న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) కేసులో నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) బ్యాంకులకు అక్షింతలు వేసింది. అసెట్స్ అమ్మకం ద్వారా రూ. 37,000 కోట్లు రాబట్టేసుకుంటామంటూ ’తప్పుడు అభిప్రాయం’ కలిగించాయని, తీరా చూస్తే అమ్మకం జరగకపోగా.. రూ. 260 కోట్ల ఐటీ రీఫండ్‌ను రికవర్ చేసుకునేందుకు తంటాలు పడుతున్నాయని వ్యాఖ్యానించింది. ‘రిలయన్స్ జియోకి అసెట్స్‌ను విక్రయించడం ద్వారా రూ. 37,000 కోట్లు వస్తాయని ఆర్‌కామ్ అంటే మీరంతా దానికి వంతపాడారు. భవిష్యత్ అంతా బంగారంగా ఉంటుందంటూ భ్రమలు కల్పించారు. కానీ అసలు అసెట్స్ అమ్మకమే జరగలేదు. మీరు విఫలమయ్యారు.
జాయింట్ లెండర్స్ ఫోరమ్ విఫలమైంది. అసలు మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పండి‘ అంటూ బ్యాంకులను.. ముఖ్యంగా ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను జస్టిస్ ఎస్‌జే ముఖోపాధ్యాయ సారథ్యంలోని ద్విసభ్య ఎన్‌సీఎల్‌ఏటీ బెంచ్ కడిగేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎరిక్సన్ సంస్థకు బాకీలు కట్టుకోవడం కోసం ఐటీ రీఫండ్ నిధులను ఆర్‌కామ్ వినియోగించుకునేలా ఎందుకు అనుమతించరాదో చెప్పాలంటూ బ్యాంకులను ఆదేశించింది. దీనిపై రెండు పేజీల నోట్‌ను దాఖలు చేయాలని ఆదేశించిన ఎన్‌సీఎల్‌ఏటీ తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. టెలికం పరికరాల సంస్థ ఎరిక్సన్‌కు రూ. 550 కోట్ల బాకీలు తీర్చకపోతే ఆర్‌కామ్ అధినేత అనిల్ అంబానీతో పాటు ఇద్దరు అధికారులు కోర్టు ధిక్కరణ నేరం కింద జైలుశిక్ష ఎదుర్కోనున్న సంగతి తెలిసిందే. దీంతో ఐటీ రీఫండ్ రూపంలో వచ్చిన రూ. 260 కోట్లను ఇందుకోసం ఉపయోగించుకునేలా తగు ఆదేశాలివ్వాలంటూ ఎన్‌సీఎల్‌ఏటీని ఆర్‌కామ్ ఆశ్రయించింది.
మీరు చెప్పిందేమిటి... జరిగిందేమిటి!
Published Tue, Mar 12 2019 1:10 AM | Last Updated on Tue, Mar 12 2019 1:10 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment