సాక్షి, ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన దాతృత్వ సంస్థ రిలయన్స్ ఫౌండేషన్ బోధనా పద్ధతులు, ఉపాధ్యాయుల నైపుణ్యాలూ మెరుగు పర్చేందుకుగాను సెంటర్ ఫర్ టీచర్ అక్రిడిటేషన్(సెంటా)తో మల్టీ ఇయర్ కొలాబరేషన్ ఒప్పందంపై సంతకం చేసింది. దేశంలో విద్యాబోధనకు ప్రోత్సాహమిచ్చే లక్ష్యంతో బెంగళూరు కేంద్రంగా పనిచేసే సెంటాతో ఈ భాగస్వామ్యాన్ని కుదుర్చుంది.
ఈ ఒప‍్పందంలో భాగంగా సెంటా ప్రతీ ఏడాది నిర్వహించే ‘టీచింగ్ ప్రొఫెషనల్స్ ఒలింపియాడ్(టీపీఓ)కు రిలయన్స్ ఫౌండేషన్ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఈ క్రమంలో 4వ టీపీఓ ఎడిషన్ పోటీ పరీక్షను డిసెంబర్ 8న నిర్వహిస్తున్నారు. దుబాయ్, అబుదాబిలతోపాటు, దేశవ్యాప్తంగా 46 నగరాల్లో ఈ పోటీ ఉంటుందని సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ పోటీలో వెయ్యి మంది విజేతలకు నగదు బహుమతితోపాటు ఇతర ప్రోత్సాహకాలందివ్వనున్నట్టు తెలిపింది. ఉత్తమ నైపుణ్యాలున్న ఉపాధ్యాయుల్ని గుర్తించి వారినీ వారి బోధనా పద్ధతుల్ని వెలుగులోకి తేవడం ఈ పోటీ ప్రధాన ఉద్దేశమని చెప్పింది.
రిలయన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ ఇషా అంబానీ మాట్లాడుతూ భారతదేశంలో విద్యాబోధనలో ఎదుర్కొంటున్న సవాళ్ళను పరిష్కరించే చర్యలకు మద్దతివ్వాలని రిలయన్స్ ఫౌండేషన్ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. విద్య, సాంకేతిక నాణ్యతను అందించడంలో ఉపాధ్యాయులు ప్రధాన పాత్రను పోషిస్తారని ఇషా పేర్కొన్నారు. రిలయన్స్ ఫౌండేషన్ మద్దతు నందించడం తమకు పెద్ద ప్రేరణ అని సెంటా వ్యవస్థాపకుడు సీఈవో రమ‍్య వెంకట రామన్ సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో టీపీఓ పేరుతో ఉపాధ్యాయుల నైపుణ్యాల్ని పరీక్షించి, ప్రోత్సాహాన్నందిస్తున్నట్టు చెప్పారు.
టీపీఓ 2018 : ప్రాథమిక స్థాయినుంచి సీనియర్ సెకండరీ స్థాయిదాకా మొత్తం 21 సబ్జెక్టుల్లో ఉంటుంది. మిడిల్ స్కూల్, సెకండరీ, సీనియర్ సెకండరీ పరీక్ష ప్రస్తుతం ఇంగ్లీష్ మాధ్యమంలో ఉంటుంది. అలాగే ప్రైమరీ స్కూల్ టెస్ట్ ఇంగ్లీష్, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళం, తెలుగు మాధ్యమాలలో అందుబాటులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment