క్రెడిట్ కార్డు చెల్లింపులకు రెండంచెల ప్రక్రియ తప్పనిసరి
ముంబై: దేశీ క్రెడిట్ కార్డు చెల్లింపులకు సంబంధించి రెండంచెల ధృవీకరణ విధానం తప్పనిసరని రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) స్పష్టం చేసింది. అదనపు వెరిఫికేషన్ ప్రక్రియ పాటించకుండా కొన్ని క్రెడిట్ కార్డు లావాదేవీలు విదేశీ పేమెంట్ వ్యవస్థ ద్వారా జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ తరహా చెల్లింపులు రూపాయి మారకంలో, దేశీయ బ్యాంకుల ద్వారానే జరగాలని స్పష్టం చేసింది. దీన్ని పాటించేందుకు కంపెనీలకు అక్టోబర్ 31దాకా గడువు ఇస్తున్నట్లు వివరించింది.
అమెరికాకు చెందిన ట్యాక్సీ సేవల సంస్థ యూబర్ టెక్నాలజీస్ వంటి కంపెనీలపై ఆర్‌బీఐ ప్రకటన ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. సాధారణంగా క్రెడిట్ కార్డు లావాదేవీలకు రెండంచెల ప్రక్రియ ఉంటుంది. మొదటి దశలో కస్టమరు తన క్రెడిట్ కార్డు వివరాలు ఇస్తారు. ఆ తర్వాత ఫోన్‌కి వచ్చిన వన్‌టైమ్ పాస్‌వర్డ్‌ను టైప్ చేసిన తర్వాత ప్రక్రియ పూర్తవుతుంది. కానీ, యూబర్ విదేశీ చెల్లింపుల వ్యవస్థను ఉపయోగించుకుంటున్నందున .. రెండో అంచె ధ్రువీకరణ నిబంధనను పాటించడం లేదని ఆరోపణలున్నాయి. దీనిపై దేశీయ ట్యాక్సీ సంస్థలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆర్‌బీఐ సర్క్యులర్ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, సర్క్యులర్‌లో ప్రత్యేకంగా ఏ కంపెనీ పేరును ప్రస్తావించలేదు.