ఒకే డిపాజిట్.. వేర్వేరు వడ్డీరేట్లు | RBI nod for different rates on deposits with early withdrawal | Sakshi
Sakshi News home page

ఒకే డిపాజిట్.. వేర్వేరు వడ్డీరేట్లు

Apr 17 2015 1:59 AM | Updated on Sep 3 2017 12:23 AM

ఒకే డిపాజిట్.. వేర్వేరు వడ్డీరేట్లు

ఒకే డిపాజిట్.. వేర్వేరు వడ్డీరేట్లు

స్థిర డిపాజిట్లకు సంబంధించి వేర్వేరు వడ్డీ రేట్లను ఆఫర్ చేసే అవకాశం ఇకపై...

ముందస్తు విత్‌డ్రాయెల్‌తో ఇకపై భిన్న వడ్డీరేటు ఆఫర్...
బ్యాంకులకు ఆర్‌బీఐ అనుమతి

ముంబై: స్థిర డిపాజిట్లకు సంబంధించి వేర్వేరు వడ్డీ రేట్లను ఆఫర్ చేసే అవకాశం ఇకపై బ్యాంకులకు లభించనుంది. దీనితో ముందే విత్‌డ్రా చేసుకుంటే లభించే వడ్డీరేటు ఎంతో కూడా కస్టమర్‌కు డిపాజిట్ సమయంలోనే తెలిసే అవకాశం ఏర్పడింది. దీని ప్రకారం ఇకమీదట ‘డిపాజిట్ ముందస్తు విత్‌డ్రా అవకాశంతో’ భిన్న వడ్డీరేటును బ్యాంకులు ఆఫర్ చేస్తాయి.  

ముందే ఈ ఎంపిక అవకాశాన్ని  (మెచ్యూరిటీ అనంతర విత్‌డ్రాయెల్, మెచ్యూరిటీ ముందస్తు విత్‌డ్రాయెల్)  బ్యాంకులు కస్టమర్లకు కల్పించాలి. వారి ఎంపికకు వీలుగా వేర్వేరు వడ్డీరేట్లను ఆఫర్ చేయాలి. రూ.15 లక్షలు ఆలోపు డిపాజిట్లపై ఈ విధానాన్ని తప్పనిసరిగా అనుసరించాలని ఆర్‌బీఐ నిర్దేశించింది. అయితే రూ.15 లక్షలకు పైన ముందస్తు విత్‌డ్రాయెల్ అవకాశం లేకుండా డిపాజిట్ల ఆఫర్ చేయవచ్చని ఆర్‌బీఐ పేర్కొంది. ఈ మేరకు  ఆర్‌బీఐ గురువారం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.  

ముందస్తు విత్‌డ్రాయెల్ సదుపాయం ప్రాతిపదికన టర్మ్ డిపాజిట్‌లపై విభిన్న వడ్డీరేటు ఆఫర్‌కు బ్యాంకులకు అనుమతించనున్నట్లు ఫిబ్రవరిలో జరిగిన ఆరవ ద్వైమాసిక పరపతి విధానం సందర్భంగా ఆర్‌బీఐ ప్రకటించింది. వడ్డీరేట్లకు సంబంధించి బ్యాంకులు తప్పనిసరిగా బోర్డ్ అనుమతించిన విధానాన్ని అనుసరించాలని తెలిపింది. ఆఫర్ చేస్తున్న వడ్డీరేట్లు సహేతుకంగా, తగిన విధంగా, పారదర్శకంగా, అవసరమైతే పర్యవేక్షణా సమీక్షకు అనువైనదిగా ఉండాలని బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించింది.

రైతులకు కొత్త వడ్డీ సబ్సిడీ పథకంపై కసరత్తు
జూన్ వరకూ పాత విధానమే...

కాగా... 2015-16కు సంబంధించి రైతులకు త్వరలో కొత్త వడ్డీ సబ్సిడీ పథకాన్ని ప్రకటించనున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. ఇందుకు తగిన కసరత్తు జరుగుతున్నట్లు వెల్లడించింది. నష్టపోయిన పంటలకు అధిక పరిహారాన్ని అందజేస్తామని ప్రధాని నరేంద్రమోదీ వారం క్రితమే పేర్కొన్న నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ ప్రకటన చేసింది. అప్పటివరకూ మధ్యంతర చర్యగా 2014-15 వడ్డీ రాయితీ పథకమే జూన్ 30 వరకూ కొనసాగుతుందని ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది. 2014-15 పథకం ప్రకారం, రైతుకు రూ.3 లక్షల వరకూ స్వల్పకాలిక పంట రుణాల విషయంలో 2 శాతం రాయితీ లభిస్తుంది. అంటే వారికి 7 శాతానికే రుణ సదుపాయం లభిస్తుంది. రుణాలు సకాలంలో చెల్లించిన రైతుకు అదనంగా.. 3 శాతం వడ్డీరేటు రాయితీ లభిస్తుంది.
 
ఏ బ్యాంకు మిషన్ నుంచైనా క్యాష్ డిపాజిట్..!
అన్ని నగదు డిపాజిట్ మిషన్లను నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్ (ఎన్‌ఎఫ్‌ఎస్)కు అనుసంధానించాలని రిజర్వ్ బ్యాంక్ భావిస్తోంది. దీనివల్ల ఏ బ్యాంక్ మిషన్ నుంచైనా తమ బ్యాంక్ అకౌంట్స్‌లో కస్టమర్లు క్యాష్ డిపాజిట్ చేసుకోగలుగుతారు (ఇంటర్‌ఆపరబుల్). ఎన్‌ఎఫ్‌ఎస్‌కు ఇప్పటికే అన్ని ఏటీఎంల అనుసంధానం జరిగింది.

ఇప్పుడు అన్ని క్యాష్ డిపాజిటింగ్ మిషన్లనూ ఎన్‌ఎఫ్‌ఎస్‌కు అనుసంధానించాలన్న ప్రతిపాదన నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ (ఎన్‌పీసీఐ) నుంచి వచ్చినట్లు ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ హెచ్‌ఆర్ ఖాన్ తెలిపారు. ఏ మిషన్ నుంచైనా నగదు లావాదేవీ నెరపే సౌలభ్యం అన్ని బ్యాంకుల కస్టమర్లకూ లభిస్తుందని అన్నారు.  అంతకుమందు ఆయన ముంబైలో దేనా బ్యాంక్ సెల్ఫ్ సర్వీస్ ఈ-స్మార్ట్ సౌలభ్యాన్ని ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement