ఆర్బీఎల్ బ్యాంక్ ఐపీఓ 70 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్
న్యూఢిల్లీ: ఆర్‌బీఎల్ బ్యాంక్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు అనూహ్య స్పందన లభించింది. గత శుక్రవారం ప్రారంభమై మంగళవారం ముగిసిన ఈ ఐపీఓ 70 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయింది. 3.79 కోట్ల షేర్లకు గాను 263 కోట్ల షేర్లకు బిడ్‌లు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్(క్విబ్)లకు కేటాయించిన వాటా 85 రెట్లు, సంస్థాగతం కాని ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 198 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 6 రెట్లు చొప్పున ఓవర్ సబ్‌స్క్రైబయ్యాయి.
ఈ ఐపీఓ మొత్తం 10.2 లక్షల దరఖాస్తుల ద్వారా రూ.60,000 కోట్ల విలువైన బిడ్స్ ఆకర్షించింది. రూ.224-225 ధరల శ్రేణిగా గల ఈ ఐపీఓ ద్వారా రూ.1,200 కోట్లు సమీకరించాలని గతంలో రత్నాకర్ బ్యాంక్‌గా కార్యకలాపాలు నిర్వహించిన ఈ బ్యాంక్ భావించింది. ఈ ఐపీఓ ద్వారా 10-11 శాతం వాటాను ఈ బ్యాంక్ విక్రయించింది. ఈ లెక్కన ఈ బ్యాంక్ విలువ రూ.12,000 కోట్లుగా ఉంటుందని అంచనా. గత వారంలో ఒక్కో షేర్‌ను రూ.225చొప్పున 1.61 కోట్లకు పైగా షేర్లను యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించడం ద్వారా ఈ బ్యాంక్ రూ.364 కోట్లు నిధులు సమీకరించింది. పదేళ్లలో తొలి ప్రైవేట్ బ్యాంక్ ఐపీఓ ఇది.
ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు మర్చంట్ బ్యాంకర్ల నియామకం
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్‌ఎస్‌ఈ) ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ప్రయత్నాల జోరును పెంచింది. తాజాగా ఐపీఓకు మర్చంట్ బ్యాంకర్లుగా వ్యవహరించడానికి నాలుగు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. సిటిగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా, మోర్గాన్ స్టాన్లీ ఇండియా కంపెనీ లిమిటెడ్, జేఎం ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషనల్ సెక్యూరిటీస్, కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీలు-ఈ నాలుగు మర్చంట్ బ్యాంకింగ్ కంపెనీలు తమ ఐపీఓకు జాయింట్ గ్లోబల్ కో-ఆర్డినేటర్స్‌గా వ్యవహరిస్తాయని పేర్కొంది.
దేశీయంగానూ, విదేశాల్లోనూ స్టాక్ మార్కెట్లలో లిస్ట్ కావాలని ఎన్‌ఎస్‌ఈ యోచిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఓ పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి వచ్చే ఏడాది జనవరిలో, విదేశాల్లో లిస్టింగ్‌కు సంబంధించిన పత్రాలను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో దాఖలు చేయనున్నది. ఎన్‌ఎస్‌ఈ పోటీకంపెనీ బీఎస్‌ఈ కూడా ఐపీఓ ప్రక్రియను ప్రారంభించింది. ఐపీఓకు సెబీ నుంచి సూత్రప్రాయ ఆమోదం పొందిన ఈ కంపెనీ ఈ ఏడాదే ఐపీఓ పత్రాలను సమర్పించనున్నదని సమాచారం.