అనుమతుల్లో జాప్యాలపై ఆందోళన..
రియల్టీ ప్రాజెక్టుల అమలులో అధికారులూ జవాబుదారీ కావాలి...
రియల్టీ బిల్లుపై డెవలపర్లు, కన్సల్టెంట్ల అభిప్రాయం
న్యూఢిల్లీ: ప్రాజెక్టుల అభివృద్ధిలో జరిగే ఆలస్యాలకు- సంబంధిత ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చేవారుసహా ఇందులో జోక్యం ఉండే ప్రభుత్వ అధికారులు, సంబంధిత స్థానిక పట్టణ సంస్థల ప్రతినిధులు అందరినీ జవాబుదారులను చేయాలని ప్రాపర్టీ డెవలపర్లు, కన్సల్టెంట్లు పేర్కొంటున్నారు. ఈ మేరకు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ బిల్లు ఉండాలని వారు కోరారు. అధికారుల నుంచి ఆమోదాలు పొందడంలో జరిగే ఆలస్యం... దీనితో ప్రాజెక్టు పూర్తిలో జాప్యం జరిగే సందర్భాల్లో సైతం డెవలపర్లనే బాధ్యులుగా చేసే వీలును ప్రతిపాదిత చట్టం కల్పిస్తోందన్న ఆందోళనను వారు వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ (రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్) బిల్లు, 2015కు కేబినెట్ ఆమోద ముద్ర వేయడం ఒక శుభపరిణామమని మాత్రం వారు వ్యాఖ్యానించారు.
దీనివల్ల ప్రాజెక్టుల అమల్లో పారదర్శకత పెరుగుతుందని, కొనుగోలుదారుల్లో విశ్వాసం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. అయితే ప్రాజెక్టుల ఆలస్యం సందర్భాలకు సంబంధించి... అనుమతులు ఇచ్చినవారినీ బాధ్యులుగా చేయకుంటే.. ప్రాజెక్టుల అమల్లో ఆలస్యం కొనసాగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు దారులకు, పరిశ్రమకు ప్రోత్సాహం అందించడం లక్ష్యాలుగా రియల్టీ బిల్లు 2015లో ప్రతిపాదించిన 20 ప్రధాన సవరణలకు కేంద్ర మంత్రి మండలి గురువారం ఆమోదముద్రవేసిన సంగతి తెలిసిందే. దీనిపై పరిశ్రమ ప్రముఖుల అభిప్రాయాలను పరిశీలిస్తే...
రియల్టీ మార్కెట్‌లో భారీ మార్పు
‘ఈ బిల్లు... రియల్టీ రంగంలో రానున్న పెద్ద మార్పు. వినియోగదారునికి రక్షణ కల్పించడమేకాదు. రియల్టీ మార్కెట్లో పెట్టుబడులకు ఈ నిర్ణయం ఊపునిస్తుంది. సకాలంలో ప్రాజెక్టుల అమలు విషయంలో ప్రభుత్వ అధికారులనూ బాధ్యులను చేయాలి’ అని సీబీఆర్‌ఈ, దక్షిణాసియా చైర్మన్ అంజుమన్ మాగజీన్ పేర్కొన్నారు. ‘పలు పథకాలను నియంత్రణా పరిధిలోకి తీసుకురావాలన్న ఆలోచన మంచిదే. అయితే బిల్లు పరిధిలోకి అధికారులనూ తీసుకురావాలి. గత ప్రాజెక్టులకూ వర్తించేట్లు (రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్) బిల్లు అమలుచేయడం అనుసరణీయం కాదు’ అని క్రెడాయ్ ప్రెసిడెంట్ గీతాంబర్ ఆనంద్ వ్యాఖ్యానించారు.