![Reliance industries AGM -Mukesh ambani group shares up - Sakshi](/styles/webp/s3/article_images/2020/07/15/Mukesh%20-RIL.jpg.webp?itok=te_GSDoM)
డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ వర్చువల్ ప్రాతిపదికన నేడు వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం) నిర్వహిస్తోంది. ఇటీవల డిజిటల్ అనుబంధ విభాగం రిలయన్స్ జియోకు తరలివచ్చిన విదేశీ పెట్టుబడులు, ఆర్‌ఐఎల్ చేపట్టిన రైట్స్ ఇష్యూ నేపథ్యంలో ఏజీఎంకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. గత ఏజీఎంలో రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ పేర్కొన్న గడువుకంటే ముందుగానే ఆర్‌ఐఎల్ రుణరహిత దిగ్గజంగా ఆవిర్భవించిన నేపథ్యంలో ప్రస్తుత సమావేశంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ముకేశ్ అంబానీ వెల్లడించనున్న ప్రణాళికలపై అంచనాలతో ఇన్వెస్టర్లు ఆర్‌ఐఎల్ గ్రూప్ కౌంటర్లలో కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. దీంతో ముకేశ్ అంబానీ గ్రూప్ షేర్లు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..
జోరుగా హుషారుగా
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఆర్‌ఐఎల్ షేరు 2.2 శాతం ఎగసి రూ. 1960 వద్ద ట్రేడవుతోంది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ఇటీవలే కంపెనీ మార్కెట్ విలువ రూ. 12 లక్షల కోట్లను అధిగమించింది. తద్వారా ఈ ఘనతను సాధించిన తొలి దేశీ కంపెనీగా రికార్డ్ నెలకొల్పింది. ఈ ప్రభావంతో గ్రూప్‌లోని ఇతర కంపెనీల కౌంటర్లు సైతం జోరందుకున్నాయి. హాథవే కేబుల్ అండ్ డేటాకామ్ 13 శాతం దూసుకెళ్లి రూ. 47 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 50 సమీపంలో ఏడాది గరిష్టాన్ని తాకింది. ఇతర కౌంటర్లలో డెన్ నెట్‌వర్క్స్, 5.25 శాతం జంప్‌చేసి రూ. 94 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 97 సమీపంవరకూ ఎగసింది. ఇక రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 0.5 శాతం బలపడి రూ. 461 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో రూ. 468ను దాటింది.
ఇటీవల ర్యాలీ
రెండు రోజులుగా దూకుడు చూపుతున్న హాథవే కేబుల్ షేరు గత నెల రోజుల్లో 73 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! ఇదే విధంగా రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సైతం 46 శాతం లాభపడింది. ఈ బాటలో టీవీ18 బ్రాడ్‌క్యాస్ట్, నెట్‌వర్క్ 18 మీడియా, డెన్ నెట్‌వర్క్స్ 12-40 శాతం మధ్య ఎగశాయి.
Comments
Please login to add a commentAdd a comment