రూ.2000 నోట్ల సరఫరాను తగ్గించేసింది
పెద్ద నోట్ల రద్దు అనంతరం మార్కెట్‌లోకి తీసుకొచ్చిన తొలి నోటు రూ.2000 కరెన్సీ నోటే. డీమానిటైజేషన్ ప్రక్రియలో భాగంగా తొలుత ఈ నోట్లనే ఎక్కువగా మార్కెట్‌లోకి తీసుకురావడంతో ప్రజలు చిల్లర దొరకక నానా కష్టాలు పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రూ.2000 కరెన్సీ నోట్ల సరఫరాను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా తగ్గించినట్టు తెలుస్తోంది. కొన్ని వారాల నుంచి 2000 రూపాయి నోట్ల సరఫరా పడిపోయినట్టు ఓ ఆంగ్ల పత్రిక రిపోర్టులో తేలింది. 2000 రూపాయి నోట్ల సరఫరాను తగ్గించి, ఆర్బీఐ ఎక్కువగా కొత్త రూ.500 నోట్ల సరఫరాపై దృష్టిసారించినట్టు ఈ రిపోర్టు నివేదించింది. '' ప్రస్తుతం ఎక్కువగా రిజర్వు బ్యాంకు నుంచి ఎక్కువ విలువ కలిగిన నోట్లలో 500 రూపాయి నోట్లే ఎక్కువగా వస్తున్నాయి'' అని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నీరజ్ వ్యాస్ చెప్పారు. కేవలం 2000 రూపాయి నోట్లను రీసర్క్యూలేషన్ కిందనే తిరిగి మళ్లీ తమ దగ్గరకు వస్తున్నాయని, కొత్తగా ఆర్బీఐ నుంచి ఏమీ రావడం లేదన్నారు.
ప్రతి ఏటీఎంలలో నగదును స్టోర్ చేయడానికి నాలుగు క్యాసెట్లు ఉంటాయని, ఒకవేళ ఒక క్యాసెట్ 2000 రూపాయి నోట్లను కలిగిఉంటే ఆ మొత్తం రూ.60 లక్షల వరకు ఉంటుందని తెలిసింది. అదేవిధంగా ఒకవేళ ఆ క్యాసెట్‌ను రూ.500 నోట్లతో నింపితే, మెషిన్ సామర్థ్యం రూ.25 లక్షలకు పడిపోతుందని వెల్లడైంది. కానీ కస్టమర్లకు తేలికగా చిల్లర దొరకడానికి, ఏటీఎంల వద్ద సామర్థ్యం తగ్గినప్పటికీ, చిన్న కరెన్సీ నోట్లు రూ.500 నోట్లనే ఎక్కువగా సరఫరా చేయాలని ఆర్బీఐ దృష్టిసారించిందని తెలిసింది. ప్రీ-డీమానిటైజేషన్ సమయంలో ఉన్న నగదు కంటే తక్కువగానే ప్రస్తుతం మార్కెట్‌లో నగదు ఉంది. సెంట్రల్ బ్యాంకు త్వరలోనే చిల్లర సమస్యను మరింత తగ్గించడానికి కొత్త రూ.200 నోట్లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టబోతుంది. కానీ ఆ నోట్లను ఆర్బీఐ ఏటీఎంల ద్వారా అందించదని రిపోర్టులు పేర్కొంటున్నాయి.