
న్యూఢిల్లీ: చట్టపరమైన మినహాయింపులుంటే తప్ప బ్యాంకుల వార్షిక తనిఖీల నివేదికల వివరాలను సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద ఇచ్చి తీరాల్సిందేనని రిజర్వ్ బ్యాంక్‌కు సుప్రీం కోర్టు స్పష్టంచేసింది. ఇందుకోసం సంబంధిత విధానాలను పునఃసమీక్షించాలని సూచించింది. ఆర్‌టీఐ చట్టానికి అనుగుణంగా నడుచుకునేందుకు ఆఖరు అవకాశం ఇస్తున్నట్లు హెచ్చరించింది. ‘తదుపరి ఇంకా ఉల్లంఘనలు జరిగితే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది‘ అని జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు సారథ్యంలోని బెంచ్ స్పష్టం చేసింది. ఆర్‌బీఐపై ఆర్‌టీఐ కార్యకర్త ఎస్‌సీ అగ్రవాల్ వేసిన కోర్టు ధిక్కరణ పిటీషన్‌పై విచారణలో భాగంగా న్యాయస్థానం తాజా ఆదేశాలు ఇచ్చింది. వివరాల్లోకి వెడితే.. అనుచిత వ్యాపార విధానాలు పాటిస్తున్న బ్యాంకులు, ఆర్థిక సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని 2015లో ఆర్‌బీఐకి సుప్రీం కోర్టు సూచించింది.
అలాగే ఆర్థిక సంస్థలపై విశ్వాసం దెబ్బతింటుందన్న పేరుతో ఆర్‌టీఐ చట్ట పరిధిలోకి వచ్చే అంశాలు, డిఫాల్టర్ల వివరాలను దాచిపెట్టి ఉంచడం కుదరదని కూడా స్పష్టం చేసింది. దీనికి అనుగుణంగా.. నిబంధనలు ఉల్లంఘించిన బ్యాంకులపై విధించిన జరిమానాలు, వార్షిక తనిఖీ నివేదికకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ సమాచార హక్కు చట్టం కింద ఆర్‌బీఐని ఎస్‌సీ అగ్రవాల్ కోరారు. ఇటువంటి వివరాలు వెల్లడించవచ్చంటూ సుప్రీం కోర్టు ఆదేశాలున్నప్పటికీ .. నిర్దిష్ట విధానం కింద ఆర్‌టీఐ చట్టం నుంచి వీటికి మినహాయింపు ఉందంటూ, పిటీషనర్ కోరిన సమాచారం ఇవ్వడానికి ఆర్‌బీఐ నిరాకరించింది. ఈ సమాచారాన్ని ఇవ్వడం కుదరదని పేర్కొంది. దీంతో సుప్రీం కోర్టు సూచనలకు విరుద్ధంగా ఆర్‌బీఐ నిర్దిష్ట సమాచారానికి మినహాయింపులివ్వడం కోర్టు ధిక్కరణ కిందే వస్తుందంటూ అగ్రవాల్ మరో పిటీషన్ దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment