one time password
-
మొబైల్ కనెక్షన్ మార్పు సులభతరం
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ యూజర్లు .. పోస్ట్ పెయిడ్ నుంచి ప్రీ–పెయిడ్‌కు, ప్రీ–పెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్‌కు మారడాన్ని సులభతరం చేసే దిశగా టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా సిమ్ మార్చక్కర్లేకుండా వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) ఆధారిత ధృవీకరణ ద్వారా ఈ ప్రక్రియ జరిగేలా టెలికం శాఖకు (డాట్) ప్రతిపాదించింది. దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసి, ఆధారాలు (పీవోసీ) ఇవ్వాలంటూ టెలికం ఆపరేటర్లకు డాట్ సూచించింది. పీవోసీని బట్టి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు డాట్ ఏడీజీ సురేశ్ కుమార్ మే 21న జారీ చేసిన నోట్లో పేర్కొన్నారు. టెల్కోల ప్రతిపాదన ప్రకారం.. కనెక్షన్‌ను మార్చుకోదల్చుకున్న వారు తమ సర్వీస్ ప్రొవైడర్‌కు ఎస్ఎంఎస్, ఐవీఆర్ఎస్, వెబ్సైట్, అధీకృత యాప్ ద్వారా అభ్యర్ధన పంపాల్సి ఉంటుంది. దీన్ని ఆమోదిస్తూ .. టెలికం సంస్థ ఒక ప్రత్యేక ఐడీ, ఓటీపీని మొబైల్ యూజరుకు పంపిస్తుంది. ఈ ఓటీపీ 10 నిమిషాల దాకా చెల్లుబాటు అవుతుంది. ఓటీపీని ధృవీకరిస్తే.. కనెక్షన్ మార్పునకు యూజరు సమ్మతించినట్లుగా టెలికం సంస్థ పరిగణిస్తుంది. ఏ తేదీ, సమయం నుంచి మార్పు అమల్లోకి వస్తుందనేది సమాచారం అందజేస్తుంది. ఇలా కనెక్షన్ స్వరూపం మారే క్రమంలో గరిష్టంగా అరగంట పాటు మాత్రమే సర్వీసుల్లో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని డీవోటీ తన నోట్లో పేర్కొంది. -
రూ.100కు ఓటీపీ.. వివాహితకు వేధింపులు
సాక్షి, సిటీబ్యూరో : వాట్సాప్ యాక్టివేట్ చేసుకోవాలన్నా..అమెజాన్ ప్రైమ్ వినియోగించాలన్నా...ఈ తరహా సేవలు ఏది పొందాలన్నా వినియోగదారుడి ఫోన్‌కు వచ్చే వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) అత్యంత కీలకం. ఆయా యాప్స్‌లో కస్టమర్ ఎంటర్ చేసిన నెంబర్‌కే ఇవి వస్తుంటాయి. సదరు యాప్స్ దురి్వనియోగం కాకుండా, అలా అయితే బాధ్యుల్ని ఫోన్ నెంబర్ ద్వారా గుర్తించడానికి ఈ విధానం ప్రవేశపెట్టారు. అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఈ ఓటీపీలను విక్రయించేస్తున్నారు. గరిష్టంగా రూ.100 వాలెట్స్‌లోకి చెల్లించి కావాల్సిన యాప్‌నకు ఓటీపీ పొందవచ్చు. ఈ విధానంలో వాట్సాప్‌ను యాక్టివేట్ చేసుకున్న బీఫార్మసీ విద్యార్థి తన సమీప బంధువునే వేధించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. ఆద్యంతం సాంకేతికంగా దర్యాప్తు చేసిన అధికారులు బుధవారం నిందితుడిని గుర్తించి నోటీసులు జారీ చేశారు. తిరుమలగిరి ప్రాంతానికి చెందిన ఓ యువకుడు (20) బీఫార్మసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇతడి కుటుంబం ఉండే అపార్ట్మెంట్లోనే సమీప బంధువైన వివాహిత కుటుంబంతో నివసిస్తోంది. ఆమెపై కన్నేసిన ఈ యువకుడు సోషల్‌మీడియా ద్వారా వేధించాలని నిర్ణయించుకున్నాడు. అయితే నేరుగా తన వాట్సాప్ నెంబర్‌తోనే అలా చేస్తే దొరికిపోతానని భావించాడు. దీంతో కొత్త నెంబర్‌తో వాట్సాప్ యాక్టివేట్ చేయాలని ప్రయతి్నంచాడు. టెలిగ్రామ్ యాప్‌లో ఉన్న ఓ గ్రూప్‌లో ఈ ఓటీపీలు విక్రయిస్తున్నారని తెలుసుకున్నాడు. ఆ గ్రూప్‌లో సంప్రదించడం ద్వారా రూ.20 చెల్లించి ఒడిశాకు సంబంధించిన సెల్‌ఫోన్ నెంబర్ ఓటీపీ తీసుకున్నాడు. దీన్ని అప్పటికే తన ఫోన్లో ఇన్స్టాల్ చేసి ఉంచిన వాట్సాప్‌లోకి ఎంటర్ చేసి యాక్టివేట్ చేసుకున్నాడు. ఇలా తిరుమలగిరి యువకుడు వినియోగిస్తున్న సెల్ఫోన్లో ఒడిశా నెంబర్‌తో కూడిన వాట్సాప్ పనిచేయడం మొదలైంది. దీన్ని వినియోగించి దాదాపు రెండు నెలలుగా తన సమీప బంధువైన వివాహితకు అశ్లీల సందేశాలు పంపిస్తూ వేధింపులకు దిగాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ నవీన్ నేతృత్వంలో ఎస్సై రమేష్ ఈ కేసు సవాల్‌గా తీసుకుని దర్యాప్తు చేశారు. ఎట్టకేలకు బాధితురాలి సమీప బంధువే నిందితుడిగా గుర్తించాడు. బుధవారం అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా ఓటీపీల విక్రయం విషయం వెలుగులోకి వచ్చింది. తాను ఎప్పటికీ చిక్కనని భావించానని, అయితే తక్కువ కాలంలోనే పట్టుబడ్డానని బీఫార్మసీ విద్యార్థి చెప్పుకొచ్చాడు. నిందితుడికి సీఆరీ్పసీ 41 ఏ కింద నోటీసు జారీ చేశారు. సదరు టెలిగ్రామ్ గ్రూప్‌లో ఓటీపీల విక్రయంపై దృష్టి పెట్టారు. వాళ్లు వీటిని ఎలా తీసుకుంటున్నారు? ఈ వ్యవహారంలో సూత్రధారులు ఎవరు? అనే అంశాలు దర్యాప్తు చేస్తున్నారు. -
బ్యాంక్ అధికారినంటూ బకరా చేశాడు..!
"హలో.. నేను బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాను. మీకు వచ్చిన వన్ టైం పాస్ వర్డ్ చెప్పండి' అంటూ ఓ మోసగాడు చిరు ఉద్యోగిని నమ్మించి కుచ్చుటోపీ పెట్టాడు. ఉద్యోగి బ్యాంకు అకౌంట్ నుంచి రూ.51 వేలు వేరే ఖాతాకు మళ్లించాడు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫిలింనగర్‌లోని జ్ఞానిజైల్‌సింగ్ నగర్లో నివసించే ఎం.గిరి ప్రైవేటు ఉద్యోగి. ఆదివారం ఉదయం ఫిలింనగర్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నానంటూ ఓ అపరిచితుడు ఫోన్ చేశాడు. మీ అకౌంట్ ఇక్కడే ఉందని, కాబట్టి 'వన్ టైమ్ పాస్వర్డ్' చెప్పాలని కోరాడు. ఆ తర్వాత మెసేజ్ కూడా పెట్టాడు. దీంతో అతను బ్యాంకు ఉద్యోగి అని నమ్మిన గిరి పాస్వర్డ్ ను తెలిపాడు. కొద్దిసేపట్లోనే వరుసగా మూడుసార్లు అతని అకౌంట్ నుంచి రూ.51 వేలు డ్రా అయ్యాయి. డ్రా చేసిన వ్యక్తి జార్ఖండ్ నుంచి లావాదేవీలు నిర్వహించినట్లు తేలింది. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఫోన్ కాల్స్‌లో, ఈమెయిళ్లలో, మెసేజ్‌లలో అగంతకులకు వన్ టైమ్ పాస్వర్డ్, ఇతర బ్యాంకు వివరాలు తెలుపకూడదని నిత్యం బ్యాంకులు ఖాతాదారులను అప్రమత్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పెద్దనోట్ల రద్దు నేపథ్యం డిజిటల్ మోసాలు పెరిగిపోయే అవకాశముండటంతో బ్యాంకు ఖాతాదారులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. -
డీఎస్సీ అభ్యర్థులకు ఓటీపీలొచ్చేశాయ్
నేడు, రేపు ఆన్లైన్ ఆప్షన్లకు అవకాశం జూన్ 1న విజయవాడలో ప్రతిజ్ఞ 3 నుంచి 11 వరకు శిక్షణ చిత్తూరు(గిరింపేట): జిల్లాలో డీఎస్సీ-2014 ద్వారా ఎంపికైన టీచర్ల సెల్ఫోన్లకు వన్‌టైం పాస్‌వర్డు(ఓటీపీ)ని రాష్ట్ర విద్యాశాఖ ఆదివారం సంబంధిత అభ్యర్థుల సెల్ఫోన్లకు మెసేజ్ పంపింది. డీఎస్సీలో ఎంపికైన ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, భాషా పండితులు, పీఈటీల్లో 20మందికి ఓటీపీ అందకపోవడంతో వారు డీఈవో కార్యాలయాన్ని సంప్రదించారు. డీఈవో నాగేశ్వరరావు రాష్ట్ర విద్యాశాఖతో సంప్రదించి మధ్యాహ్నం 3 గంటలకు వారందరికీ ఓటీపిని అందజేశారు. జూన్ 1 లోపు అభ్యర్థులకు ఎంపిక స్థలాలను తెలియజేయాలని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశాలను జారీచేశారు. ఆ ప్రకారం ఎంపికైన అభ్యర్థులు వెబ్‌కౌన్సెలింగ్ కోసం జిల్లాకు ప్రత్యేకంగా సర్వర్లను ఏర్పాటుచేసినట్లు విద్యాశాఖ సిబ్బంది వెల్లడిస్తున్నారు. సోమ, మంగళవారాల్లో అభ్యర్థులు వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా తమకు కావాల్సిన స్కూళ్లను కోరుకోవడానికి అవకాశం వుంటుంది. ఆ తర్వాత మే 30 లేదా జూన్ 1న వారికి కేటాయించిన పాఠ శాల పేరును రాష్ట్ర విద్యాశాఖ నేరుగా అభ్యర్థుల సెల్ఫోన్లకు మెసేజ్ ద్వారా అందజేస్తుంది. ఈ ఏడాది సరికొత్త విధానంతో ఆన్లైన్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు డీఈవో డిజిటల్ సంతకంతో కూడిన నియామక పత్రాలను అందివ్వనున్నారు. అనంతరం నూతనంగా బాధ్యతలను స్వీకరించనున్న టీచర్లకు జిల్లాలో జూన్ 3 నుంచి 11 వరకు శిక్షణ ఇవ్వనున్నారు. ఎంపికైన నూతన టీచర్ పోస్టుల వివరాలు జిల్లాలో ఖాళీగా ఉన్న 1421 పోస్టుల్లో డీఎస్సీ-2014 ద్వారా 1,335 పోస్టులను భర్తీ చేయనున్నారు. అందు లో ఎస్జీటీ తెలుగు -945 ఖాళీలకు-938 మందిని, తమిళం-3 ఖాళీలకు 2, ఉర్దూ-75 ఖాళీలకు 29 మందిని, భాషా పండితులకు గాను తెలుగులో 65 ఖాళీలకు గాను 64 మందిని, హిందీలో 80కి 80 మందిని, ఉర్దూలో 20కి 10 మందిని, సంస్కృతంలో 1 ఖాళీకి ఒకరిని, స్కూల్ అసిస్టెంట్ గణిత ం తెలుగు మీడియంలో 58 ఖాళీలకు 58 మందిని, ఉర్దూలో 8 ఖాళీలకు ముగ్గురిని నియమిస్తున్నారు. తమిళంలో 2 ఖాళీలకు, ఫిజికల్ సైన్స్ ఉర్దూలో- 2 ఖాళీలకు, బయాలజికల్ సైన్స్‌లో-2 పోస్టులకు ఎవరినీ ఎంపిక చెయ్యలేదు, సోషల్స్టడీస్ తెలుగు మీడియంలో 95 ఖాళీలకు 95 మందిని, ఉర్ధూలో 5 మందికి ఒకరిని, తమిళంలో 2 ఖాళీలకు ఒకరిని, స్కూల్ అసిస్టెంట్ తెలుగులో 23 ఖాళీలకు 23 మందిని, హిందీలో 5 ఖాళీలకు 5 మందిని, ఇంగ్లీషులో 18 ఖాళీలకు 17 మందిని, తమిళంలో 1 ఖాళీకి ఒకరిని, పీఈటీ తెలుగు మీడియంలో 7 ఖాళీలకు ఏడుగురిని ఎంపికచేస్తున్నారు. ఉర్దూ మీడియంలో 4 ఖా ళీలండగా ఎవరినీ నియమించలేదు. మొత్తం 1,421 ఖాళీలకు 1,335 మంది టీచర్లను నియమించనున్నారు. విజయవాడలో ప్రతిజ్ఞ డీఎస్సీ-2014 ద్వారా ఎంపికై బాధ్యతలు స్వీకరించనున్న ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ చేయిస్తారు. జూన్ 1వ తేదీ సాయంత్రం 3 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో జరిగే ఈ కార్యక్రమానికి అంతా తప్పకుండా హాజరుకావాలి. అదేరోజు ఉదయం జిల్లా అభ్యర్థులు విజయవాడలో ఎంజీ రోడ్డులో ఉన్న చిల్డ్రన్ మాంటెస్సోరీ స్కూల్ వద్దకు వెళ్లి తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఒకటో తేదీలోపు అంద రూ ఆన్లైన్లో apdsc.cgg.gov.in వెబ్సైట్లో నియమాకపత్రాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
క్రెడిట్ కార్డు చెల్లింపులకు రెండంచెల ప్రక్రియ తప్పనిసరి
ముంబై: దేశీ క్రెడిట్ కార్డు చెల్లింపులకు సంబంధించి రెండంచెల ధృవీకరణ విధానం తప్పనిసరని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) స్పష్టం చేసింది. అదనపు వెరిఫికేషన్ ప్రక్రియ పాటించకుండా కొన్ని క్రెడిట్ కార్డు లావాదేవీలు విదేశీ పేమెంట్ వ్యవస్థ ద్వారా జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ తరహా చెల్లింపులు రూపాయి మారకంలో, దేశీయ బ్యాంకుల ద్వారానే జరగాలని స్పష్టం చేసింది. దీన్ని పాటించేందుకు కంపెనీలకు అక్టోబర్ 31దాకా గడువు ఇస్తున్నట్లు వివరించింది. అమెరికాకు చెందిన ట్యాక్సీ సేవల సంస్థ యూబర్ టెక్నాలజీస్ వంటి కంపెనీలపై ఆర్బీఐ ప్రకటన ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. సాధారణంగా క్రెడిట్ కార్డు లావాదేవీలకు రెండంచెల ప్రక్రియ ఉంటుంది. మొదటి దశలో కస్టమరు తన క్రెడిట్ కార్డు వివరాలు ఇస్తారు. ఆ తర్వాత ఫోన్‌కి వచ్చిన వన్‌టైమ్ పాస్‌వర్డ్‌ను టైప్ చేసిన తర్వాత ప్రక్రియ పూర్తవుతుంది. కానీ, యూబర్ విదేశీ చెల్లింపుల వ్యవస్థను ఉపయోగించుకుంటున్నందున .. రెండో అంచె ధ్రువీకరణ నిబంధనను పాటించడం లేదని ఆరోపణలున్నాయి. దీనిపై దేశీయ ట్యాక్సీ సంస్థలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆర్బీఐ సర్క్యులర్ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, సర్క్యులర్‌లో ప్రత్యేకంగా ఏ కంపెనీ పేరును ప్రస్తావించలేదు. -
రండి బాబూ.. రండి!
శాతవాహన యూనివర్సిటీ : పూలమ్మిన చోటే కట్టెలమ్మిన చందంగా మారింది ఇంజినీరింగ్ కళాశాలల పరిస్థితి. వీటిల్లో ప్రవేశాలకు గతంలో ఎగబడిన విద్యార్థులు.. ఇప్పుడు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ ఏడాది జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో వివిధ కోర్సుల సీట్లు నిండడమే గగనం అంటున్నారు. ఈ క్రమంలో పలు కళాశాలల యాజమాన్యాలు చేస్తున్న ఫీట్లు ఆశ్చర్యపరుస్తున్నాయి. విద్యార్థులను తమ కళాశాలల్లో చేర్చే బాధ్యతను పూర్వవిద్యార్థులకు అప్పగిస్తున్నాయి. ఇందుకు ప్రతిఫలంగా డబ్బులు, ల్యాప్‌టాప్‌లు, ఐఫోన్ తదితరాలను సమర్పించుకుంటున్నాయి. విద్యార్థులకూ ఎంతో కొంత ముట్టజెబుతున్నాయి. ఇవేవీ మేనేజ్మెంట్ సీట్లు కావు మరి. స్నేహం చేస్తారు.. సలహా ఇస్తారు.. వెబ్ కౌన్సెలింగ్‌కు వెళ్లే విద్యార్థులను ట్రాప్ చేసేందుకు పూర్వవిద్యార్థులను దింపుతున్నాయి పలు కళాశాలలు. ఒక్కో పూర్వ విద్యార్థి కనీసం ఐదుగురిని చేర్చాలని టార్గెట్ విధించినట్లు తెలిసింది. వీరు విద్యార్థులతో మాటమాటా కలిపి.. పలానా కళాశాలో చేరితే భవిష్యత్ బాగుంటందని, తామూ అక్కడే చదివామని హైప్ పెంచుతున్నారు. ఇంకా కళాశాలలో చదువుతున్న వారే ఈ పనిచేస్తే.. వారికి ఇంటర్నల్స్‌లో అధిక మార్కులు వేస్తామంటూ ప్రోత్సహిస్తున్నాయి. సర్టిఫికె ట్ల వెరిఫికేషన్ పూర్తయిన వారి నుంచి వన్‌టైం పాస్‌వర్డ్‌ను సైతం తస్కరించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. గుర్తింపు నిలుపుదలపై యాజమాన్యాలు సీరియస్ ఇటీవల తనిఖీల్లో జిల్లాలోని ఏడు ఇంజినీరింగ్ , ఆరు ఫార్మసీ కళాశాలకు గుర్తింపు నిలుపుదల చేయడంపై యాజమాన్యాలు సీరియస్‌గా ఉన్నాయి. ఇంజినీరింగ్ సీట్లు తగ్గిస్తే సరేకానీ ఇలా కళాశాలలను ప్రవేశాలకు అనుమతి నిరాకరించడం దారుణమంటున్నాయి. తనిఖీల తీరుపై కోర్టులో పిటిషన్ వే శామని, గుర్తింపు నిలుపుదలపై ఈ నెల 21న వివరణ ఇవ్వాలని అధికారులను జడ్జి ఆదేశించారని కళాశాలల యాజమాన్యాలు పేర్కొన్నాయి. ఉత్తమ ఫలితాలు సాధించిన కళాశాలలుగా పేరున్న వాటిని తొలగించడం విడ్డూరంగా చెప్పుకుంటున్నారు. కాగా, కళాశాలల అనుమతుల నిలుపుదలలో రాజకీయాలు ఇమిడి ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థులూ.. ఆందోళన వ ద్దు కళాశాలల గుర్తింపు అంశంపై విద్యార్థులు ఆందోళన చెందొద్దని కౌన్సెలింగ్ కేంద్రం సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కె.ప్రేమ్‌కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని వెబ్ ఆప్షన్లు ఎన్నుకోవడానికి ఉన్న కేంద్రాల్లో ఆన్లైన్లో కనిపించే కళాశాలలకే గుర్తింపు ఉన్నట్లని స్పష్టం చేశారు. వన్‌టైమ్ పాస్వర్డ్ విషయంలో గోప్యత పాటించాలని కోరారు. గుర్తింపు ఉన్న కళాశాలలివే... జ్యోతిష్మతి-1, జ్యోతిష్మతి -2, జేఎన్టీయూ కొండగట్టు, జేఎన్టీయూ మంథని, హుజూరాబాద్ కి ట్స్ ఇంజినీరింగ్ కళాశాల, పెద్దపల్లి మధర్ థెరిస్సా, కరీంనగర్ నిగమ ఇంజినీరింగ్ కళాశాల, వాగేశ్వరి-1, వాగేశ్వరీ-2, వివేకానంద ఇంజినీరింగ్ కళాశాలలకు గుర్తింపు ఉంది. ఫార్మసీలో కరీంనగర్ శాతవాహన కళాశాలకు మాత్రమే అనుమతి ఉందని కౌన్సెలింగ్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ తెలిపారు. ఇది సోమవారం వరకు ఉన్న సమాచారమని, సలహాలు, సూచనల కోసం 96666 70193 సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. -
వెబ్ ఆప్షన్లపై తస్మాత్ జాగ్రత్త
శాతవాహన యూనివర్సిటీ: జిల్లాలో ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. విద్యార్థులు రెండు రోజులుగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ హాజరవుతున్నారు. కొందరు విద్యార్థులు గతంలో తీసుకున్న కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తున్నారు. ఎంసెట్ సర్టిఫికె ట్ల పరిశీలనతోనే ఇంజినీరింగ్ కళాశాలలో చేరడం కాదు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం కళాశాల ఎంపిక విషయంలో విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలిన ఎంసెట్ కౌన్సెలింగ్ క్యాంప్ ఆఫీసర్, ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.మధుసూదన్‌రెడ్డి, కో ఆర్డినేటర్ డాక్టర్ నితిన్, అసిస్టెంట్ కో ఆర్డినేటర్ డాక్టర్ కె.సాంబయ్య సూచిస్తున్నారు. ఆదివారం నుంచే వెబ్ఆప్షన్లు ప్రారంభ మ య్యా యి.సందేహాలుంటే 9666670193నిసంప్రదించొచ్చు. కొత్తగా వన్ టైం పాస్వర్డ్.. గతంలో విద్యార్థులు వెబ్ ఆప్షన్లు పెట్టడానికి స్క్రాచ్ కార్డు ఇచ్చేవారు. అందులోని సీక్రెట్ కోడ్ ద్వారా విద్యార్థులు కళాశాలలు ఎంపిక చేసుకునేవారు. కానీ దీనిలో పీఆర్వోల జోక్యం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారనే ఆరోపణలు విన్పించాయి. దీంతో ఈసారి పీఆర్వోలకు చెక్ పెడుతూ రాష్ర్ట ఉన్నత మండలి.. వన్‌టైం పాస్వర్డ్ అనే ఆప్షన్ తెచ్చింది. ఈ విధానంలో కౌన్సెలింగ్ సమయంలో విద్యార్థి ఇచ్చే ఫోన్ నంబరే కీలకం. ఒకసారే ఉపయోగించకునేలా ఒక సీక్రెట్ పాస్వర్డ్ విద్యార్థి సెల్‌ఫోన్‌కు మేసేజ్ రూపంలో వస్తుంది. ఆ పాస్ వర్డ్‌ను ఉపయోగించుకుని విద్యార్థి నచ్చిన కోర్సులో... కోరుకున్న కళాశాలలో చేరొచ్చు. కాబట్టి విద్యార్థి తన ఫోన్ నెంబర్విషయంలో గోప్యతను పాటిస్తూ కౌన్సెలింగ్ సెంటర్లో ఇవ్వాలి. విద్యార్థి ఎంచుకునే ఆప్షన్లను లేదా కళాశాలను మార్చాలనుకున్న మళ్లీ వన్‌టైం పాస్వర్డ్ మొదటి ఇచ్చిన నంబర్‌కు మాత్రమే వస్తుంది. తమ కళాశాలలో చేర్చుకోవడానికి యత్నించే పీఆర్వోలతో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. ఇంజినీరింగ్ కోర్సులో చేరిన వారికి తాయిలాలిచ్చేందుకూ పలు కళాశాలల యాజమాన్యాలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. కొనసాగుతున్న వెబ్ ఆప్షన్లు.... ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు వెబ్ఆప్షన్లు ప్రారంభమయ్యాయి. జిల్లాలో సర్టిఫికెట్ల పరిశీలనకు ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే వెబ్ఆప్షన్లు చేసుకోవచ్చు. జిల్లాకేంద్రంలోని ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలల, ఉజ్వల పార్క్ సమీపంలోని పాలిటెక్నిక్ మహిళా కళాశాలలో ఈ ఆప్షన్లను ప్రతీ రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వెబ్ఆప్షన్తో కళాశాలను ఎంపిక చేసుకోవచ్చు. ఈ నెల 17, 18వ తే దీల్లో 1 నుంచి 50 వేల ర్యాంకు వరకు, 20, 21 తే దీల్లో 50001 నుంచి లక్ష ర్యాంకు వరకు, 22, 23 తేదీల్లో 100001 వ ర్యాంకు నుంచి 1,50, 000 ర్యాంకు వరకు, 24, 25 తేదీల్లో 1,50,001 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు వెబ్ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. విద్యార్థుల మొదట ఉంచిన ఆప్షన్లు మార్చాలనుకుంటే 26 వ తే దీన 1 వ ర్యాంకు నుంచి లక్ష లోపు ర్యాంకులు ఉన్న వాళ్లు, 27న లక్ష ఒకటో ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు ఉన్న అభ్యర్థులు వారి ఆప్షన్లను మార్చుకోవచ్చు. ఈ నెల 30న విద్యార్థులకు ఏ కళాశాలల సీటు వచ్చిందనే మేసేజ్ వస్తుంది. సెప్టెంబర్ 1 సంబంధిత క ళాశాలకు వెళ్లి అన్ని విషయాలు కనుక్కోవచ్చు. విద్యార్థికి కళాశాల నచ్చకుంటే రెండో కౌన్సెలింగ్ మార్చుకోవచ్చని అధికారులు తెలిపారు. తనిఖీలతో ఆరు కళాశాలలు ఔట్.? కౌన్సెలింగ్‌కు ముందు జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో అధికారులు తనిఖీలు చేశారు. దాదాపు 6 ఇంజనీరింగ్ కళాశాలలకు అనుమతి రద్దు చేసినట్లు విశ్వనీయ సమాచారం. ప్రస్తుతం జిల్లాలోని 12 ఇంజనీరింగ్ కళాశాలలకే వెబ్ ఆప్షన్ పెట్టాలనే విషయాన్ని విద్యార్థులు గమనించాలని అధికారులు సూచనప్రాయంగా చెబుతున్నారు. అనుమతి రాని కళాశాలల పేర్లను గోప్యంగా ఉంచుతున్నారు. వసతులు సమకూర్చి మళ్లీ అనుమతులను తెచ్చుకునేందకు ఆయా కళాశాల యాజమాన్యాలు పావులు కదుపుతున్నట్లు సమాచారం. కౌన్సెలింగ్‌కు 699 మంది హాజరు ఆదివారం నిర్వహించిన సర్టిఫికెట్ల పరిశీలనకు జిల్లావ్యాప్తంగా 699 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎస్సారార్ కళాశాల సెంటర్లో 348 మంది, మహిళా పాలిటెక్నిక్ కళాశాల కేంద్రంలో 351 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 43 మంది ఉన ్నట్లు క్యాంపు ఆఫీసర్ తెలిపారు. -
వెబ్..డబ్..
నేటి నుంచి ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్ల ఎంపిక మొదటిసారిగా వన్ టైం పాస్వర్డ్ విధానం తొలి ప్రాధాన్య కళాశాలల వివరాలు సమగ్రంగా తెలుసుకోవాలి మొబైల్ ఇన్‌బాక్స్ ఖాళీ చేస్తే మేలు విజయవాడ : తీవ్ర ఉత్కంఠత మధ్య ప్రారంభమైన ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్ల ఎంపిక దశకు చేరుకుంది. రాష్ట్ర విభజన తదనంతర పరిణామాల నేపథ్యంలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌పై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. పునర్విభజన బిల్లులో పేర్కొన్న విధంగానే ఈ ఏడాది ఉమ్మడిగా ప్రవేశాలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశిం చింది. ఈ మేరకు రెండు రాష్ట్రాలు కౌన్సె లింగ్ ప్రక్రియను ప్రారంభించాయి. ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యా మండలి ఈ నెల 17నుంచి వెబ్ ఆప్లన్ల ఎంపికకు షెడ్యూల్ ప్రకటించింది. గతంలో జరిగిన కౌన్సెలింగ్ ప్రక్రియలో బ్రోకర్లు, కళాశాలల యాజమాన్యాలు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించి అభ్యర్థులను తప్పుదారి పట్టించిన ఘటనలు అనేకం ఉన్నాయి. దీంతో ఈ ఏడాది కౌన్సెలింగ్‌లో స్క్రాచ్ కార్డును రద్దు చేసి వన్ టైం పాస్‌వర్డ్‌ను ప్రవేశపెట్టింది. వన్ టైం పాస్వర్డ్ విధానంలో డేటాను హ్యాకింగ్ చేసే అవశాశం ఉండదు. ప్రత్యేకంగా ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ కోసం విజయవాడలోని ఎస్ఆర్ఆర్ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఆంధ్ర లయోల కళాశాలల్లో హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటుచేశారు. అభ్యర్థులు ఆయా హెల్ప్‌లైన్ సెంటర్లలోనే వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకుంటే మంచిది. ఈ ఏడాది నుంచి హెల్ప్‌లైన్ కేంద్రాల్లో విద్యార్థుల విద్యార్హత ధ్రువీకరణ పత్రాల జిరాక్సు కాపీలు అందజేస్తే సరిపోతుంది. వన్ టైం పాస్వర్డ్(ఓటీపీ) వల్ల ప్రయోజనాలు గతంలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనే అభ్యర్థులకు ముందుగానే పాస్వర్డ్ ఉన్న స్క్రాచ్ కార్డును ఇచ్చేవారు. కౌన్సెలింగ్ పూర్తయి సీటు ఎలాంట్మెంట్ అయ్యేవరకు ఆ పాస్‌వర్డ్‌ను భద్రంగా ఉంచుకోవాల్సి వచ్చేది. అయితే బ్రోకర్లకు, కళాశాలల యాజమాన్యాలకు ఆ పాస్వర్డ్ ముందుగానే తెలియడం వల్ల అభ్యర్థులు ఎంపిక చేసుకున్న కళాశాలల జాబితాను మార్చేసేవారు. ఈ పరిస్థితిని నివారించేందుకు వన్ టైం పాస్‌వర్డ్‌ను ప్రవేశపెట్టారు. ఈ విధానం ప్రకారం విద్యార్థులకు కౌన్సెలింగ్‌లో లాగిన్ అయిన వెంటనే వారు ముందుగా రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబరుకు పాస్వర్డ్ ఎస్ఎంఎస్ వస్తుంది. ఈ విధంగా ఎన్నిసార్లు లాగాన్ అయితే అన్నిసార్లు మొబైల్ నంబరుకు వేర్వేరు పాస్వర్డ్లు వస్తాయి. ప్రలోభాలకు లొంగొద్దు ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహించే హెల్ప్‌లైన్ సెంటర్లు, నెట్‌కేఫ్‌ల వద్ద బ్రోకర్లు, కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని కళాశాలలకు సంబంధించిన బ్రోకర్లు, యజమానులు యూనిఫాం ఉచితమని, పాకెట్ మనీ ఇస్తామని, బస్‌పాస్ ఉచితమని ఆఫర్లు ఇస్తున్నారు. కొందరు ఇంకో అడుగు ముందుకేసి మొదటి సంవత్సరం ఫీజులో సగం వెనక్కి ఇచ్చేస్తామంటూ ఆకర్షించేందుకు ప్రయత్నిసున్నారు. అటువంటి వారి ప్రలోభాలకు గురికాకుండా సరైన కళాశాలలను ఎంపిక చేసుకోవాల్సి ఉంది. సొంతగా అప్షన్లు ఎంపిక చేసుకోవాలి. ఏయే కళాశాలలను ప్రాధాన్యత ఇచ్చారనే విషయం బయటకు వెల్లడించకపోవడం ఉత్తమం. అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వెబ్ అప్షన్లను ఎంపిక చేసుకునే సమయంలో మొబైల్ ఇన్‌బాక్స్‌ను ఖాళీగా ఉంచితే మేలు. కాలేజీ ఎంపిక చేసుకునేముందు అక్కడి సౌకర్యాలు, ఆధ్యాపకులు, లేబొరేటరీలు, ప్లేస్మెంట్ సౌకర్యం తదితర వివరాలు సమగ్రంగా తెలుసుకోవాలి. టాప్ కాలేజీల జాబితాతోపాటు నచ్చిన బ్రాంచిల లిస్ట్ కూడా సిద్ధం చేసుకుంటే మంచిది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో ఎక్కడైనా కళాశాలను ఎంపిక చేసుకోవచ్చు( ఏ రాష్ర్టంలో వాళ్లు ఆ రాష్ట్రంలోనే కళాశాలలు ఎంపిక చేసుకోవాలని కొందరు దళారులు తప్పుదారి పట్టించే అవకాశం ఉంది.) కాలేజీ, బ్రాంచిల ఎంపికకు సంబంధించి ఒక్కో ర్యాంకు వారికి రెండు రోజుల సమయం కేటాయించారు. మొదటి రోజు కొన్ని అప్షన్లు ఇచ్చి ఇతర కారణాల వల్ల లాగ్ అవుట్ కావాల్సి వస్తే ‘సేవ్’ అనే బటన్‌పై క్లిక్ చేయాలి. వెబ్ ఆప్షన్లకు అదే చివరి రోజైతే సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. అపుడు మాత్రమే ఎంపిక చేసుకున్న కళాశాలలు, బ్రాంచిల జాబితా సబ్మిట్ అవుతుంది. అప్షన్లు మార్పుకు మరో రోజు అవకాశం కల్పిచడం జరిగింది. వన్ టైం పాస్వర్డ్ ఎంతో మేలు గతంలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ జరిగే సమయంలో కొందరు నెట్ సెంటర్ల యజమానులు కీ బోర్డుకు ప్రత్యేకమైన గాడ్జెట్‌ను అమర్చి పాస్‌వర్డ్‌ను తెలుసుకునేవారు. తద్వారా అప్షన్లు మార్చేవారు. కొత్త విధానంలో ఎప్పటికప్పుడు పాస్వర్డ్ మారడం వల్ల అభ్యర్థి డేటాను తస్కరించేందుకు ఏ మాత్రం అవకాశం లేదు. ఇది ఎంతో మేలు చేస్తుంది. అప్షన్లు ఎంపిక చేసుకునే ముందు అభ్యర్థి ప్రతి కళాశాల సమచారం తెలసుకోవడం మంచిది. - కె.శ్రీధర్, కంప్యూర్ సైన్స్ ఫ్యాకల్టీ, పీబీ సిద్ధార్థ కాలేజీ -
మొబైల్‌కు వన్‌టైం పాస్వర్డ్!
ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లపై అధికారుల కసరత్తు హెల్ప్‌లైన్ కేంద్రాల్లోనే ఆప్షన్లకు ప్రత్యామ్నాయం ఆప్షన్లలో కాలేజీల ప్రమేయాన్ని తగ్గించేలా చర్యలు సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే వెబ్ ఆప్షన్లలో వన్ టైం పాస్వర్డ్ విధానం అమల్లోకి రానుంది. విద్యార్థులు హెల్ప్‌లైన్ కేంద్రాలకు వచ్చి ఆప్షన్లు ఇవ్వాలన్న నిబంధనకు ప్రత్యామ్నాయంగా సెల్‌ఫోన్‌కు వన్ టైం పాస్వర్డ్ పంపటంపై అధికారులు దృష్టి సారించారు. విద్యార్థులను మోసగించడం, ప్రలోభపెట్టడం లాంటి అక్రమాలను వన్ టైం పాస్వర్డ్ ద్వారా నివారించవచ్చని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. వెబ్ ఆప్షన్ల విధానంపై గురువారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ అంశాలపై లోతుగా చర్చించారు. సమావేశంలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, కార్యదర్శి సతీష్‌రెడ్డి, వైస్ ఛైర్మన్ విజయప్రకాష్, సాంకేతిక విద్యా కమిషనర్ అజయ్‌జైన్, యూనివర్సిటీల వైస్ ఛాన్స్లర్లు పాల్గొన్నారు. మెజారిటీ అధికారులు వన్ టైం పాస్వర్డ్ విధానంవైపే మొగ్గుచూపారు. త్వరలోనే దీనిపై మరోసారి సమావేశమై అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు. స్క్రాచ్ కార్డుతో ఇబ్బందులు... స్క్రాచ్ కార్డ్‌లోని పాస్‌వర్డ్‌ను ఉపయోగించి వెబ్ ఆప్షన్లు ఇచ్చే విధానం వల్ల ఇంటర్నెట్ కేంద్రాల వారు విద్యార్థుల పాస్వర్డ్ దొంగిలించడం, విద్యార్థులను దళారులు, యాజమాన్యాలు ప్రలోభపెట్టి తమ కాలేజీల్లో చేరేలా చూడటం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు హెల్ప్‌లైన్ కేంద్రాలకు వచ్చి ఆప్షన్లు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు గతంలోనే భావించినా ఇందులోనూ సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. హెల్ప్‌లైన్ కేంద్రాల కు విద్యార్థులు వచ్చి ఆప్షన్లు ఇవ్వాలంటే అదన ంగా కంప్యూటర్లు కొనుగోలు అవసరం. 3 వేల మంది వరకు ఔట్సోర్సింగ్ సిబ్బందిని నియమించాలి. వారి శిక్షణ, వేతనాలు, కంప్యూటర్ల కొనుగోళ్లకు రూ. 5 కోట్ల వరకు వ్యయం అవుతుంది. ఇంటర్నెట్ సెంటర్లలో మోసాలను నిరోధించినా ఔట్ సోర్సింగ్ సిబ్బంది కాలేజీ యాజమాన్యాలతో కుమ్మక్కైతే విద్యార్థులకు మరింత ఎక్కువ నష్టం. దీనికి ప్రత్యామ్నాయంగా వన్ టైం పాస్వర్డ్ విధానం మేలని నిర్ణయించారు. ఇదీ ‘వన్ టైం పాస్వర్డ్’ ఆప్షన్లు ఇచ్చే సమయంలో లాగిన్ కాగానే విద్యార్థి మొబైల్ నెంబరుకు పాస్వర్డ్ వస్తుంది. ఆ నెంబరును ఎంటర్ చేసి ఆప్షన్ల పేజీలోకి వెళ్లి ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఆ పాస్వర్డ్ 10 నిమిషాల పాటు(ఎంత సమయం అనేది తరువాత నిర్ణయిస్తారు.) చెల్లుతుంది. ఆ సమయంలో ఆప్షన్లు ఇవ్వాలి. నిర్ణీత సమయం పూర్తికాగానే విద్యార్థి ఇచ్చిన ఆప్షన్లు ఆటోమెటిక్‌గా సేవ్ అవుతాయి. అనంతరం లాగ్ అవుట్ కావచ్చు. మళ్లీ లాగిన్ అయితే మరో పాస్వర్డ్ వస్తుంది. దానిని ఎంటర్ చేసి ఆప్షన్ల పేజీలోకి వెళ్లి మరిన్ని ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఇచ్చిన ఆప్షన్లు మార్చుకోవచ్చు. ఇంటర్నెట్ సెంటర్లు , దళారుల మోసాలను నివారించవచ్చు. ఏదైనా మోసం జరిగినా, ప్రలోభాలకు గురిచేసినా విద్యార్థి అనంతరం మళ్లీ లాగిన్ అయి మరో పాస్‌వర్డ్‌తో మళ్లీ మార్పులు చేసుకోవచ్చు. 14 రోజుల్లో ఈ ఆప్షన్ల ప్రక్రియను పూర్తి చేస్తారు. చివరి రోజున విద్యార్థి మరోసారి ఆప్షన్లను చూసుకొని మార్పు చేసుకొని ఫైనల్‌గా సబ్మిట్ చేయవచ్చు. ఓటీపీపై విసృ్తత ప్రచారం: వేణుగోపాల్‌రెడ్డి ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లలో వన్‌టైం పాస్వర్డ్ (ఓటీపీ) విధానంపై విసృ్తత ప్రచారం చేయాలని భావిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. దీనిపై విద్యార్థులకు ఎస్ఎంఎస్లు పంపడంతోపాటు ఈ మెయిల్స్ ద్వారా తెలియజేస్తామన్నారు. ఎంసెట్ పరీక్ష రోజున ఓటీపీ విధానం, వినియోగంపై కరపత్రాలు ముద్రించి విద్యార్థులకు పంపిణీ చేస్తామని వివరించారు. ఏ విధానంలోనైనా తప్పిదాలను పూర్తిగా నివారించలేనందున మోసాలు, ప్రలోభాలను తగ్గించేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. వేణుగోపాల్‌రెడ్డికి విశిష్టరత్న అవార్డు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డిని చిత్తూరు జిల్లా సెంటినరీ విశిష్టరత్న అవార్డు-2013కు ఎంపిక చేసినట్లు అకాడమీ ఆఫ్ గ్రాస్రూట్స్ స్టడీస్ అండ్ రీసెర్చ్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ 1న చిత్తూరులో జరిగే కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డును అందజేయనున్నట్లు అకాడమీ డెరైక్టర్ సుందర్‌రామ్ పేర్కొన్నారు.