karimngar district
-
వేధించినందుకే.. కిరాతకంగా హతమార్చారు!
కరీంనగర్: వేధించినందుకే కరీంనగర్ జిల్లా మానకొండూర్‌కు చెందిన అనంతోజు సాయికిరణ్(29)ను ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన దంపతులు హతమార్చారని కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ తెలిపారు. ఆదివారం విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. మానకొండూర్ మండల కేంద్రానికి చెందిన సాయికిరణ్ తన భార్య అనూషతో కలిసి గతంలో సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం కొండాపూర్‌లోని ఓ కోళ్ల ఫారంలో పని చేసేవాడు.అక్కడే పని చేస్తున్న ఆసిఫాబాద్ జిల్లా బెజ్టూర్ మండలం బరెగూడకు చెందిన బట్టి శ్రీనివాస్, అతని భార్య సునీతతో సాయికిరణ్‌కు పరిచయం ఏర్పడింది. దాన్ని ఆసరాగా చేసుకొని అతను సునీతతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈ విషయమై శ్రీనివాస్, సాయికిరణ్ మధ్య గొడవలు జరిగాయి. తర్వాత సాయికిరణ్ తన భార్యతో కలిసి స్వగ్రామం వచ్చి, కట్టె కోత మెషిన్ పనిలో చేరాడు. తన భర్త గత ఏప్రిల్ 18న పనిమీద వెళ్తున్నానని వెళ్లి, తిరిగి రాలేదని అనూష పోలీసులకు ఫిర్యాదు చేసింది.వారు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. అయితే, సాయికిరణ్ గతంలో పని చేసిన కోళ్ల ఫారంకే వెళ్లాడని, అక్కడ శ్రీనివాస్, సునీతతో గొడవ పడ్డాడని, అతనికి గాయమైందని ఫారం యజమాని ఫోన్ ద్వారా అనూషకు సమాచారం ఇచ్చాడు. ఈ గొడవతో శ్రీనివాస్ దంపతులు కోళ్ల ఫారం నుంచి తమ స్వగ్రామం వెళ్లిపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది.అయినా, సాయికిరణ్ సునీతకు ఫోన్ చేస్తూ వేధించసాగాడు. దీంతో వారు విసిగిపోయి, అతన్ని చంపేయాలని పథకం వేశారు. శ్రీనివాస్ తన భార్య సునీతతో సాయికిరణ్‌కు ఫోన్ చేయించి, ఏప్రిల్ 19న దహెగాంకు పిలిపించాడు. మరో ఇద్దరితో కలిసి, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసి, హతమార్చారు. అనంతరం సాయికిరణ్ మృతదేహాన్ని అక్కడే వ్యవసాయ బావిలో పడేసి, మహారాష్ట్ర పారిపోయారు.పోలీసులు దాదాపు 2 నెలలు శ్రమించి, ఈ కేసులో ఎ–1 బట్టి శ్రీనివాస్, ఎ–2 సునీత, ఎ–3 తమ్మిడి గంగారాం, ఎ–4 భీమంకర్ శ్యామ్రావులను శనివారం అరెస్టు చేశారు. వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. 15 రోజుల కస్టడి విధించడంతో జైలుకు పంపినట్లు ఏసీపీ పేర్కొన్నారు. నిందితులను పట్టుకున్న మానకొండూర్ సీఐ రాజ్‌కుమార్‌ను, పోలీసు సిబ్బందిని అభినందించారు. -
TS: రోడ్లన్నీ జలదారులే
ఆగ్నేయ మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని.. దాని ప్రభావంతో వచ్చే మూడు రోజులు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే రుతు పవనాలు కూడా చురుగ్గా ఉండటం, ఈనెల 11న ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండటంతో.. వానలు మరికొద్దిరోజులు కొనసాగవచ్చని వెల్లడించింది. సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్:రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టి కారణంగా జన జీవనం అతలాకుతలమైంది. చెరువులు, కుంటలు, వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. చాలా పట్టణాలు, గ్రామాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. లక్షలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు వరంగల్ జిల్లా నడికుడలో ఏకంగా 38.8 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో ఇంతస్థాయిలో వర్షపాతం నమోదవడం ఇదే మొదటిసారని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కరీంనగర్ జిల్లా మల్యాలలో 30 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు వెల్లడించింది. ఈ రెండు చోట్ల మాత్రమే కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 జిల్లాల్లో భారీ వర్షాలు నమోదైనట్టు తెలిపింది. భారీ వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. మారుమూల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మంగళవారం హన్మకొండలోని హంటర్ రోడ్డు జంక్షన్‌ను ముంచెత్తిన వరద జల దిగ్బంధంలో వరంగల్.. భారీ వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. వాగులు ఉప్పొంగి భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మేడారం జంపన్నవాగు బ్రిడ్జికి ఆనుకుని వరద నీరు ప్రవహిస్తోంది. వరంగల్‌లో ముంపు బాధితులను పునరావాస కేం ద్రాలకు తరలిస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద చేరడంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై భారీ వరద చేరడంతో పంతిని వద్ద ప్రవాహంలో ఓ లారీ చిక్కుకుంది. వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, పర్వతగిరి, ఐనవోలు మండలాల్లో పంటలు నీటమునిగాయి. వేములవాడ శివారు లక్ష్మీపూర్‌కు చెందిన మూడు కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది, గ్రామస్తులు అన్ని చోట్లా బీభత్సమే.. ► ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. జోగిపేట అన్నసాగర్, నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నల్లవాగు, జహీరాబాద్ నియోజకవర్గంలోని నారింజ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ► నిజామాబాద్ నగరంలో పలు లోతట్టు కాలనీలు నీటమునిగాయి. దీంతో కంఠేశ్వర్ ప్రాంతంలోని ప్రధాన రహదారిపై ఆయా కాలనీల జనం ధర్నా చేశారు. ఉమ్మడి జిల్లా జిల్లావ్యాప్తంగా వేల ఎకరాల్లో వరి, సోయా, పసుపు, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. ముఖ్యంగా సోయా పంటకు నష్టం ఎక్కువగా జరిగినట్లు అంచనా. పలు గ్రామాల్లో ఇళ్లు కూలిపోయాయి. ► యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆలేరు–సిద్దిపేట మార్గంలోని కొలనుపాక, రాజాపేట మండల కేంద్రం జల దిగ్బంధం అయ్యాయి. భారీ వర్షాలతో యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ► నిర్మల్ జిల్లాలో గోదావరి నది, ఉప నదులు, వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. భైంసా పట్టణంలో 9 కాలనీలు నీటమునిగాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. కుంటాల, పొచ్చర జలపాతాలు హోరెత్తుతున్నాయి. బోథ్ తహసీల్దార్ కార్యాలయం పైకప్పు పెచ్చులూడిపడ్డాయి. పది మంది మృతి.. ఇద్దరు గల్లంతు ► సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో గౌరవెల్లి–గూడాటిపల్లి మధ్య వాగు దాటుతూ. పోతారం(జే) గ్రామానికి చెందిన రంగు కిష్టస్వామి (45) చనిపోయారు. ► సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం మాద్వార్‌కు చెందిన కోవూరి మహిపాల్ (35) మంగళవారం మధ్యాహ్నం కిరాణా సరుకులు తీసుకొని ఇంటికి వస్తుండగా.. గ్రామ శివార్లలోని కాజ్వే దాటుతూ వాగులో కొట్టుకుపోయి మృతి చెందారు. ► ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వారావుపేట బస్టాండ్‌లో అనాథ వ్యక్తి వానకు తడిసి, చలి తట్టుకోలేక మృతి చెందారు. కోరుట్లలో నీట మునిగిన ప్రకాశం రోడ్ ప్రాంతం ► జగిత్యాల జిల్లాలో వాన నలుగురిని బలితీసుకుంది. గొల్లపెల్లి మండలం మల్లన్నపేట వద్ద బైక్‌పై కాజ్వే దాటుతూ.. నందిపల్లెకు చెందిన ఎక్కలదేవి గంగమల్లు, ఆయన కుమారుడు వరదలో కొట్టుకుపోయి చనిపోయారు. మల్లాపూర్ మండలంలో ఇంట్లో మోటార్ వేద్దామని వెళ్లిన నేరెల్ల శ్రీను అనే వ్యక్తి.. వైర్లు తడిసి ఉండటంతో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు. గొల్లపల్లి మండలం బొంకూర్‌లో ఓ అంగన్వాడీ టీచర్ తడిసిన వైర్లను ముట్టుకోవడంతో విద్యుదాఘాతానికి బలయ్యారు. ► సిరిసిల్ల పట్టణంలో వరదలో కొట్టుకుపోతున్న ఓ యువకుడిని స్థానికులు పట్టుకున్నారు. కానీ అప్పటికే అతను చనిపోయి ఉన్నట్టు గుర్తించారు. వరద తాకిడికి మూలవాగుపై నిర్మిస్తున్న వంతెన కూలిపోయిన దృశ్యం ► కామారెడ్డి జిల్లా గర్గుల్ గ్రామంలో వానకు తడిసి ఇంటిగోడ కూలడంతో.. నిమ్మ నర్సవ్వ (35) అనే మహిళ చనిపోగా, ఆమె కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. ఇదే జిల్లా బాన్సువాడ మండలం కన్నయ్యతండాలో ఆశ్రద్ (38) అనే రైతు పొలం వద్ద విద్యుత్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయారు. ► నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి) మండలంలో టెంబరేణి దగ్గర ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్‌లో చేపలవేటకు వెళ్లి గుమ్ముల నరేశ్ (36), కరీంనగర్ మండలం చెర్లబుత్కూర్లో వాగు దాటుతూ ఓ వ్యక్తి గల్లంతయ్యారు. గర్భిణులకు వరద కష్టాలు ►ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కొత్త వెంకటగిరి– బిల్లుపాడు గ్రామాల మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వెంకటగిరికి చెందిన కిన్నెర మమత పురిటినొప్పులతో బాధ పడుతుండగా.. వాగు ప్రవాహం నుంచే నడుచుకుంటూ అవతలి ఒడ్డుకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడి నుంచి 108 వాహనంలో ఖమ్మం ఆస్పత్రికి తరలించగా..ఆడపిల్లకు జన్మనిచ్చింది. ► ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం చిన్నుమియ తండాకు చెందిన గర్భిణి గంగాబాయికి మంగళవారం ఉదయం పురిటినొప్పులు మొదలయ్యాయి. గ్రామానికి 108 వచ్చే అవకాశం లేకపోవడంతో.. సమీపంలోని గుట్ట మీదుగా కిలోమీటర్ దూరం నడిపించుకుంటూ తీసుకెళ్లాల్సి వచ్చింది. అక్కడి నుంచి 108లో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. -
ప్రశ్నపత్రం లీక్‌పై బిగుస్తున్న ఉచ్చు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై పోలీసు దర్యాప్తు ముమ్మరమైంది. నిందితులను గుర్తించి పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. వైస్ చాన్స్‌లర్ మల్లేశ్, రిజిస్ట్రార్ భరత్, పరీక్షల నియంత్రణ అధికారి శ్రీరంగప్రసాద్తో మాట్లాడి ఆ వ్యవహారంపై వివరాలు తెలుసుకున్నారు. పరీక్షల విభాగాన్ని పరిశీలించి అందులో పనిచేసే సిబ్బందితో మాట్లాడారు. చదవండి: నేపాలీ గ్యాంగ్: దోచేస్తారు.. దేశం దాటేస్తారు! కరీంనగర్ నగరంలోని ఓ ప్రభు త్వ కళాశాలతోపాటు మరో ప్రైవేట్ కళాశాలకు చెందిన సోషల్ మీడియా గ్రూపు ల్లో పేపర్లు లీక్ అయినట్లు ప్రాథమికంగా నిర్ధారించి ఇందులో 22 మందిని విచారించారు. 55 పరీక్షాకేంద్రాలకు పోలీసులు నోటీసులు పంపడంతో వివిధ కళాశాలల్లో వణుకు మొదలైంది. పశ్నపత్రాలు వచ్చిన గ్రూపుల్లో సదరు కళాశాలలకు చెందిన అధ్యాపకులు, సిబ్బంది కూడా ఉండటాన్ని బట్టి చూస్తే వారికి తెలిసే ఈ లీక్ వ్యవహారం జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక నుంచి అరగంట ముందే లోనికి ... సాధారణంగా డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు మొదలవుతుండగా, తీరా పరీక్షల సమయందాకా విద్యార్థులను అనుమతించేవారు. ఇక నుంచి ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమైతే అరగంట ముందుగానే అంటే 9.30గంటలకు, మధ్యాహ్నం పరీక్ష రెండు గంటలకు ప్రారంభమైతే 1.30 గంటలకే విద్యార్థులు పరీక్షాకేంద్రంలో ఉండాలని వర్సిటీ అధికారులు ఆదేశాలు జారీచేశారు. దీని వల్ల ప్రశ్నపత్రాలు లీక్ కాకుండా అరికట్టవచ్చని భావిస్తున్నారు. ఈ సమయం తర్వాత విద్యార్థులు వస్తే అనుమతించబోరు. -
కేసీఆర్ ప్రభుత్వం కొనసాగడం రాష్ట్రానికే అరిష్టం..
సాక్షి, జమ్మికుంట(కరీంనగర్): కేసీఆర్ ప్రభుత్వం కొనసాగడం రాష్ట్రానికే అరిష్టమని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం జమ్మికుంటలో ని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడా రు. సీఎం కేసీఆర్ కుట్రదారుడని, మోసగాడని, అతనికి ప్రజలపై ప్రేమ లేదని ఆరోపించారు. దళితులపై ప్రేమ ఉంటే వారికి జనాభా ప్రాతిపదికన మంత్రి వర్గంలో పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం చెప్పిందే తప్ప మంత్రుల అభిప్రాయాలకు విలువ లేదని అన్నారు. ఇంటెలిజెన్స్ పోలీసులా.. టీఆర్ఎస్ కార్యకర్తలా అంటూ ఘాటుగా విమర్శించారు. ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలిస్తేనే ధర్మం గెలుస్తుందని ప్రజల్లో చర్చ జరుగుతోందని తెలిపారు. నియోజకవర్గంలో తిరుగుతున్న మంత్రులు సమావేశాల్లో, సభలో నిధులు ఇస్తామని, భవనాలు కట్టిసామని ప్రజలకు హామీలు ఇస్తున్నారని.. మొత్తం రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ‘నాగార్ణున సాగర్ ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని.. హుజూరా బాద్ మీ జాగీర్ కాదు’ అని అన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్‌రావు తదితరులు పాల్గొన్నారు. బీజేపీలో చేరిక మోత్కులగూడెంకు చెందిన యువకులు, స్వాతి గార్డెన్ సమీపంలోని అపార్ట్మెంట్లో నివాసం ఉండే మహిళలు, యువకులు బీజేపీలో చేరా రు. నాయకులు రాజేందర్‌రెడ్డి, రమేష్, సంపత్‌రావు, మల్లేశ్, పురపాలక సంఘం మాజీ చైర్మన్ శ్రీనివాస్, కోటి తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఎన్టీఆర్ భవన్ లీజును రద్దు చేయండి -
‘ప్రణాళికా’యుతంగా అభివృద్ధి
సాక్షి, భీమదేవరపల్లి: గ్రామసభకు సర్పంచ్‌తో పాటు ఎంత మంది వార్డు సభ్యులు హాజరయ్యారు.. ఒకటో వార్డు సభ్యుడు వచ్చాడా.. వచ్చిన వారు చేతులెత్తండి.. కోఆప్షన్ సభ్యుడు వచ్చాడా.. ఎక్కడా? అంటూ సభా వేదికపై నుంచి రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. పల్లెలను ప్రగతి పథంలో నడిపించేందుకు సీఎం కేసీఆర్ కష్టపడుతూ సర్పంచ్, వార్డు సభ్యులకు నిధులు, అధికారాలు ఇస్తుంటే వాటిని అమలు చేయాల్సింది పోయి కనీసం గ్రామసభకు వార్డుసభ్యులు హజరుకాకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలోని భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగపూర్ గ్రామంలో ‘30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక’ కార్యక్రమాన్ని మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రణాళిక కార్యక్రమంతో పల్లెల రూపురేఖలు మారిపోయి తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాలకు పెద్ద మొత్తంలో నిధులు వస్తాయని.. గ్రామస్తులు ఐక్యంగా వ్యవహరించి అభివృద్ధి పథంలో నిలిపి సీఎం కేసీఆర్ ఆశయాన్ని నెరవేర్చాలని సూచించారు. శ్రమదానంతో ఫలితం ప్రభుత్వం అందించే నిధులతో పాటుగా గ్రామస్తులు సైతం శ్రమదానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని మంత్రి దయాకర్‌రావు అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, వారి అభివృద్ధి కోసం కేసీఆర్ అనేక పథకాలు రూపొందించి అమలు చేస్తున్నట్లు వివరించారు. గ్రామాల్లో రూ.1700, రూ.2వేలకు పనిచేసే సపాయిల వేతనాన్ని రూ.8,500 పెంచిన ఘన త కేసీఆర్‌దేనన్నారు. గ్రామ సభకు హజరైన వారికి మాత్రమే గ్రామాభివృద్ధిపై మాట్లాడే హక్కుతోపాటుగా ప్రభుత్వ పథకాలను కొట్లాడి పొందే హక్కు ఉంటుందన్నారు. పచ్చదనం, పరిశుభ్రత, విద్యుత్ ఏ రకమైన సమస్యలున్నా పరిష్కరించుకోవాలని సూచించారు. గ్రామంలో ఇంటింటికీ ఆరు మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా హరితహరం లక్ష్యాన్ని చేరుకోవచ్చని తెలిపారు. గంగదేవిపల్లికి ధీటుగా అన్ని గ్రామాలను అభివృద్ధి చెందాలని మంత్రి ఆకాంక్షించారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ మాట్లాడుతూ తెలంగాణ వైపు దేశమంతా చూసేలా సీఎం కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారని తెలిపారు. జెడ్పీ చైర్మన్ డాక్టర్ మారెపల్లి సుధీర్కమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే గట్లనర్సింగపూర్ గ్రామం ఆదర్శంగా నిలవాలని అన్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌బాబు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్‌రావు, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎంపీపీ జక్కుల అనిత, జెడ్పీటీసీ వంగ రవి, సర్పంచ్ ఎర్రబెల్లి చంద్రకళ, ఆర్డబ్ల్యూఎస్ సీఈ శ్రీనివాస్, ఎస్ఈ రాంచంద్రనాయక్, డీపీఓ మహమూది, శ్యాంకుమార్, ఎంపీడీఓ భాస్కర్, తహసీల్దార్ సత్యానారాయణ, డీఈఈ బాలరాజు, ఏఈ రాజమల్లారెడ్డి పాల్గొన్నారు. రూ. 2కోట్ల విరాళం ప్రకటించిన భాస్కర్‌రావు గట్లనర్సింగపూర్‌కు చెందిన కావేరి సీడ్స్ అధినేత గుండావరం భాస్కర్‌రావు గ్రామాభివృద్ధి కోసం రూ. 2కోట్ల విరాళం ప్రకటించారు. ఈ విషయమై ఆయన తనకు ఆమెరికా నుంచి ఫోన్లో చెప్పారని మంత్రి దయాకర్‌రావు వెల్లడిం చారు. కాగా, సర్పంచ్ ఎర్రబెల్లి చంద్రకళ విజ్ఞప్తి మేరకు పారిశుధ్య నిర్వహణ, మొక్కలకు నీరు సరఫరా చేసేందుకు రెండు ట్రాక్టర్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. జీపీలకు రెండు అంతస్తుల భవన నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని ఎమ్మె ల్యే సతీష్‌బాబు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టాలని జెడ్పీటీసీ సభ్యుడు వంగ రవి, ముల్కనూర్ జీపీకి భవనం మంజూరు చేయాలంటూ సర్పంచ్ ప్రెస్ కొంరయ్య, నూతన జెడ్పీ, ఎంపీపీ కార్యాలయాల్లో పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నామ ప్రవీణ్‌రావు, ఉద్యోగులు ఆక్తర్ సంధాని, పల్ల ప్రమోద్‌రెడ్డి, రాంరెడ్డి మంత్రికి వినతిపత్రాలు అందజేశారు. -
సరుకుల రవాణాకు ‘ఈ–పర్మిట్’
సాక్షి, జమ్మికుంట(హుజూరాబాద్): ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పత్తి దిగుబడి ఏటా 35 లక్షల క్వింటాళ్లకు పైగా వస్తుంది. రైతులు పూర్తిగా విక్రయించినా మార్కెట్ దస్త్రాల్లో సగం కూడా నమోదు కావడం లేదు. మరి మిగతా సరుకులు ఎక్కడికి వెళ్తున్నాయి.. కొనుగోలుదారులు కట్టాల్సిన పన్నులను ఎవరు తన్నుకుపోతున్నారు.. సర్కారు ఖజానాకు ఏ మేరకు గండిపడుతోంది..? కొన్నేళ్లుగా అందరిలో వెల్లువెత్తుతున్న సందేహాలు ఇవి. ఆలస్యంగానైనా మేల్కొన్న రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ అవినీతికి తెరదింపేందుకు కొత్తగా ఈ–పర్మిట్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, సరుకుల రవాణా, పన్నుల వసూళ్లలో అవినీతికి ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టింది. ఇకపై లెక్కలు పక్కాగా చూపేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. భారీగా ప్రధాన పంటల దిగుబడులు.. ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్, రబీ కలుపుకొని ఏటా 6.80 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయి. ఇందులో రెండు లక్షల హెక్టార్లు పత్తి, మూడు లక్షల హెక్టార్లు వరి, లక్ష హెక్టార్లలో మొక్కజొన్న పండిస్తారు. 35 లక్షల నుంచి 40 లక్షల క్వింటాళ్ల పత్తి, 1.80 కోట్ల క్వింటాళ్ల వరి, 50 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్న దిగుబడి వస్తుంది. మార్కెట్లో ఇరు సీజన్లలో క్రయవిక్రయాలు సాగుతాయి. వరి, మొక్కజొన్న పంటలను ప్రభుత్వ రంగ సంస్థలే అధికంగా సేకరిస్తుండగా, పత్తిని పూర్తిగా మిల్లర్లు, ట్రేడర్లు కొంటున్నారు. నిబంధనల ప్రకారం.. వ్యాపారులు సరుకుల కొనుగోళ్ల వివరాలను రోజూ మార్కెట్ అధికారులకు ఇవ్వాలి. బేళ్లు, గింజలు, బియ్యం, మక్కలు, ఇతర అపరాల ఎగుమతికి కార్యదర్శి నుంచి రవాణా పర్మిట్ తీసుకోవాలి. ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు కొనుగోలు చేసిన సరుకుల విలువలో ఒకశాతం పన్నుగా చెల్లించాలి. మార్కెట్ ఆదాయానికి భారీగా గండి.. కొందరు వ్యాపారులు నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. కొన్న సరుకులు, మార్కెట్‌కు చూపుతున్న లెక్కలకు పొంతన ఉండడం లేదు. ప్రధానంగా మిల్లుల్లో కొంటున్న సరుకులను పూర్తిస్థాయిలో చూపడంలేదు. అధికారులకు రోజూ ఇవ్వాల్సిన వివరాలను నెలకు ఒక్కసారి కూడా సమర్పించడం లేదు. అడిగే దిక్కులేక చాలామంది వ్యాపారులు తప్పుడు లెక్కలతో మార్కెట్ ఆదాయానికి గండికొడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో లోపాయికారీ ఒప్పందాలతో మాన్యువల్ పర్మిట్లు తీసుకుంటూ సరుకులను రవాణా చేస్తున్నారు. గ్రామాల్లో రైతుల నుంచి నేరుగా పత్తి, ధాన్యం, మక్కలు ఖరీదు చేస్తున్న దళారులు ఆయా చెక్‌పోస్టుల్లో చేతివాటం ప్రదర్శిస్తూ సరుకులను జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. ఇలా ఏటా లక్షలాది క్వింటాళ్లు వక్రమార్గంలో ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. దీంతో సర్కారు ఖజానాకు రూ.కోట్లలో నష్టం వాలిల్లుతోంది. ఇది బహిరంగమే అయినా అధికారుల్లో చలనం కరువైంది. నామమాత్రపు తనిఖీలతో అక్రమ వ్యాపారానికి అడ్డులేకుండా పోయింది. ఎట్టకేలకు మేల్కొన్న మార్కెటింగ్‌శాఖ.. ఏళ్లుగా సాగుతున్న అవినీతిని ఎట్టకేలకు మార్కెటింగ్‌శాఖ గుర్తించింది. కొనుగోళ్లలో పారదర్శకత, పూర్థిసాయిలో పన్నుల వసూళ్లకు కొత్తగా ఈ–పర్మిట్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం సదరుశాఖ రూపొందించిన వెబ్సైట్లో తొలుత మిల్లర్లు, ట్రేడర్లు వారి సంస్థలకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకోవాలి. మార్కెట్ అధికారులు పరిశీలించాక యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తారు. భద్రత కోసం పాస్వర్డ్ మార్చుకునే వీలుంది. వ్యాపారులు వెబ్సైట్లో లాగిన్ అయ్యాక సరుకుల కొనుగోళ్ల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపర్చాలి. యార్డులో అయితే కమీషన్ ఏజెంట్ ద్వారా ఎన్ని క్వింటాళ్లు కొన్నారనేది చూపితే సరిపోతుంది. ఎందుకంటే రైతుల వివరాలను మార్కెట్ సిబ్బంది రికార్డుల్లో చేరుస్తారు. గ్రామాల్లో, మిల్లుల్లో నేరుగా కొంటే.. సరుకులు అమ్మిన రైతుల వివరాల(చిరునామా, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్)ను వ్యాపారులు పూర్తిగా నమోదు చేయాలి. నెలవారీ కొనుగోళ్ల ప్రకారం ప్రతినెలా పదో తేదీ లోపు పూర్తిగా పన్ను(సరుకుల విలువలో ఒకశాతం) చెల్లించాలి. ఇవి పాటిస్తేనే బేళ్లు, గింజలు, బియ్యం, మక్కలు, అపరాలు తదితర ఉత్పత్తుల రవాణాకు ఆన్లైన్లో ఈ–పర్మిట్ జారీచేస్తారు. ఈ విధానం గతనెల 26న ఉమ్మడి జిల్లాలో అమల్లోకి రాగా.. మిల్లర్లు, ట్రేడర్లు క్రమంగా వెబ్సైట్లో లాగిన్ అవుతున్నారు. రంగంలోకి విజిలెన్స్ బృందాలు.. ఇకపై వ్యాపారులు ఇష్టారాజ్యంగా పర్మిట్లు తీసుకునే వీల్లేదు. సరుకుల కొనుగోళ్ల మేరకే పర్మిట్లు ఇచ్చేలా వెబ్సైట్ రూపొందించారు. లెక్కల్లో చూపని వాటికి రవాణా అనుమతులు రాకుండా రూపకల్పన చేశారు. ఒకవేళ అక్రమ రవాణా చేస్తే చెక్‌పోస్టులో నిలిపివేస్తారు. చేతివాటంతో అక్కడి నుంచి తప్పించేందుకు ప్రయత్నించినా దాన్నీ అడ్డుకునేందుకు మార్కెటింగ్‌శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. రహదారులపై తనిఖీకి విజిలెన్స్ బృందాలను నియమించింది. ఈ–పర్మిట్ లేకుండా రవాణా చేస్తూ పట్టుబడితే వ్యాపారులు చెల్లించాల్సిన పన్ను కంటే 5 నుంచి 8 రెట్లు అధికంగా జరిమానా వసూలు చేయాలని నిర్ణయించింది. దొంగ దందాతో సర్కారు ఖజానాకు తూట్లు పొడుస్తున్న దళారులపై కూడా విజిలెన్స్ ఉక్కుపాదం మోపనుంది. ఇకనుంచి అధికారులు గ్రామాల్లో నేరుగా జరిగే కొనుగోళ్లపై దృష్టి సారించనున్నారు. మార్కెట్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసే దళారులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. -
బాండ్‌పేపర్‌పై హామీలు
కొడిమ్యాల(చొప్పదండి): ఈనెల 22న నిర్వహిం చనున్న గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు వినూత్న పద్ధతులు అవలంబిస్తున్నా రు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెద క్ ఉపాధ్యాయ నియోజకవర్గ అభ్యర్థి మామిడి సుధాకర్‌రెడ్డి బాండ్‌పేపర్‌పై హామీలను ముద్రించి, పోస్ట్‌ద్వారా అభ్యర్థులకు పంపిణీ చేస్తున్నారు. తనను ఎన్నుకుంటే సీపీఎస్‌ను రద్దుచేపిస్తానని, కాంట్రాక్టు అధ్యాపకులకు హెల్త్‌కార్డులు మంజూరు చేపిస్తానని, అధ్యాపకులకు ఇంటిస్థలాలు సమకూరుస్తానని బాండ్‌పై హామీ లు ముద్రించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తాను 20 సంవత్సరాల భావి ఉద్యోగ జీవితాన్ని వదులుకుని పోటీలోఉన్నానని, దివ్యాంగుడినైనందున అందరినీ వ్యక్తిగతంగా కలవలేకపోతున్నందున బాండ్ద్వారా హామీలను తెలుపుతున్నానని, ఆశీర్వదించాలని కోరుతున్నారు. -
రైల్వే ట్రాక్‌పై ఇద్దరు ఆత్మహత్య
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం రాఘవాపూర్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఇద్దరు వ్యక్తులు ఆత్మహ్యత చేసుకున్నారు. ఆ విషయాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకుని... పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా మృతులు ముత్తారం మండలం లద్నాపూర్‌కు చెందిన రామిళ్ల కుమార్ (40), ఇదునూరి మల్లమ్మ (45)గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ బంధువులని... వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడిందని...ఈ నేపథ్యంలో వీరు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. వారం రోజుల క్రితమే వీరిద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది.