ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పరపతి విధాన సమీక్ష కమిటీ (ఎంపీసీ) బుధవారం కీలక రెపో రేటు నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల ఎంపీసీ మూడు రోజుల సమావేశం సోమవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటే రెపో. ప్రస్తుతం ఇది 6 శాతంగా ఉంది.
ముడిచమురు ధరల తీవ్రత ఒకవైపు, ద్రవ్యోల్బణం భయాలు మరోవైపు, 13వ తేదీన అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడరల్ రిజర్వ్ రేటు నిర్ణయం అంశాలు ఆర్‌బీఐ నిర్ణయంలో ప్రధాన అంశాలు కానున్నాయి. రేటు పెంపు పావుశాతం ఉంటుందని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే ఇలాంటి నిర్ణయం నాలుగున్నర సంవత్సరాల తర్వాత మొదటిదవుతుంది. 2014 జనవరిలో ఆర్‌బీఐ రెపో రేటును పెంచింది. దీనితో అప్పటి రేటు 8 శాతానికి పెరిగింది.
తక్షణం రేటు పెంపునకు అవకాశం లేదని పేర్కొంటున్న ఆర్థికవేత్తలు, సంస్థలుసైతం ఆగస్టులో రేటు పెంపు పావుశాతం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. ‘‘2018–19లో 50 బేసిస్ పాయింట్ల రేటు పెంపు ఉంటుందని భావిస్తున్నాం. ఆగస్టు, అక్టోబర్ నెలల్లో ఈ రేటు పెంపు అవకాశం ఉంది. జూన్ సమావేశాల్లో రేటు పెంపు అవకాశం లేదని భావిస్తున్నాం’’ అని దేశీయ బ్రోకరేజ్ సంస్థ కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment