
ఫైల్ ఫోటో
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై పోలీసు దర్యాప్తు ముమ్మరమైంది. నిందితులను గుర్తించి పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. వైస్ చాన్స్‌లర్ మల్లేశ్, రిజిస్ట్రార్ భరత్, పరీక్షల నియంత్రణ అధికారి శ్రీరంగప్రసాద్‌తో మాట్లాడి ఆ వ్యవహారంపై వివరాలు తెలుసుకున్నారు. పరీక్షల విభాగాన్ని పరిశీలించి అందులో పనిచేసే సిబ్బందితో మాట్లాడారు.
చదవండి: నేపాలీ గ్యాంగ్: దోచేస్తారు.. దేశం దాటేస్తారు!
కరీంనగర్ నగరంలోని ఓ ప్రభు త్వ కళాశాలతోపాటు మరో ప్రైవేట్ కళాశాలకు చెందిన సోషల్ మీడియా గ్రూపు ల్లో పేపర్లు లీక్ అయినట్లు ప్రాథమికంగా నిర్ధారించి ఇందులో 22 మందిని విచారించారు. 55 పరీక్షాకేంద్రాలకు పోలీసులు నోటీసులు పంపడంతో వివిధ కళాశాలల్లో వణుకు మొదలైంది. పశ్నపత్రాలు వచ్చిన గ్రూపుల్లో సదరు కళాశాలలకు చెందిన అధ్యాపకులు, సిబ్బంది కూడా ఉండటాన్ని బట్టి చూస్తే వారికి తెలిసే ఈ లీక్ వ్యవహారం జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక నుంచి అరగంట ముందే లోనికి ...
సాధారణంగా డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు మొదలవుతుండగా, తీరా పరీక్షల సమయందాకా విద్యార్థులను అనుమతించేవారు. ఇక నుంచి ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమైతే అరగంట ముందుగానే అంటే 9.30గంటలకు, మధ్యాహ్నం పరీక్ష రెండు గంటలకు ప్రారంభమైతే 1.30 గంటలకే విద్యార్థులు పరీక్షాకేంద్రంలో ఉండాలని వర్సిటీ అధికారులు ఆదేశాలు జారీచేశారు. దీని వల్ల ప్రశ్నపత్రాలు లీక్ కాకుండా అరికట్టవచ్చని భావిస్తున్నారు. ఈ సమయం తర్వాత విద్యార్థులు వస్తే అనుమతించబోరు.