నేటి నుంచే ఆర్బీఎల్ బ్యాంక్ ఐపీవో
♦ ధరల శ్రేణి రూ.224-225
♦ దశాబ్దం తరువాత తొలి ప్రైవేట్ బ్యాంక్ ఐపీవో
ముంబై: ఒకప్పుడు రత్నాకర్ బ్యాంకుగా పరిచయమైన ఆర్‌బీఎల్ బ్యాంక్... ఐపీవోకు వస్తోంది. శుక్రవారం నుంచి ఈ ఆఫర్ ప్రారంభం కానుంది. దాదాపు దశాబ్దం తర్వాత ఐపీవోకు వచ్చిన తొలి ప్రైవేట్ బ్యాంక్ ఇది. ఈ నెల 23న ముగిసే ఈ ఐపీవో ద్వారా రూ.1,200 కోట్లు సమీకరించాలని ఈ బ్యాంక్ యోచిస్తోంది. ఈ ఐపీవోలో భాగంగా రూ.832.50 కోట్ల విలువైన తాజా షేర్లను, రూ.380.46 కోట్ల విలువైన ప్రస్తుత వాటాదారుల షేర్లను (బేకన్ ఇండియా ప్రైవేట్ ఈక్విటీ, జీపీఈ సంస్థలు) జారీ చేస్తారు. మొత్తమ్మీద ఐపీవో ద్వారా 10-11 శాతం వాటాను విక్రయిస్తారు. ఈ లెక్కన బ్యాంక్ విలువ రూ. 12,000 కోట్లుగా ఉంటుందని అంచనా. ఈ ఐపీవోకు ధరల శ్రేణి రూ.224-225.
యస్ బ్యాంకు తరవాత...
2005లో యస్ బ్యాంక్ ఐపీవోకు వచ్చింది. ఐపీవోకు వచ్చిన చివరి ప్రైవేట్ బ్యాంక్ ఇదే. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఆరేళ్ల క్రితం పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ ఐపీవోకు వచ్చింది. ఒక్కో షేర్‌ను రూ.225 చొప్పున 1.61 కోట్ల షేర్లను యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించి ఆర్‌బీఎల్ బ్యాంక్ రూ.364 కోట్లు సమీకరించినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.