సాయికిరణ్ హత్య కేసులో నలుగురి అరెస్టు
ఫోన్ చేసి, పిలిపించి, చంపేశారు..
వివరాలు వెల్లడించిన ఏసీపీ వెంకటరమణ
కరీంనగర్: వేధించినందుకే కరీంనగర్ జిల్లా మానకొండూర్‌కు చెందిన అనంతోజు సాయికిరణ్(29)ను ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన దంపతులు హతమార్చారని కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ తెలిపారు. ఆదివారం విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. మానకొండూర్ మండల కేంద్రానికి చెందిన సాయికిరణ్ తన భార్య అనూషతో కలిసి గతంలో సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం కొండాపూర్‌లోని ఓ కోళ్ల ఫారంలో పని చేసేవాడు.
అక్కడే పని చేస్తున్న ఆసిఫాబాద్ జిల్లా బెజ్టూర్ మండలం బరెగూడకు చెందిన బట్టి శ్రీనివాస్, అతని భార్య సునీతతో సాయికిరణ్‌కు పరిచయం ఏర్పడింది. దాన్ని ఆసరాగా చేసుకొని అతను సునీతతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈ విషయమై శ్రీనివాస్, సాయికిరణ్ మధ్య గొడవలు జరిగాయి. తర్వాత సాయికిరణ్ తన భార్యతో కలిసి స్వగ్రామం వచ్చి, కట్టె కోత మెషిన్ పనిలో చేరాడు. తన భర్త గత ఏప్రిల్ 18న పనిమీద వెళ్తున్నానని వెళ్లి, తిరిగి రాలేదని అనూష పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వారు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. అయితే, సాయికిరణ్ గతంలో పని చేసిన కోళ్ల ఫారంకే వెళ్లాడని, అక్కడ శ్రీనివాస్, సునీతతో గొడవ పడ్డాడని, అతనికి గాయమైందని ఫారం యజమాని ఫోన్ ద్వారా అనూషకు సమాచారం ఇచ్చాడు. ఈ గొడవతో శ్రీనివాస్ దంపతులు కోళ్ల ఫారం నుంచి తమ స్వగ్రామం వెళ్లిపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది.
అయినా, సాయికిరణ్ సునీతకు ఫోన్ చేస్తూ వేధించసాగాడు. దీంతో వారు విసిగిపోయి, అతన్ని చంపేయాలని పథకం వేశారు. శ్రీనివాస్ తన భార్య సునీతతో సాయికిరణ్‌కు ఫోన్ చేయించి, ఏప్రిల్ 19న దహెగాంకు పిలిపించాడు. మరో ఇద్దరితో కలిసి, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసి, హతమార్చారు. అనంతరం సాయికిరణ్ మృతదేహాన్ని అక్కడే వ్యవసాయ బావిలో పడేసి, మహారాష్ట్ర పారిపోయారు.
పోలీసులు దాదాపు 2 నెలలు శ్రమించి, ఈ కేసులో ఎ–1 బట్టి శ్రీనివాస్, ఎ–2 సునీత, ఎ–3 తమ్మిడి గంగారాం, ఎ–4 భీమంకర్ శ్యామ్‌రావులను శనివారం అరెస్టు చేశారు. వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. 15 రోజుల కస్టడి విధించడంతో జైలుకు పంపినట్లు ఏసీపీ పేర్కొన్నారు. నిందితులను పట్టుకున్న మానకొండూర్ సీఐ రాజ్‌కుమార్‌ను, పోలీసు సిబ్బందిని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment