RBL Bank
-
ఆర్బీఎల్ బ్యాంక్‌లో వాటా విక్రయం
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ ఆర్బీఎల్ బ్యాంక్‌లో ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా హైడ్రా ట్రేడింగ్ 1.24 శాతం వాటాను విక్రయించింది. బ్యాంక్ పబ్లిక్ వాటాదారులలో ఒకటైన హైడ్రా షేరుకి రూ. 203 సగటు ధరలో 75.11 లక్షల షేర్లను అమ్మివేసింది. వీటి విలువ రూ. 152.5 కోట్లుకాగా.. క్రోనస్ మెర్కండైజ్ ఎల్ఎల్పీ కొనుగోలు చేసింది. 2024 జూన్‌కల్లా ఆర్బీఎల్లో హైడ్రా వాటా 1.25 శాతంగా నమోదైంది. సైయెంట్ డీఎల్ఎం, స్పైస్‌జెట్‌లో.. బీఎస్ఈ వివరాల ప్రకారం మరో లావాదేవీలో ప్లూటస్ వెల్త్ మేనేజ్మెంట్ స్పైస్‌జెట్‌లో 0.66 శాతం వాటా(85 లక్షల షేర్లు)ను కొనుగోలు చేసింది. షేరుకి రూ. 60 సగటు ధరలో వీటిని దాదాపు రూ. 51 కోట్లకు సొంతం చేసుకుంది. స్పైస్‌జెట్ షేర్ల విక్రయదారుల వివరాలు వెల్లడికాలేదు. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం మోర్గాన్ స్టాన్లీ సైయెంట్ డీఎల్ఎంలో 4.34 లక్షల షేర్లను విక్రయించింది. షేరుకి రూ. 667 సగటు ధరలో వీటిని రూ. 29 కోట్లకు అమ్మివేసింది. హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్ 0.5 శాతం వాటాకు సమానమైన 4 లక్షల షేర్లను కొనుగోలు చేసింది. దీంతో సైయెంట్ డీఎల్ఎంలో హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్ వాటా 4.79 శాతం నుంచి 5.29 శాతానికి బలపడింది. -
విస్తరణ దిశగా ఆర్బీఎల్ బ్యాంక్
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ ఆర్బీఎల్ బ్యాంక్ విస్తరణపై దృష్టి సారించింది. వచ్చే మూడేళ్లలో 226 శాఖలను అదనంగా జోడించుకుంటామని ప్రకటించింది. 2023 మార్చి నాటికి ఉన్న మొత్తం వ్యాపారం (డిపాజిట్లు, రుణాలు) రూ.1.55 లక్షల కోట్లను 2026 మార్చి నాటికి రూ.2.70 లక్షల కోట్లకు పెంచుకోనున్నట్టు తెలిపింది. ఈ ఏడాది మార్చి నాటికి 514 శాఖలు ఉండగా, 2026 మార్చి నాటికి వీటిని 740కు తీసుకెళతామని ప్రకటించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లో 190 జిల్లాల పరిధిలో, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆర్బీఎల్ బ్యాంక్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రూ.84,887 కోట్లుగా ఉన్న డిపాజిట్లను రూ.1.45 లక్షల కోట్లకు పెంచుకోవాలని అనుకుంటోంది. అదే సమయంలో రుణాలు రూ.70,209 కోట్లుగా ఉంటే, వీటిని రూ.1.25 లక్షల కోట్లకు విస్తరించాలనే ప్రణాళికలతో ఉంది. ఈ వివరాలను ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్‌లో ఆర్బీఎల్ బ్యాంక్ పేర్కొంది. మార్చి నాటికి హోల్ సేల్, రిటైల్ రుణాల నిష్పత్తి 46:54గా ఉంటే, దీన్ని 35:65 రేషియోకి తీసుకెళ్లనున్నట్టు తెలిపింది. -
ఆర్బీఎల్ బ్యాంక్‌పై ఆర్బీఐ రూ. 2.27 కోట్ల జరిమానా
ముంబై: రికవరీ ఏజెంట్లకు సంబంధించిన నిబంధనలను పాటించనందుకుగాను ఆర్బీఎల్ బ్యాంక్ లిమిటెడ్‌పై 2.27 కోట్ల రూపాయల జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. 2018–19 నుండి 2021–22 ఆర్థిక సంవత్సరానికి మధ్య కాలానికి సంబంధించి ఈ జరిమానా విధించినట్లు పేర్కొంది. వివిధ నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను, పలు సహకార బ్యాంకులపై కూడా సెంట్రల్ బ్యాంక్ జరిమానా విధించింది. వీటిలో లోక్‌మంగల్ కో–ఆపరేటివ్ బ్యాంక్ (షోలాపూర్), జిలా సహకరి కేంద్రీయ బ్యాంక్ మర్యాడిట్ (రైసెన్) స్మృతి నాగ్రిక్ సహకారి బ్యాంక్ (మర్యాదిత్, మందసౌర్) రాయగఢ్ సహకరి బ్యాంక్ (ముంబై) నోబుల్ కో–ఆపరేటివ్ బ్యాంక్ (నోయిడా), ఇంపీరియల్ అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంక్ (జలంధర్) ఉన్నాయి. -
ఆర్బీఎల్ బ్యాంకుకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఆర్బీఐ!
ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ ఆర్బీఎల్ బ్యాంకుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దిమ్మతిరిగిపోయే షాకిచ్చింది. లోన్ రికవరీ ఏజెంట్లకు సంబంధించి ఆదేశాలను ఉల్లంఘించినందుకు గానూ రూ. 2.27 కోట్ల జరిమానా విధించింది. ఇదీ చదవండి: Rs 2000 notes: రూ.2వేల నోట్లపై కేంద్రం కీలక ప్రకటన! లోన్ రికవరీకి సంబంధించి ఆర్బీఎల్ బ్యాంక్‌పై ఆర్బీఐకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో 2018-19 నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన ఆర్బీఐ.. రికవరీ ఏజెంట్ల విషయంలో ఆదేశాలను ఆర్బీఎల్ బ్యాంక్ ఉల్లంఘించినట్లు గుర్తించింది. దీంతో ఆ బ్యాంక్ భారీ జరిమానా విధించింది. ఇదీ చదవండి: టాటాతో కుదరలేదు.. ఇక బిస్లెరీకి బాస్ ఆమే... లోన్ రికవరీ ఏజెంట్లు కస్టమర్లను బెదిరింపులకు, వేధింపులకు గురిచేయకుండా చూసుకోవడంలో ఆర్బీఎల్ బ్యాంక్ విఫలమైందని కేంద్ర బ్యాంక్ ఆక్షేపించింది. ఏజెంట్లను నియమించుకునే ముందు వారి నేర చరిత్రను పోలీసుల ద్వారా ధ్రువీకరించుకోవాల్సి ఉందని పేర్కొంది. ఇదీ చదవండి: Apple Watch: ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్!.. ఎలాగంటే... ఈ చర్య 2018-19 నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరాల కాలంలో గుర్తించిన ఉల్లంఘనలపై మాత్రమే తీసుకున్నదని ఆర్బీఐ స్పష్టం చేసింది. తమ పరిధిలోని బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థలు రుణాల వసూలు కోసం నియమించుకున్న ఏజెంట్లు కస్టమర్లను బెదిరింపులకు, వేధింపులకు గురిచేయకుండా చూసుకోవాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని 2022లో ఆర్బీఐ ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. -
ఆర్బీఎల్ బ్యాంక్ కొత్త ఎండీ, సీఈవో ఎంపిక
న్యూఢిల్లీ: ఆర్బీఎల్ బ్యాంక్ కొత్త ఎండీ, సీఈవోను ఎంపిక చేసుకుంది. ఇందుకు రిజర్వ్ బ్యాంక్ అనుమతి కోసం దరఖాస్తు చేసినట్లు తెలియజేసింది. బ్యాంకు రెగ్యులర్ కార్యకలాపాల బాధ్యతల నిర్వహణకు నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ సిఫారసు చేసిన కొత్త చీఫ్‌కు ఓకే చెప్పినట్లు పేర్కొంది. బుధవారం సమావేశమైన బోర్డు ఇందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలియజేసింది. అయితే కొత్త చీఫ్ పేరును వెల్లడించలేదు. 1949 బ్యాంకింగ్ నియంత్రణల చట్టం ప్రొవిజన్లమేరకు ఆర్బీఐ అనుమతి కోసం చీఫ్ ఎంపిక వివరాలను దాఖలు చేసినట్లు వివరించింది. బ్యాంక్ మధ్యంతర ఎండీ, సీఈవో రాజీవ్ అహుజా బాధ్యతలను మూడు నెలలపాటు పొడిగించేందుకు ఆర్బీఐ గత నెలలో అనుమతించిన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్లో కొన్ని అనూహ్య సంఘటనల కారణంగా అప్పటి ఎండీ, సీఈవో విశ్వవీర్ అహుజాను బ్యాంక్ బోర్డు సెలవుపై పంపింది. చదవండి: ఎగుమతిదారులకు సుంకాలు, జీఎస్టీ రిఫండ్స్.. రూ.1.75 లక్షల కోట్లు -
ఆర్బీఎల్ బ్యాంక్ తాత్కాలిక చీఫ్ బాధ్యతల పొడిగింపు
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగంలోని ఆర్బీఎల్ బ్యాంక్ తాత్కాలిక మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా (సీఈఓ) బాధ్యతలు నిర్వహిస్తున్న రాజీవ్ అహూజా పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 25వ తేదీ నుంచి మూడు నెలలు లేదా రెగ్యులర్ ఎండీ అండ్ సీఈఓ నియామకం జరిగే వరకూ ఏది ముందయితే దానికి వర్తించేలా ఆదేశాలు ఇస్తున్నట్లు బ్యాంకింగ్ రెగ్యులేటర్ పేర్కొంది. గత ఏడాది డిసెంబర్లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓ విశ్వవీర్ అహూజాను లీవ్‌పై పంపుతూ బ్యాంక్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది. అలాగే బ్యాంక్ రోజూవారీ కార్యకలపాల నిర్వహణకు తాత్కాలిక చీఫ్‌గా రాజీవ్ అహూజాకి పదోన్నతి ఇచ్చి, ఇందుకు ఆర్బీఐ ఆమోదాన్ని కోరింది. డిసెంబర్ 25 నుంచి మూడు నెలలు ఆయన బాధ్యతల్లో ఉండేలా ఆర్బీఐ ఆమోదం లభించింది. తన చీఫ్ జనరల్ మేనేజర్ యోగేష్ కే దయాల్‌ను ఆర్బీఐ బ్యాంక్ బోర్డ్‌లో నియమించినట్లు ఆర్బీఐ 2021 డిసెంబర్ 24 ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో అప్పటి ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్యాంక్ చీఫ్‌గా తన నియామకం తర్వాత డిసెంబర్ 26వ తేదీన మీడియా, ఇన్వెస్టర్లతో రాజీవ్ అహూజా మొట్టమొదటిసారి మాట్లాడుతూ, బ్యాంక్ ఆర్థికంగా పటిష్టంగా ఉందని తెలిపారు. డైరెక్టర్ల బోర్డు, ఆర్బీఐ నుంచి బ్యాంకుకు సంపూర్ణ మద్దతు ఉందని చెప్పారు. -
ఆర్బీఎల్ బ్యాంకు ఖాతాదారులకు అండగా ఆర్బీఐ
ముంబై: ప్రైవేట్ రంగ ఆర్బీఎల్ బ్యాంకులో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో కస్టమర్లకు భరోసా కల్పించేందుకు రిజర్వ్ బ్యాంకు రంగంలోకి దిగింది. బ్యాంకు ఆర్థిక పరిస్థితి ’సంతృప్తికరం’గానే ఉందని, తగు స్థాయిలో మూలధనం ఉందని పేర్కొంది. ఊహాగానాలతో డిపాజిటర్లు, ఇతరత్రా సంబంధిత వర్గాలు ఆందోళన చెందాల్సిన పని లేదని ఒక ప్రకటనలో పేర్కొంది. ‘ఆర్బీఎల్ వద్ద తగినంత మూలధనం ఉంది. ఆర్థిక పరిస్థితి కూడా సంతృప్తికరంగానే ఉంది. 2021 సెప్టెంబర్ 30తో ముగిసిన అర్ధ సంవత్సర ఫలితాల ప్రకారం క్యాపిటల్ అడెక్వసీ నిష్పత్తి మెరుగ్గా 16.33 శాతం స్థాయిలో ఉంది‘ అని వివరించింది. అలాగే నిబంధనల ప్రకారం లిక్విడిటీ కవరేజీ నిష్పత్తి (ఎల్‌సీఆర్) 100 శాతం ఉండాల్సినప్పటికీ బ్యాంకు అంతకన్నా మెరుగ్గా 153 శాతం మేర పాటిస్తోందని పేర్కొంది. నియంత్రణ, పర్యవేక్షణపరమైన అంశాల్లో బోర్డుకు మరింత సహాయం అవసరమైన సందర్భాల్లో వర్తించే నిర్దిష్ట నిబంధనలకు లోబడే అదనపు డైరెక్టరును నియమించినట్లు ఆర్బీఐ వివరించింది. ఆర్బీఎల్ బ్యాంకు ఎండీ, సీఈవో విశ్వవీర్ అహూజా అకస్మాత్తుగా సెలవుపై వెళ్లడం .. ఆయన స్థానంలో తాత్కాలికంగా రాజీవ్ అహూజా నియమితులు కావడం.. అలాగే బోర్డులో అదనపు డైరెక్టరుగా చీఫ్ జనరల్ మేనేజర్ యోగేష్ కె. దయాళ్ను ఆర్బీఐ నియమించడం వంటి పరిణామాలు బ్యాంకు పరిస్థితిపై సందేహాలు రేకెత్తించాయి. యస్ బ్యాంకు, లక్ష్మి విలాస్ బ్యాంకు తరహాలో ఆర్బీఎల్ కూడా ఆర్థిక సంక్షోభంలో చిక్కు కుని ఉండవచ్చన్న ఆందోళనలు నెలకొన్నాయి. (చదవండి: అదృష్టంలో దురదృష్టం అంటే ఇదేనేమో.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు?) -
ఆర్బీఎల్ వీసా క్రెడిట్ కార్డుల జారీ ప్రారంభం
ముంబై: వీసా పేమెంట్ నెట్వర్క్ ఆధారిత కార్డుల జారీని ఆర్బీఎల్ బ్యాంకు ప్రారంభించింది. కార్డు డేటాను భారత్‌లోనే నిల్వ చేయాలన్న నిబంధనలను మాస్టర్‌కార్డు ఆచరణలో పెట్టకపోవడంతో కొత్త కార్డుల జారీపై జూలై 14న ఆర్బీఐ నిషేధం విధించింది. అప్పటి వరకు ఆర్బీఎల్ బ్యాంకు మాస్టర్కార్డులనే జారీ చేస్తుండేది. ఆర్బీఐ ఆదేశాల నేపథ్యంలో వీసా పేమెంట్ నెట్‌వర్క్‌తో జూలై 14నే ఆర్బీఎల్ బ్యాంకు ఒప్పందం చేసుకుంది. డేటా అనుసంధానాన్ని వేగంగా పూర్తి చేసుకోవడంతో వీసా కార్డుల జారీని మొదలు పెట్టినట్టు బ్యాంకు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12–14 లక్షల కార్డుల జారీ లక్ష్యాన్ని చేరుకుంటామని ప్రకటించింది. క్రెడిట్ కార్డుల్లో ఆర్బీఎల్ బ్యాంకుకు 5 శాతం మార్కెట్ వాటా ఉంది. -
నష్టాల్లోకి ఆర్బీఎల్ బ్యాంక్
ప్రయివేట్ రంగ సంస్థ ఆర్బీఎల్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో రివర్స్ టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. వెరసి క్యూ1(ఏప్రిల్–జూన్)లో రూ. 459 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. గతేడాది (2020–21) ఇదే కాలంలో రూ. 141 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇందుకు ప్రొవిజన్లు పెరగడం ప్రభావం చూపింది. కోవిడ్–19 నేపథ్యంలో స్థూల స్లిప్పేజెస్ 97 శాతం ఎగసి రూ. 1,342 కోట్లను తాకాయి. గత క్యూ1తో పోలిస్తే స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 3.45 శాతం నుంచి 4.99 శాతానికి పెరిగాయి. మొత్తం ప్రొవిజన్లు రూ. 500 కోట్ల నుంచి రూ. 1,425 కోట్లకు జంప్‌చేశాయి. కోవిడ్–19కు రూ. 600 కోట్ల అదనపు కేటాయింపులు చేపట్టకపోతే క్యూ1లో లాభాలు ప్రకటించడం సాధ్యమయ్యేదని ఆర్బీఎల్ బ్యాంక్ ఎండీ, సీఈవో విశ్వవీర్ అహుజా పేర్కొన్నారు. పునర్వ్యవస్థీకరించిన రుణాలు రూ. 933 కోట్ల నుంచి రూ. 1,162 కోట్లకు పెరిగాయి. నికర వడ్డీ ఆదాయం 7 శాతం క్షీణించి రూ. 970 కోట్లకు పరిమితంకాగా.. నికర వడ్డీ మార్జిన్లు 4.9 శాతం నుంచి 4.4 శాతానికి నీరసించాయి. కనీస మూలధన నిష్పత్తి 17.15 శాతానికి చేరింది. ఫలితాల నేపథ్యంలో ఆర్బీఎల్ బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 195 వద్ద ముగిసింది. -
నిధుల వేటలో ప్రైవేట్ బ్యాంకులు
ఆర్థిక అనిశ్చితితో తొలి తైమాసికంలో భారీ నష్టాలను మూటగట్టుకున్న చిన్నతరహా బ్యాంకులు ఇప్పుడు తమ బ్యాలెన్స్ షీట్‌ను పటిష్టం చేసుకునేందుకు సిద్దమయ్యాయి. బ్యాలెన్స్ షీట్ పటిష్టత చర్యలో భాగంగా ప్రిఫరెన్షియల్ పద్దతిలో షేర్ల అమ్మకా ద్వారా నిధుల సమీకరణకు ప్రణాళికలను రచిస్తున్నాయి. ఆర్బీఎల్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, డీసీబీ బ్యాంక్‌లు ఈ ఏడాది ద్వితీయార్థంలో కొంత వాటాను విక్రయం ద్వారా రిటైల్ ఇన్వెస్టర్లను భారీగా ఆకట్టుకునే అవకాశం ఉంది. నిధుల సమీకరణ ఎందుకంటే: బ్యాంకింగ్ వ్యవస్థను దెబ్బతీసిన కోవిడ్-19, మారిటోరియం విధింపు వాస్తవ ప్రభావాలు... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికం నాటికి తెలుస్తాయి. అందువల్ల ఏమైనా అనుకోని ఒత్తిళ్లను ఎదుర్కోనేందుకు సిద్ధంగా తగిన మూలధన నిధులను సమీకరించడం చాలా ముఖ్యమని బ్యాకింగ్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే 2008 సంక్షోభం సమయంలో విదేశీ బ్యాంకులు ఎదుర్కోన్న అనుభవాల నుంచి దేశీయ బ్యాంకింగ్ ఎంతో నేర్చుకుంది. సంక్షోభ సమయంలో మూలధన సేకరణను ఆలస్యం చేసిన బ్యాంకులు ఎక్కువగా నష్టపోయిన సంగతిని ఈ సందర్భంగా బ్యాంకింగ్ నిపుణులు గుర్తుచేస్తున్నారు. ఆర్బీఎల్ బ్యాంక్ క్యూఐపీ ఇష్యూ పద్దతిలో ఇప్పటికే రూ.2025 కోట్లను సమీకరించింది. ప్రిఫరెన్షియల్ కేటాయింపు ద్వారా డిసెంబర్లో మరో రూ.1000 కోట్ల సమీకరించనుంది. కరోనా సంక్షోభంతో వ్యాపారకలాపాలకు ఎలాంటి ఆటంకాంలు రాకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా నిధుల సమీకరణ చేస్తున్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. రుణాలు, ఈక్విటీల కేటాయింపు ద్వారా రూ.12,000 కోట్ల వరకు నిధులను సమీకరించేందుకు ఫెడరల్ బ్యాంక్ ఇప్పటికే షేర్‌హోల్డర్ల అనుమతి తీసుకుంది. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నామని తొందర్లో నిధుల సమీకరణ ప్రక్రియను చేపడతామని ఫెడరల్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశితోష్ కజరియా తెలిపారు. డీసీబీ బ్యాంక్ రూ.500 కోట్ల సమీకరణకు షేర్‌హోల్డర్ల అనుమతులు తీసుకుంది. ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం నెలకొన్న ఒత్తిడికి అధిగమించేందుకు, భవిష్యత్తు వృద్ధి దృష్ట్యా నిధుల సమీకరణ అవసరమని బ్యాంక్ సీఈఓ మురళి నటరాజన్ తెలిపారు. బ్యాంక్ క్యాపిటల్ అడెక్వసీ 17.55శాతంగా ఉన్నందున నిధుల సమీకరణ తమకు అత్యవసరం కాదని ఆయనన్నారు. అలాగే ఇతర చిన్న బ్యాంకులు కూడా ప్రిఫరెన్షియల్ కేటాయింపు ద్వారా నిధుల సమీకరించేందుకు ఇప్పటికే షేర్‌హోల్డర్ల అనుమతి తీసుకున్నాయి. దీంతో సరైన సమయంలో ఆయా బ్యాంకులు నిధుల సమీకరణకు మార్కెట్ తలుపుతట్టే అవకాశం ఉంది. ఇందుకే ప్రిఫరెన్షియల్ ఇష్యూ: ప్రస్తుత పరిస్థితుల్లో అందరు ఇన్వెస్టర్లు వాటా కొనుగోళ్లకు ఆసక్తి చూపే అవకాశం ఉండకపోవచ్చు. అందుకే ఆయా బ్యాంకులు నిధుల సమీకరణకు ప్రిఫరెన్షియల్ ఇష్యూను ఎంచుకున్నాయి. ప్రిఫరెన్షియల్ కేటాయింపు ఇష్యూ పద్దతిలో అతితక్కువ కాలంలో, తక్కువ ఇన్వెస్టర్లకు షేర్లను కేటాయించి నిధులను సమీకరించే వీలు ఉంటుంది అని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభం 73 శాతం డౌన్
ముంబై: ప్రైవేట్ రంగ ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం సెప్టెం బర్ క్వార్టర్లో 73 శాతం తగ్గి రూ.54 కోట్లకు చేరింది. మొండి బకాయిల వల్ల రానున్న క్వార్టర్లలో నికర లాభం మరింతగా తగ్గగలదని బ్యాంక్ ఎమ్డీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ విశ్వవీర్ అహుజా పేర్కొన్నారు. స్థూల మొండి బకాయిలు 2.60 శాతానికి పెరిగాయని తెలిపారు. గత క్యూ2లో స్థూల మొండి బకాయిలు 1.4 శాతమేనని చెప్పారు. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. బీఎస్ఈలో ఆర్బీఎల్ బ్యాంక్ షేర్ 3 శాతం నష్టంతో రూ.286.90 వద్ద ముగిసింది. -
ఆర్బీఎల్ ఫలితాలు భేష్..షేరు క్రాష్
సాక్షి, ముంబై: ప్రయివేట్ రంగ సంస్థ ఆర్బీఎల్ బ్యాంక్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసిక ఫలితాల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చింది. శుక్రవారం విడుదల చేసిన క్యూ1(ఏప్రిల్-జూన్) ఫలితాల్లో అంచనాలకు మించి రాణించింది. బ్యాంకు నికర లాభం 41 (40.5) శాతం ఎగసి రూ. 267 కోట్లగా నమోదు చేసింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 48 శాతం పుంజుకుని రూ. 817 కోట్లకు చేరింది. స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) స్థిరంగా 1.38 శాతం వద్దే నమోదయ్యాయి. అయితే గైడెన్స్‌పై యాజమాన్యం వ్యాఖ్యలతో ఆర్బీఎల్ కౌంటర్లో అమ్మకాలు జోరందుకున్నాయి ఫలితాల ప్రకటనతో ఇన్వెసర్ల కొనుగోళ్లతో లాభపడిన షేరు ఒక్కసారిగా 9 శాతం పతనమైంది. మేనేజ్మెంట్ నిరాశజనక గైడెన్స్ అంచనాలు సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని ఎనలిస్టులు భావించారు. త్రైమాసిక ప్రాతిపదికన నికర ఎన్పీఏలు 0.69 శాతం నుంచి 0.65 శాతానికి క్షీనించాయి. ఇక ప్రొవిజన్లు రూ. 213 కోట్లుకాగా.. క్యూ4లో రూ. 200 కోట్లుగా నమోదు చేసింది. త్రైమాసిక ప్రాతిపదికన స్లిప్పేజెస్ రూ. 206 కోట్ల నుంచి రూ. 225 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో రూ. 147 కోట్లను రైటాఫ్ చేసింది. క్యూ4లో ఇవి రూ. 91 కోట్లు. కాగా నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) ఆల్‌టైమ్ గరిష్టం వద్ద 4.3 శాతాన్ని తాకాయి. రానున్న కాలంలో అదనపు ప్రొవిజన్లు చేపట్టవలసి ఉంటుందని దీంతో రుణ వ్యయాలు 0.35-0.4 శాతంమేర పెరగవచ్చని బ్యాంకు యాజమాన్యం వ్యాఖ్యానించింది. అలాగే స్థూల ఎన్పీఏలు 2.25-2.5 శాతానికి చేరవచ్చంటూ అభిప్రాయపడింది. కొన్ని కార్పొరేట్ ఖాతాలు ఇబ్బందికరంగా పరిణమించినట్టు తెలిపింది. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభం 36 శాతం అప్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగంలోని ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 36 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.151 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.205 కోట్లకు పెరిగిందని ఆర్బీఎల్ బ్యాంక్ తెలిపింది. వడ్డీ ఆదాయం బాగా పెరగడంతో నికర లాభం ఈ స్థాయిలో వృద్ధి చెందిందని వివరించింది. అయితే కేటాయింపులు అధికంగా ఉండటం వల్ల లాభం తగ్గిందని వివరించింది. నిర్వహణ లాభం 48 శాతం వృద్ధితో రూ.449 కోట్లకు పెరిగిందని, కీలకమైన ఫీజు ఆదాయం 60 శాతం వృద్ధితో రూ.325 కోట్లకు పెరిగిందని పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం 41 శాతం అప్... నికర వడ్డీ ఆదాయం 41 శాతం వృద్ధితో రూ.593 కోట్లకు, ఇతర ఆదాయం 38 శాతం వృద్ధితో రూ.333 కోట్లకు పెరిగిందని ఆర్బీఎల్ బ్యాంక్ పేర్కొంది. నికర వడ్డీ మార్జిన్ 3.74 శాతం నుంచి 4.08 శాతానికి పెరిగిందని వెల్లడించింది. రుణ నాణ్యత ఒకింత మెరుగుపడిందని వివరించింది. గత క్యూ2లో 1.44 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 1.40 శాతానికి, నికర మొండి బకాయిలు 0.78 శాతం నుంచి 0.74 శాతానికి తగ్గాయని తెలిపింది. కేటాయింపులు 87 శాతం వృద్ధితో రూ.140 కోట్లకు పెరిగాయని పేర్కొంది. బీఎస్ఈలో ఆర్బీఎల్ బ్యాంక్ షేర్ 1 శాతం నష్టంతో రూ.465 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఏడాది కనిష్ట స్థాయి, రూ.439ను తాకింది. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభం 35% అప్
ముంబై: చిన్న తరహా ప్రైవేట్ రంగ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ క్వార్టర్లో 35 శాతం పెరిగింది. గత క్యూ1లో రూ.141 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.190 కోట్లకు పెరిగిందని ఆర్బీఎల్ బ్యాంక్ పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం 38 శాతం వృద్ధితో రూ.553 కోట్లకు, ఇతర ఆదాయం 27 శాతం వృద్ధితో రూ.326 కోట్లకు పెరిగాయని బ్యాంక్ ఎమ్డీ, సీఈఓ విశ్వవీర్ అహుజా తెలిపారు. కీలకమైన ఫీజు ఆదాయం 58 శాతం వృద్ధి చెందగా, నిర్వహణ ఆదాయం 39 శాతం వృద్ధితో రూ.432 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. నికర వడ్డీ ఆదాయం, ఇతర ఆదాయం, నిర్వహణ ఆదాయాలు బాగా ఉండటంతో ఈ స్థాయి నికర లాభం సాధించామని పేర్కొన్నారు. నికర వడ్డీ మార్జిన్ 4 శాతం రేంజ్లో... రుణాలు 36 శాతం వృద్ధి చెందడం, నికర వడ్డీ మార్జిన్ అర శాతం విస్తరించి 4.04 శాతానికి చేరడంతో నికర వడ్డీ ఆదాయం మంచి వృద్ధి సాధించినట్లు అహుజా తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరం అంతా నికర వడ్డీ మార్జిన్‌ను 4 శాతానికి మించి కొనసాగిస్తామన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. రుణాలు 36 శాతం వృద్ధితో రూ.42,198 కోట్లకు, డిపాజిట్లు 27 శాతం వృద్ధితో రూ.44,960 కోట్లకు ఎగిశాయని చెప్పారు. తగ్గిన మొండి బకాయిలు.. గత క్యూ1లో 1.46 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో 1.40 శాతానికి తగ్గాయని అహుజా తెలిపారు. అలాగే నికర మొండి బకాయిలు 0.78 శాతం నుంచి 0.75 శాతానికి తగ్గాయని పేర్కొన్నారు. కేటాయింపులు రూ.94 కోట్ల నుంచి 49 శాతం వృద్ధి (క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన చూస్తే, 24 శాతం వృద్ధితో రూ.140 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. ప్రొవిజన్ కవరేజ్ రేషియో 57.99 శాతం నుంచి 60.41 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. బీఎస్ఈలో ఆర్బీఎల్ బ్యాంక్ షేర్ 1.6 శాతం నష్టంతో రూ.556 వద్ద ముగిసింది. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభం 55 శాతం అప్
ఒక్కో షేర్‌కు రూ.1.80 డివిడెండ్ న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగంలోని ఆర్బీఎల్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.130 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం(రూ.84 కోట్లు)తో పోల్చితే 55 శాతం వృద్ధి సాధించామని ఆర్బీఎల్ బ్యాంక్ తెలిపింది. ఒక్కో షేర్‌కు రూ.1.80 తుది డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2015–16లో రూ.292 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 53 శాతం వృద్ధితో రూ.446 కోట్లకు, మొత్తం ఆదాయం రూ.3,235 కోట్ల నుంచి రూ.4,469 కోట్లకు ఎగసిందని వివరించింది. -
ఆర్బీఎల్ బ్యాంక్ ఐపీఓ 70 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్
న్యూఢిల్లీ: ఆర్బీఎల్ బ్యాంక్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు అనూహ్య స్పందన లభించింది. గత శుక్రవారం ప్రారంభమై మంగళవారం ముగిసిన ఈ ఐపీఓ 70 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయింది. 3.79 కోట్ల షేర్లకు గాను 263 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్(క్విబ్)లకు కేటాయించిన వాటా 85 రెట్లు, సంస్థాగతం కాని ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 198 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 6 రెట్లు చొప్పున ఓవర్ సబ్‌స్క్రైబయ్యాయి. ఈ ఐపీఓ మొత్తం 10.2 లక్షల దరఖాస్తుల ద్వారా రూ.60,000 కోట్ల విలువైన బిడ్స్ ఆకర్షించింది. రూ.224-225 ధరల శ్రేణిగా గల ఈ ఐపీఓ ద్వారా రూ.1,200 కోట్లు సమీకరించాలని గతంలో రత్నాకర్ బ్యాంక్‌గా కార్యకలాపాలు నిర్వహించిన ఈ బ్యాంక్ భావించింది. ఈ ఐపీఓ ద్వారా 10-11 శాతం వాటాను ఈ బ్యాంక్ విక్రయించింది. ఈ లెక్కన ఈ బ్యాంక్ విలువ రూ.12,000 కోట్లుగా ఉంటుందని అంచనా. గత వారంలో ఒక్కో షేర్‌ను రూ.225చొప్పున 1.61 కోట్లకు పైగా షేర్లను యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించడం ద్వారా ఈ బ్యాంక్ రూ.364 కోట్లు నిధులు సమీకరించింది. పదేళ్లలో తొలి ప్రైవేట్ బ్యాంక్ ఐపీఓ ఇది. ఎన్ఎస్ఈ ఐపీఓకు మర్చంట్ బ్యాంకర్ల నియామకం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ) ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ప్రయత్నాల జోరును పెంచింది. తాజాగా ఐపీఓకు మర్చంట్ బ్యాంకర్లుగా వ్యవహరించడానికి నాలుగు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. సిటిగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా, మోర్గాన్ స్టాన్లీ ఇండియా కంపెనీ లిమిటెడ్, జేఎం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషనల్ సెక్యూరిటీస్, కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీలు-ఈ నాలుగు మర్చంట్ బ్యాంకింగ్ కంపెనీలు తమ ఐపీఓకు జాయింట్ గ్లోబల్ కో-ఆర్డినేటర్స్‌గా వ్యవహరిస్తాయని పేర్కొంది. దేశీయంగానూ, విదేశాల్లోనూ స్టాక్ మార్కెట్లలో లిస్ట్ కావాలని ఎన్ఎస్ఈ యోచిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఓ పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి వచ్చే ఏడాది జనవరిలో, విదేశాల్లో లిస్టింగ్‌కు సంబంధించిన పత్రాలను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో దాఖలు చేయనున్నది. ఎన్ఎస్ఈ పోటీకంపెనీ బీఎస్ఈ కూడా ఐపీఓ ప్రక్రియను ప్రారంభించింది. ఐపీఓకు సెబీ నుంచి సూత్రప్రాయ ఆమోదం పొందిన ఈ కంపెనీ ఈ ఏడాదే ఐపీఓ పత్రాలను సమర్పించనున్నదని సమాచారం. -
నేటి నుంచే ఆర్బీఎల్ బ్యాంక్ ఐపీవో
♦ ధరల శ్రేణి రూ.224-225 ♦ దశాబ్దం తరువాత తొలి ప్రైవేట్ బ్యాంక్ ఐపీవో ముంబై: ఒకప్పుడు రత్నాకర్ బ్యాంకుగా పరిచయమైన ఆర్బీఎల్ బ్యాంక్... ఐపీవోకు వస్తోంది. శుక్రవారం నుంచి ఈ ఆఫర్ ప్రారంభం కానుంది. దాదాపు దశాబ్దం తర్వాత ఐపీవోకు వచ్చిన తొలి ప్రైవేట్ బ్యాంక్ ఇది. ఈ నెల 23న ముగిసే ఈ ఐపీవో ద్వారా రూ.1,200 కోట్లు సమీకరించాలని ఈ బ్యాంక్ యోచిస్తోంది. ఈ ఐపీవోలో భాగంగా రూ.832.50 కోట్ల విలువైన తాజా షేర్లను, రూ.380.46 కోట్ల విలువైన ప్రస్తుత వాటాదారుల షేర్లను (బేకన్ ఇండియా ప్రైవేట్ ఈక్విటీ, జీపీఈ సంస్థలు) జారీ చేస్తారు. మొత్తమ్మీద ఐపీవో ద్వారా 10-11 శాతం వాటాను విక్రయిస్తారు. ఈ లెక్కన బ్యాంక్ విలువ రూ. 12,000 కోట్లుగా ఉంటుందని అంచనా. ఈ ఐపీవోకు ధరల శ్రేణి రూ.224-225. యస్ బ్యాంకు తరవాత... 2005లో యస్ బ్యాంక్ ఐపీవోకు వచ్చింది. ఐపీవోకు వచ్చిన చివరి ప్రైవేట్ బ్యాంక్ ఇదే. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఆరేళ్ల క్రితం పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ ఐపీవోకు వచ్చింది. ఒక్కో షేర్‌ను రూ.225 చొప్పున 1.61 కోట్ల షేర్లను యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించి ఆర్బీఎల్ బ్యాంక్ రూ.364 కోట్లు సమీకరించినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. -
19 నుంచి ఆర్బీఎల్ బ్యాంక్ ఐపీఓ
పదేళ్ల తర్వాత అతి పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐపీఓ ధరల శ్రేణి రూ.224-225 ముంబై: ఆర్బీఎల్ బ్యాంక్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఐపీఓ ద్వారా రూ.1,230 కోట్లు సమీకరించనున్నట్లు ఆర్బీఎల్ బ్యాంక్ తెలిపింది. దాదాపు పదేళ్ల తర్వాత ఒక ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐపీఓ రావడం ఇదే మొదటిసారి. ఒక దేశీయ బ్యాంక్ ఈ రేంజ్లో నిధులు సమీకరించడం కూడా ఇదే తొలిసారి. ఈ ఐపీఓలో భాగంగా తాజా షేర్ల జారీ ద్వారా రూ.832.5 కోట్లు, ప్రస్తుత వాటాదారుల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ విధానంలో విక్రయించడం ద్వారా రూ.380 కోట్ల పెట్టుబడులను సమీకరించనున్నామని పేర్కొంది. ఈ ఐపీఓకు ధరల శ్రేణిని రూ.224-225గా నిర్ణయించామని ఇక్కడ జరిగిన ఐపీఓ రోడ్‌షోలో ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఉదయ్ కోటక్ తెలిపారు. ఈ రోడ్ షోలో ఆర్బీఎల్ బ్యాంక్‌లో స్వల్పమొత్తంలో వాటా ఉన్న హెచ్డీఎఫ్సీ దీపక్ పరేఖ్, ఎస్బీఐ చైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య కూడా పాల్గొన్నారు.