శాతవాహన యూనివర్సిటీ : పూలమ్మిన చోటే కట్టెలమ్మిన చందంగా మారింది ఇంజినీరింగ్ కళాశాలల పరిస్థితి. వీటిల్లో ప్రవేశాలకు గతంలో ఎగబడిన విద్యార్థులు.. ఇప్పుడు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ ఏడాది జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో వివిధ కోర్సుల సీట్లు నిండడమే గగనం అంటున్నారు. ఈ క్రమంలో పలు కళాశాలల యాజమాన్యాలు చేస్తున్న ఫీట్లు ఆశ్చర్యపరుస్తున్నాయి. విద్యార్థులను తమ కళాశాలల్లో చేర్చే బాధ్యతను పూర్వవిద్యార్థులకు అప్పగిస్తున్నాయి. ఇందుకు ప్రతిఫలంగా డబ్బులు, ల్యాప్‌టాప్‌లు, ఐఫోన్ తదితరాలను సమర్పించుకుంటున్నాయి. విద్యార్థులకూ ఎంతో కొంత ముట్టజెబుతున్నాయి. ఇవేవీ మేనేజ్‌మెంట్ సీట్లు కావు మరి.
స్నేహం చేస్తారు.. సలహా ఇస్తారు..
వెబ్ కౌన్సెలింగ్‌కు వెళ్లే విద్యార్థులను ట్రాప్ చేసేందుకు పూర్వవిద్యార్థులను దింపుతున్నాయి పలు కళాశాలలు. ఒక్కో పూర్వ విద్యార్థి కనీసం ఐదుగురిని చేర్చాలని టార్గెట్ విధించినట్లు తెలిసింది. వీరు విద్యార్థులతో మాటమాటా కలిపి.. పలానా కళాశాలో చేరితే భవిష్యత్ బాగుంటందని, తామూ అక్కడే చదివామని హైప్ పెంచుతున్నారు. ఇంకా కళాశాలలో చదువుతున్న వారే ఈ పనిచేస్తే.. వారికి ఇంటర్నల్స్‌లో అధిక మార్కులు వేస్తామంటూ ప్రోత్సహిస్తున్నాయి. సర్టిఫికె ట్ల వెరిఫికేషన్ పూర్తయిన వారి నుంచి వన్‌టైం పాస్‌వర్డ్‌ను సైతం తస్కరించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు.
గుర్తింపు నిలుపుదలపై యాజమాన్యాలు సీరియస్
ఇటీవల తనిఖీల్లో జిల్లాలోని ఏడు ఇంజినీరింగ్ , ఆరు ఫార్మసీ కళాశాలకు గుర్తింపు నిలుపుదల చేయడంపై యాజమాన్యాలు సీరియస్‌గా ఉన్నాయి. ఇంజినీరింగ్ సీట్లు తగ్గిస్తే సరేకానీ ఇలా కళాశాలలను ప్రవేశాలకు అనుమతి నిరాకరించడం దారుణమంటున్నాయి.
తనిఖీల తీరుపై కోర్టులో పిటిషన్ వే శామని, గుర్తింపు నిలుపుదలపై ఈ నెల 21న వివరణ ఇవ్వాలని అధికారులను జడ్జి ఆదేశించారని కళాశాలల యాజమాన్యాలు పేర్కొన్నాయి. ఉత్తమ ఫలితాలు సాధించిన కళాశాలలుగా పేరున్న వాటిని తొలగించడం విడ్డూరంగా చెప్పుకుంటున్నారు. కాగా, కళాశాలల అనుమతుల నిలుపుదలలో రాజకీయాలు ఇమిడి ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విద్యార్థులూ.. ఆందోళన వ ద్దు
కళాశాలల గుర్తింపు అంశంపై విద్యార్థులు ఆందోళన చెందొద్దని కౌన్సెలింగ్ కేంద్రం సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కె.ప్రేమ్‌కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని వెబ్ ఆప్షన్లు ఎన్నుకోవడానికి ఉన్న కేంద్రాల్లో ఆన్‌లైన్‌లో కనిపించే కళాశాలలకే గుర్తింపు ఉన్నట్లని స్పష్టం చేశారు. వన్‌టైమ్ పాస్‌వర్డ్ విషయంలో గోప్యత పాటించాలని కోరారు.
గుర్తింపు ఉన్న కళాశాలలివే...
జ్యోతిష్మతి-1, జ్యోతిష్మతి -2, జేఎన్టీయూ కొండగట్టు, జేఎన్టీయూ మంథని, హుజూరాబాద్ కి ట్స్ ఇంజినీరింగ్ కళాశాల, పెద్దపల్లి మధర్ థెరిస్సా, కరీంనగర్ నిగమ ఇంజినీరింగ్ కళాశాల, వాగేశ్వరి-1, వాగేశ్వరీ-2, వివేకానంద ఇంజినీరింగ్ కళాశాలలకు గుర్తింపు ఉంది. ఫార్మసీలో కరీంనగర్ శాతవాహన కళాశాలకు మాత్రమే అనుమతి ఉందని కౌన్సెలింగ్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ తెలిపారు. ఇది సోమవారం వరకు ఉన్న సమాచారమని, సలహాలు, సూచనల కోసం 96666 70193 సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.
రండి బాబూ.. రండి!
Published Tue, Aug 19 2014 3:21 AM | Last Updated on Thu, Mar 21 2019 9:07 PM
Advertisement
Advertisement