రూ.200నోటు లాంచ్, ఏటీఎంలు సిద్దమేనా?
రూ.200నోటు లాంచ్, ఏటీఎంలు సిద్దమేనా?
Published Fri, Aug 25 2017 2:06 PM | Last Updated on Sun, Sep 17 2017 5:58 PM
సాక్షి, ఢిల్లీ: రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా వినాయక చవితి సందర్భంగా కొత్త రూ.200 నోట్లను ప్రవేశపెట్టింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత వచ్చిన మూడో కొత్త నోటు ఇదే. ఈ నోటు విడుదలైన వెంటనే ఢిల్లీలోని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా వద్ద భారీగా జనాలు క్యూ కట్టి మరీ ఈ నోటును సొంతం చేసుకుంటున్నారు. రూ.200 నోటుతో పాటు కొత్త రూ.50 నోటును కూడా ఆర్బీఐ నేడే మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అయితే కొత్త రూ.200 మీ పక్కనే ఉన్న ఏటీఎంలలోకి వస్తుందా? అంటే ఏటీఎంలో ఈ నోట్లను విత్‌డ్రా చేసుకోవడానికి మరో 2 వారాల పాటు వేచిచూడాల్సి ఉందని రిపోర్టులు చెబుతున్నాయి. రిపోర్టుల ప్రకారం ఈ నోట్లను పంపిణీ చేయడానికి వీలుగా ఏటీఎంలను రీక్యాలిబరేషన్ చేయాల్సి ఉందని తెలిసింది. ప్రస్తుతం ఎంపికచేసిన ఆర్బీఐ ఆఫీసుల వద్ద, బ్యాంకుల వద్ద మాత్రమే కొత్త రూ.200 నోటు అందుబాటులో ఉంటుందని రిపోర్టులు తెలిపాయి.
ఏటీఎంల సామర్థ్యంతో నోట్ల సరఫరాను ఏటీఎం ప్రొవైడర్లు సరిపోల్చి చూడాల్సి ఉందన్నారు. ప్రతి క్యాసెట్‌లో ప్రస్తుతం 2,500 నోట్లు మాత్రమే అవకాశం ఉంది. దీంతో రూ.200 నోట్లను పంపిణీ చేయాలంటే మరో రెండు వారాలైన సమయం పట్టే అవకాశముందని తెలుస్తోంది. మహాత్మాగాంధీ(కొత్త సిరీస్)లో, ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకంతో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నేటి నుంచి ఈ నోట్లను జారీచేస్తోంది. భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబించించేలా సాంచీ స్థూపం ఈ నోట్లపై ఉంటుంది. ప్రకాశవంతమైన పసుపు రంగులో ఈ నోట్లు ఉన్నాయి.
Advertisement
Advertisement