![Rbi will raise repo rates - Sakshi](/styles/webp/s3/article_images/2018/05/22/rbi.jpg.webp?itok=K8jwur4S)
ముంబై: అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పరుగు దేశంలో ధరలు పెరుగుతాయనే భయాలను పెంచుతోంది. ద్రవ్యోల్బణం కట్టడిలో భాగంగా ఆగస్టులో జరిగే ద్రవ్య పరపతి విధానం సందర్భంగా ఆర్‌బీఐ తన కీలక రేటు రెపోను (ప్రస్తుతం 6 శాతం) పావుశాతం పెంచే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. రెపో రేటు పెంపు ద్వారా వ్యవస్థలో నగదు ప్రవాహానికి అడ్డుకట్ట వేయటం, డిమాండ్ తగ్గించటం, తద్వారా ధరల పెరుగుదలను నిరోధించటం ఆర్‌బీఐ లక్ష్యం.
అయితే ఇలాంటి సందర్భాల్లో వ్యవస్థలో డిమాండ్ తగ్గి వృద్ధికి బ్రేక్ పడుతుందన్న ఆందోళనలుంటాయి. అందుకని జూన్‌లో మాత్రం రేటు పెంపు ఉండదన్నది నిపుణుల అభిప్రాయం. చమురు ధరల పెరుగుదల, దీనితో ఈ కమోడిటీని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశంగా భారత్‌లో వాణిజ్యలోటు (ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం), కరెంట్ అకౌంట్ లోటు (ఎఫ్‌ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీలు మినహా దేశంలోకి వచ్చీ–పోయే నికర విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య వ్యత్యాసం) భయాలు, వెరసి రూపాయి వేగంగా పతనమవుతున్న సంగతి తెలిపిందే. హెచ్‌ఎస్‌బీఐ కూడా ఆగస్టు, అక్టోబర్‌లలో రేటు పెరిగే అవకాశం ఉందన్న అంచనాలను ఇప్పటికే వెలువరించింది.
దేశీయ పరిస్థితులు ఓకే...
ఊహించినదానికన్నా ముందే ఆర్‌బీఐ రేటు పెంచే అవకాశం ఉందని భావిస్తున్నాం. 2019 తొలి త్రైమాసికంలో రేటు పెంపు ఉంటుందని తొలుత అంచనా వేశాం. అయితే ఆగస్టులోనే పావుశాతం పెరిగే అవకాశముంది. రేటు పెంపు కేవలం వేగంగా మారుతున్న అంతర్జాతీయ అంశాలకు సంబంధించినదిగా భావిస్తున్నాం. దేశీయంగా ఆర్థిక పరిస్థితులు మాత్రం బలహీనంగా లేవు. – మెక్వైరీ, ఆస్ట్రేలియన్ బ్రోకరేజ్ సంస్థ
కఠిన ధోరణివైపు మొగ్గు...
పాలసీ రేట్లకు సంబంధించి ఇప్పటి వరకూ ఆర్‌బీఐ కొంత సరళతర, తటస్థ విధానాన్నే పాటిస్తోంది. అయితే ఆగస్టులో తన విధానాన్ని ఆర్‌బీఐ మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టులో పావుశాతం, అక్టోబర్‌లో పావుశాతం మొత్తం అరశాతం రేటు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్‌లో పాలసీ సంకేత సూచీ 0.01 పాయింట్ల వద్ద ఉంటే, ఇది మేలో 0.10 పాయింట్ల వద్దకు మారింది. క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, రూపాయి పతనం దీనికి కారణం. – నొమురా, జపాన్ బ్రోకరేజ్ సంస్థ
పెరిగే చమురు రేట్లతో వృద్ధికి విఘాతం: పరిశ్రమలు
పెరుగుతున్న ఇంధన ధరలు దేశ ఆర్థిక వృద్ధి గతిని దెబ్బతీసే ప్రమాదముందని పరిశ్రమవర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలను తక్షణమే తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. వీటిని వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానంలోకి చేర్చాలని కోరాయి. పరిశ్రమ సమాఖ్యలు ఫిక్కీ, అసోచాం ఈ మేరకు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మళ్లీ ఎగుస్తుండటంతో (ఈ వార్త రాసే రాత్రి 10 గంటల సమయానికి అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారల్ బ్రెంట్ క్రూడ్ ధర నాలుగేళ్ల గరిష్ట స్థాయిలో 78 డాలర్లు, లైట్ స్వీట్ ధర 72 డాలర్లపైన ట్రేడవుతోంది) దేశీయంగా ద్రవ్యోల్బణం, వాణిజ్య లోటు మొదలైనవి మరింతగా పెరిగే రిస్కులు అధికమయ్యాయని ఫిక్కీ ప్రెసిడెంట్ రశేష్ షా తెలిపారు.
రూపాయి బలహీనపడుతుండటం వల్ల దిగుమతుల భారం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఎకానమీ క్రమంగా కోలుకుంటున్న తరుణంలో.. ముడిచమురు రేట్ల పెరుగుదల వల్ల దేశ ఆర్థిక వృద్ధి గతికి గణనీయమైన రిస్కులు నెలకొన్నాయన్నారు. జీఎస్‌టీ పరిధిలోకి తేవడానికి సంబంధించి రాష్ట్రాలు, కేంద్రం కలిసి పనిచేస్తేనే ఇది సాధ్యపడుతుంది’ అని అసోచాం సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment