
ఈ-కామర్స్‌తో రాష్ట్రాలకు ఆదాయం
రాష్ట్రాల ఆర్థికాంశాలపై ఆర్‌బీఐ నివేదికలో సూచన
ముంబై: భారీ వేల్యుయేషన్లతో ఎదుగుతున్న ఈ-కామర్స్ సంస్థలపై రాష్ట్రాలు పన్నులు విధించవచ్చని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. తద్వారా రాష్ట్రాలు తమ ఆదాయాలను పెంచుకోవచ్చని తెలిపింది. అయితే, ఇందుకు సంబంధించిన నియమ, నిబంధనల్లో మరింత స్పష్టత ఉండాలని అభిప్రాయపడింది. ‘రాష్ట్రాల ఆర్థికాంశాలు: 2014-15 బడ్జెట్‌ల అధ్యయనం’ నివేదికలో ఆర్‌బీఐ ఈ విషయాలు తెలిపింది. వివిధ ఈ-కామర్స్ పోర్టల్స్‌పై కర్ణాటక, కేరళ ప్రభుత్వాలు పన్నులు విధించిన నేపథ్యంలో ఆర్‌బీఐ తాజా సూచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఈ-కామర్స్ సంస్థలపై పన్నుల విధింపు సంక్లిష్టమైన అంశమని, రాష్ట్రాలన్నీ ఒకే రీతి విధానాన్ని రూపొందించుకుంటే, అమలు సులువవుతుందని ఆర్‌బీఐ తెలిపింది.
రాష్ట్రాల స్థూల ద్రవ్యలోటు మెరుగుపడింది
రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచుకోవడానికి ప్రయత్నాలు చేయాలని భారత రిజర్వ్ బ్యాంక్ పిలుపునిచ్చింది. అధిక మూలధన కేటాయింపులపై దృష్టి సారించాలని, నిరంతరం ద్రవ్య స్థిరీకరణ ప్రయత్నాలు చేయాలని, అలాగే రుణ-జీడీపీ నిష్పత్తిని పరిమితం చేసుకోవాలని సూచించింది. రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు-2014-15 బడ్జెట్‌ల పరిశీలన పేరుతో ఆర్‌బీఐ ఒక నివేదికను మంగళవారం వెలువరించింది.
ఇటీవల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన 17 రాష్ట్రాల బడ్జెట్ డాక్యుమెంట్‌లు ఆధారంగా ఆర్‌బీఐ ఈ నివేదికను రూపొందిం చింది. 2013-14లో 2.5%గా ఉన్న రాష్ట్రాల స్థూల ద్రవ్యలోటు గత ఆర్థిక సంవత్సరంలో 2.3 శాతానికి మెరుగుపడిందని పేర్కొంది. అలాగే స్థూల రెవెన్యూ మిగులు సున్నా శాతం నుంచి 0.4%కి పెరిగిందని వివరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు మరో ఐదు రాష్ట్రాలు రెవెన్యూ లోటు బడ్జెట్‌లను రూపొం దించాయని, స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తిలో ద్రవ్యలోటు 3 శాతం కంటే అధికంగా 10 రాష్ట్రాల్లో ఉందని ఈ నివేదిక పేర్కొంది. వసూలయ్యే పన్నులు, చేయబోయే వ్యయాలు, ఇతర ఆర్థిక అంశాలపై అంచనాల్లో వాస్తవికత మెరుగుపడే చర్యలు రాష్ట్రాలు తీసుకోవలసిన అవసరం ఉందని ఆర్‌బీఐ సూచించింది.