మాల్యాకు ఆర్‌బీఎస్ షాక్! | RBS to terminate banking services to Kingfisher Beer Europe | Sakshi
Sakshi News home page

మాల్యాకు ఆర్‌బీఎస్ షాక్!

Published Mon, Apr 18 2016 2:40 AM | Last Updated on Sun, Sep 3 2017 10:08 PM

మాల్యాకు ఆర్‌బీఎస్ షాక్!

మాల్యాకు ఆర్‌బీఎస్ షాక్!

కింగ్‌ఫిషర్ బీర్ యూరప్‌కు బ్యాంకింగ్ సేవలు నిలిపివేసే యోచన
లండన్/వాషింగ్టన్: భారత్‌లో రుణ ఎగవేతల కేసుల్లో చిక్కుకుని బ్రిటన్‌కు పలాయనం చిత్తగించిన విజయ్ మాల్యాకు... విదేశాల్లో కూడా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ బీర్ యూరప్ లిమిటెడ్(కేబీఈఎల్)కు వచ్చే నెల నుంచి రుణ సదుపాయంతో పాటు ఇతర బ్యాంకింగ్ సేవలన్నింటినీ కూడా పూర్తిగా నిలిపివేసే ప్రణాళికల్లో గ్లోబల్ బ్యాంకింగ్ దిగ్గజం రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లండ్(ఆర్‌బీఎస్) ఉంది. మాల్యా నేతృత్వంలోని యూబీ గ్రూప్ తన విదేశీ బీర్ బిజినెస్‌ను కాలిఫోర్నియా కేంద్రంగా ఉన్న మెండోసినో బ్రూవింగ్ కంపెనీ ద్వారా నిర్వహిస్తోంది.

అమెరికాలో కింగ్‌ఫిషర్‌తో పాటు పలు ఇతర బ్రాండ్‌లను దీని ద్వారా విక్రయిస్తోంది. అయితే, ఇతర దేశాల్లో మాత్రం దీని పూర్తిస్థాయి అనుబంధ సంస్థ అయిన యూబీ ఇంటర్నేషనల్(యూకే), కేబీఈఎల్ ద్వారా వ్యాపార కార్యకలాపాలు జరుగుతున్నాయి. మెండోసినోకు ప్రస్తుతం మాల్యానే చైర్మన్‌గా ఉన్నారు.
 
భారత్‌లో బ్యాంకులకు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, దీని ప్రమోటర్ అయిన మాల్యా దాదాపు రూ.9,000 కోట్ల మేర రుణ బకాయిలను చెల్లించకపోవడంతో ఆయనపై సెబీ, ఈడీ, ఎస్‌ఎఫ్‌ఐఓ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు ఇప్పటికే విచారణను ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. మాల్యా దేశం విడిచి వెళ్లిపోవడంతో వివాదం మరింత ముదిరింది. తాజాగా ప్రభుత్వం మాల్యా పాస్‌పోర్టును 4 వారాల పాటు సస్పెండ్ కూడా చేసింది. దశాబ్దం క్రితం కేబీఈఎల్‌కు ఆర్‌బీఎస్ 2.8 మిలియన్ డాలర్ల రివాల్వింగ్ రుణ  సదుపాయాన్ని ఇచ్చినట్లు మెండోసినో అమెరికా స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థకు తెలిపింది.

ఆర్‌బీఎస్ తమకు ఇచ్చిన టెర్మినేషన్ నోటీసులను మే 31 వరకూ పెంచినట్లు చెబుతోంది. 2015 సెప్టెంబర్ వరకూ కేబీఈఎల్ చెల్లించాల్సిన బకాయి రూ. 5 కోట్లకు పైగా ఉంది. కాగా, నిధుల కొరతను ఎదుర్కొంటున్న మెండోసినో నుంచి మాల్యా గతేడాది రూ.1.7 కోట్లకుపైనే వేతన ప్యాకేజీని అందుకోవడం గమనార్హం.
 
ఈడీ ఆరోపణలు అవాస్తవం: యూబీ గ్రూప్
ఐడీబీఐ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణంలో కొంత మొత్తాన్ని మాల్యా విదేశాల్లో ఆస్తులు కొనుగోలుకు  బదలాయించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ చేసిన ఆరోపణలను విజయమాల్యా నియంత్రణలోని యూబీ గ్రూప్ ఆదివారం తోసిపుచ్చింది. ఐడీబీఐ బ్యాంక్ నుంచి కింగ్‌ఫిషర్ పొందిన రూ.950 కోట్ల మొత్తంలో రూ.430 కోట్లు విదేశీ ఆస్తుల కొనుగోళ్లకు మళ్లించినట్లు ఈడీ  ఆరోపించిన నేపథ్యంలో యూబీ గ్రూప్ దీనిపై ఒక ప్రకటన చేసింది. విదేశీ ఆర్థిక లావాదేవీల వివరాలు అన్నీ త్వరలో మాల్యా వెల్లడిస్తారనీ వివరించింది.
 
ఎన్‌పీఏలకు ఏకీకృత నిర్వచనం!
బ్యాంకింగ్ మొండిబకాయిలకు(ఎన్‌పీఏ) సం బంధించి ప్రపంచవ్యాప్తంగా ఏకీకృత నిర్వచనాన్ని తీసుకురావాలని బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్(బీఐఎస్) ప్రతిపాదించింది. అదేవిధంగా రుణ గ్రహీత చెల్లింపులు సరిగ్గా చేయనప్పుడు బ్యాంకులు అనుసరించే పద్ధతుల(ఫోర్‌బేరన్స్)కు కూడా ప్రపంచవ్యాప్తంగా ఒకే నిర్వచనం ఉండాలని భావిస్తోంది. విజయ్ మాల్యా సహా అనేక మంది కార్పొరేట్ రుణ ఎగవేతదారుల నుంచి భారతీయ బ్యాంకులు తమ బకాయిల వసూళ్ల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో బీఐఎస్ ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రస్తుతం వివిధ దేశాల్లోని బ్యాంకులు రుణాలను ఎన్‌పీఏలుగా విడదీసేందుకు విభిన్న అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయని.. దీనికి అంతర్జాతీయంగా ఒక ప్రామాణికం అంటూ లేదని బీఐఎస్  పేర్కొంది. ఈ అంశంపై ఒక వివరణాత్మక సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న బీఐఎల్‌లో 60కిపైగా సెంట్రల్ బ్యాంకులకు సభ్యత్వం ఉంది. ప్రస్తుతం ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ దీనికి వైస్ చైర్మన్‌గా ఉన్నారు. మూడేళ్ల కాలా నికి ఆయన 2015లో ఈ పదవికి ఎన్నికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement