సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పక్కన ఎంపీ, ఎమ్మెల్యే, పీఆర్ కమిషనర్, కలెక్టర్ తదితరులు
సాక్షి, భీమదేవరపల్లి: గ్రామసభకు సర్పంచ్‌తో పాటు ఎంత మంది వార్డు సభ్యులు హాజరయ్యారు.. ఒకటో వార్డు సభ్యుడు వచ్చాడా.. వచ్చిన వారు చేతులెత్తండి.. కోఆప్షన్ సభ్యుడు వచ్చాడా.. ఎక్కడా? అంటూ సభా వేదికపై నుంచి రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. పల్లెలను ప్రగతి పథంలో నడిపించేందుకు సీఎం కేసీఆర్ కష్టపడుతూ సర్పంచ్, వార్డు సభ్యులకు నిధులు, అధికారాలు ఇస్తుంటే వాటిని అమలు చేయాల్సింది పోయి కనీసం గ్రామసభకు వార్డుసభ్యులు హజరుకాకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలోని భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగపూర్ గ్రామంలో ‘30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక’ కార్యక్రమాన్ని మంత్రి శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రణాళిక కార్యక్రమంతో పల్లెల రూపురేఖలు మారిపోయి తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాలకు పెద్ద మొత్తంలో నిధులు వస్తాయని.. గ్రామస్తులు ఐక్యంగా వ్యవహరించి అభివృద్ధి పథంలో నిలిపి సీఎం కేసీఆర్ ఆశయాన్ని నెరవేర్చాలని సూచించారు.
శ్రమదానంతో ఫలితం
ప్రభుత్వం అందించే నిధులతో పాటుగా గ్రామస్తులు సైతం శ్రమదానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని మంత్రి దయాకర్‌రావు అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, వారి అభివృద్ధి కోసం కేసీఆర్ అనేక పథకాలు రూపొందించి అమలు చేస్తున్నట్లు వివరించారు. గ్రామాల్లో రూ.1700, రూ.2వేలకు పనిచేసే సపాయిల వేతనాన్ని రూ.8,500 పెంచిన ఘన త కేసీఆర్‌దేనన్నారు. గ్రామ సభకు హజరైన వారికి మాత్రమే గ్రామాభివృద్ధిపై మాట్లాడే హక్కుతోపాటుగా ప్రభుత్వ పథకాలను కొట్లాడి పొందే హక్కు ఉంటుందన్నారు. పచ్చదనం, పరిశుభ్రత, విద్యుత్ ఏ రకమైన సమస్యలున్నా పరిష్కరించుకోవాలని సూచించారు.
గ్రామంలో ఇంటింటికీ ఆరు మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా హరితహరం లక్ష్యాన్ని చేరుకోవచ్చని తెలిపారు. గంగదేవిపల్లికి ధీటుగా అన్ని గ్రామాలను అభివృద్ధి చెందాలని మంత్రి ఆకాంక్షించారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ మాట్లాడుతూ తెలంగాణ వైపు దేశమంతా చూసేలా సీఎం కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారని తెలిపారు. జెడ్పీ చైర్మన్ డాక్టర్ మారెపల్లి సుధీర్‌కమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే గట్లనర్సింగపూర్ గ్రామం ఆదర్శంగా నిలవాలని అన్నారు.
హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌బాబు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్‌రావు, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎంపీపీ జక్కుల అనిత, జెడ్పీటీసీ వంగ రవి, సర్పంచ్ ఎర్రబెల్లి చంద్రకళ, ఆర్‌డబ్ల్యూఎస్ సీఈ శ్రీనివాస్, ఎస్‌ఈ రాంచంద్రనాయక్, డీపీఓ మహమూది, శ్యాంకుమార్, ఎంపీడీఓ భాస్కర్, తహసీల్దార్ సత్యానారాయణ, డీఈఈ బాలరాజు, ఏఈ రాజమల్లారెడ్డి పాల్గొన్నారు.
రూ. 2కోట్ల విరాళం ప్రకటించిన భాస్కర్‌రావు
గట్లనర్సింగపూర్‌కు చెందిన కావేరి సీడ్స్ అధినేత గుండావరం భాస్కర్‌రావు గ్రామాభివృద్ధి కోసం రూ. 2కోట్ల విరాళం ప్రకటించారు. ఈ విషయమై ఆయన తనకు ఆమెరికా నుంచి ఫోన్‌లో చెప్పారని మంత్రి దయాకర్‌రావు వెల్లడిం చారు. కాగా, సర్పంచ్ ఎర్రబెల్లి చంద్రకళ విజ్ఞప్తి మేరకు పారిశుధ్య నిర్వహణ, మొక్కలకు నీరు సరఫరా చేసేందుకు రెండు ట్రాక్టర్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.
జీపీలకు రెండు అంతస్తుల భవన నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని ఎమ్మె ల్యే సతీష్‌బాబు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టాలని జెడ్పీటీసీ సభ్యుడు వంగ రవి, ముల్కనూర్ జీపీకి భవనం మంజూరు చేయాలంటూ సర్పంచ్ ప్రెస్ కొంరయ్య, నూతన జెడ్పీ, ఎంపీపీ కార్యాలయాల్లో పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నామ ప్రవీణ్‌రావు, ఉద్యోగులు ఆక్తర్ సంధాని, పల్ల ప్రమోద్‌రెడ్డి, రాంరెడ్డి మంత్రికి వినతిపత్రాలు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment