కువగా ఉండడం దీనికి కారణంగా చూపుతూ, ఆగస్టు నెలలో కూడా రిటైల్ ద్రవ్యోల్బణం మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి.  బ్యాంక్ ఆఫ్ అమెరికా-మిరిలించ్, డీబీఎస్, ఎస్‌బీఐ రిసెర్చ్‌లు విడుదల చేసిన నివేదికల్లో తమ అభిప్రాయాలను తెలియజేశాయి. ఈ ఏడాది ఆర్‌బీఐ రెపోను ముప్పావుశాతం తగ్గించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement