ముంబై: ప్రైవేట్ రంగ ఆర్‌బీఎల్ బ్యాంకులో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో కస్టమర్లకు భరోసా కల్పించేందుకు రిజర్వ్ బ్యాంకు రంగంలోకి దిగింది. బ్యాంకు ఆర్థిక పరిస్థితి ’సంతృప్తికరం’గానే ఉందని, తగు స్థాయిలో మూలధనం ఉందని పేర్కొంది. ఊహాగానాలతో డిపాజిటర్లు, ఇతరత్రా సంబంధిత వర్గాలు ఆందోళన చెందాల్సిన పని లేదని ఒక ప్రకటనలో పేర్కొంది. ‘ఆర్‌బీఎల్ వద్ద తగినంత మూలధనం ఉంది. ఆర్థిక పరిస్థితి కూడా సంతృప్తికరంగానే ఉంది. 2021 సెప్టెంబర్ 30తో ముగిసిన అర్ధ సంవత్సర ఫలితాల ప్రకారం క్యాపిటల్ అడెక్వసీ నిష్పత్తి మెరుగ్గా 16.33 శాతం స్థాయిలో ఉంది‘ అని వివరించింది.
అలాగే నిబంధనల ప్రకారం లిక్విడిటీ కవరేజీ నిష్పత్తి (ఎల్‌సీఆర్) 100 శాతం ఉండాల్సినప్పటికీ బ్యాంకు అంతకన్నా మెరుగ్గా 153 శాతం మేర పాటిస్తోందని పేర్కొంది. నియంత్రణ, పర్యవేక్షణపరమైన అంశాల్లో బోర్డుకు మరింత సహాయం అవసరమైన సందర్భాల్లో వర్తించే నిర్దిష్ట నిబంధనలకు లోబడే అదనపు డైరెక్టరును నియమించినట్లు ఆర్‌బీఐ వివరించింది. ఆర్‌బీఎల్ బ్యాంకు ఎండీ, సీఈవో విశ్వవీర్ అహూజా అకస్మాత్తుగా సెలవుపై వెళ్లడం .. ఆయన స్థానంలో తాత్కాలికంగా రాజీవ్ అహూజా నియమితులు కావడం.. అలాగే బోర్డులో అదనపు డైరెక్టరుగా చీఫ్ జనరల్ మేనేజర్ యోగేష్ కె. దయాళ్‌ను ఆర్‌బీఐ నియమించడం వంటి పరిణామాలు బ్యాంకు పరిస్థితిపై సందేహాలు రేకెత్తించాయి. యస్ బ్యాంకు, లక్ష్మి విలాస్ బ్యాంకు తరహాలో ఆర్‌బీఎల్ కూడా ఆర్థిక సంక్షోభంలో చిక్కు కుని ఉండవచ్చన్న ఆందోళనలు నెలకొన్నాయి.
(చదవండి: అదృష్టంలో దురదృష్టం అంటే ఇదేనేమో.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు?)
Comments
Please login to add a commentAdd a comment