న్యూఢిల్లీ: దేశీయంగా ప్యాసింజర్ వాహనాలు 2017లో రికార్డ్ స్థాయిలో అమ్ముడయ్యాయి. తొలిసారి 30 లక్షల మార్క్‌ను అధిగమించాయి. వృద్ధిలో ఇది ఐదేళ్ల గరిష్ట స్థాయి. యుటిలిటీ వాహనాలకు అధిక డిమాండ్ ఉండటమే దీనికి ప్రధాన కారణం. సియామ్ గణాంకాల ప్రకారం..
♦ ప్యాసింజర్ వాహన (పీవీ) విక్రయాలు 2017లో 32,29,109 యూనిట్లు. ఇవి 2016లో 29,66,603 యూనిట్లు. 8.85 శాతం వృద్ధి కనిపించింది. పీవీ విక్రయాల్లో 2012 తర్వాత మళ్లీ ఇంతటి వృద్ధి ఇప్పుడే. 2012లో వృద్ధి 9.77 శాతంగా ఉంది.
♦ కార్ల విక్రయాలు 5.13 శాతం వృద్ధితో 20,62,357 యూనిట్ల నుంచి 21,68,151 యూనిట్లకు ఎగశాయి. యుటిలిటీ వాహన అమ్మకాలు 20.09 శాతం వృద్ధితో 7,24,522 యూనిట్ల నుంచి 8,70,060 యూనిట్లకు పెరిగాయి.
♦ టూవీలర్ విక్రయాలు 8.43% వృద్ధితో 1,91,76,905 యూనిట్లకు ఎగశాయి.
♦ ఇక 2016–17 ఆర్థిక సంవత్సరంలో పీవీ విక్రయాలు 9.23%, సీవీ అమ్మకాలు 4.16 శాతం, టూవీలర్ల విక్రయాలు 6.89 శాతం పెరిగాయి.
డిసెంబర్‌లో చూస్తే: డిసెంబర్‌లో పీవీ విక్రయాలు 5.22% వృద్ధితో 2,27,823 యూనిట్ల నుంచి 2,39,712 యూనిట్లకు ఎగశాయి. దేశీ కార్ల విక్రయాలు మాత్రం 1,58,617 యూనిట్ల నుంచి 1,58,326 యూనిట్లకు తగ్గాయి. మారుతీ సుజుకీ ఇండియా విక్రయాలు 11.44% వృద్ధితో 1,18,560 యూనిట్లకు, హ్యుందాయ్ విక్రయాలు స్వల్ప వృద్ధితో 40,158 యూనిట్లుకు ఎగశాయి. మహీంద్రా అమ్మకాలు 6.99% క్షీణతతో 15,531 యూనిట్లకు తగ్గాయి.
టాటా మోటార్స్ విక్రయాలు 33.94% వృద్ధితో 16,089 యూనిట్లకు పెరిగాయి. ఇక మొత్తం టూవీలర్ విక్రయాలు 41.45% వృద్ధితో 12,87,592 యూనిట్లకు ఎగశాయి. మోటార్‌సైకిల్ అమ్మకాలు 40.31% వృద్ధితో 7,88,156 యూనిట్లకు పెరిగాయి. హీరో మోటొకార్ప్ దేశీ అమ్మకాలు 42.71% వృద్ధి చెందాయి. 3,98,816 యూనిట్లుగా నమోదయ్యాయి. స్కూటర్ల అమ్మకాలు 52.05% వృద్ధితో 4,32,429 యూనిట్లకు చేరాయి. హెచ్‌ఎంఎస్‌ఐ విక్రయాలు 57.36% వృద్ధితో 2,38,820 యూనిట్లకు పెరిగాయి. వాణిజ్య వాహన (సీవీ) విక్రయాలు 52.62% వృద్ధితో 82,362 యూనిట్లకు పెరిగాయి.
వృద్ధి అంచనాలు పెంపు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు త్రైమాసికాల్లో అమ్మకాలు సానుకూలముగా ఉండటంతో.. సియామ్ 2017–18కి సంబంధించి ప్యాసింజర్ వాహన విభాగపు వృద్ధి అంచనాలను 7–9% నుంచి 9%కి పెంచింది. ఇక వాణిజ్య వాహన విభాగపు వృద్ధి అంచనాలను 4–6 % నుంచి 13%కి, టూవీలర్ల వృద్ధి అంచనాలను 9–11% నుంచి 12%కి సవరించింది.
ఎగుమతులు స్థిరం
దేశీ ప్యాసింజర్ వాహన ఎగుమతులు 2017లో స్థిరంగానే నమోదయ్యాయని సియామ్ తెలిపింది. ఇవి 7,38,894 యూనిట్లుగా ఉన్నాయని పేర్కొంది. 2016లో పీవీ ఎగుమతులు 7,38,137 యూనిట్లుగా నమోదయ్యాయని తెలిపింది. జీఎస్‌టీ రిఫండ్ అంశం ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపిందని పేర్కొంది. ‘డిసెంబర్‌లో ఐదారుగురు టాప్ ఎగుమతిదారులతో సమావేశం నిర్వహించాం. ఇందులో దాదాపు రూ.2,000 కోట్ల రిఫండ్ అమౌంట్ పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది’ అని సియామ్ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment