
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ యూజర్లు .. పోస్ట్ పెయిడ్ నుంచి ప్రీ–పెయిడ్‌కు, ప్రీ–పెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్‌కు మారడాన్ని సులభతరం చేసే దిశగా టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా సిమ్ మార్చక్కర్లేకుండా వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) ఆధారిత ధృవీకరణ ద్వారా ఈ ప్రక్రియ జరిగేలా టెలికం శాఖకు (డాట్) ప్రతిపాదించింది. దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసి, ఆధారాలు (పీవోసీ) ఇవ్వాలంటూ టెలికం ఆపరేటర్లకు డాట్ సూచించింది. పీవోసీని బట్టి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు డాట్ ఏడీజీ సురేశ్ కుమార్ మే 21న జారీ చేసిన నోట్‌లో పేర్కొన్నారు.
టెల్కోల ప్రతిపాదన ప్రకారం.. కనెక్షన్‌ను మార్చుకోదల్చుకున్న వారు తమ సర్వీస్ ప్రొవైడర్‌కు ఎస్‌ఎంఎస్, ఐవీఆర్‌ఎస్, వెబ్‌సైట్, అధీకృత యాప్ ద్వారా అభ్యర్ధన పంపాల్సి ఉంటుంది. దీన్ని ఆమోదిస్తూ .. టెలికం సంస్థ ఒక ప్రత్యేక ఐడీ, ఓటీపీని మొబైల్ యూజరుకు పంపిస్తుంది. ఈ ఓటీపీ 10 నిమిషాల దాకా చెల్లుబాటు అవుతుంది. ఓటీపీని ధృవీకరిస్తే.. కనెక్షన్ మార్పునకు యూజరు సమ్మతించినట్లుగా టెలికం సంస్థ పరిగణిస్తుంది. ఏ తేదీ, సమయం నుంచి మార్పు అమల్లోకి వస్తుందనేది సమాచారం అందజేస్తుంది. ఇలా కనెక్షన్ స్వరూపం మారే క్రమంలో గరిష్టంగా అరగంట పాటు మాత్రమే సర్వీసుల్లో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని డీవోటీ తన నోట్‌లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment