ముంబై : ప్రముఖ వ్యాపారవేత్త, బిలీనియర్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్‌లో రికార్డులు సృష్టిస్తోంది. శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో ఈ కంపెనీ షేర్లు రూ.1000 మార్కును చేధించాయి. ఈ రోజు సాయంత్రం కంపెనీ తన నాలుగో క్వార్టర్ ఫలితాలను ప్రకటించనున్న నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నేటి ట్రేడింగ్‌లో జోరుగా కొనసాగుతోంది. ప్రస్తుతం కంపెనీ షేరు 2.39 శాతం లాభంలో రూ.998.70 వద్ద కొనసాగుతోంది. కంపెనీ మార్చి క్వార్టర్‌లో రూ.9,635.2 కోట్ల నికర లాభాలను ప్రకటిస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఏడాది ఏడాదికి ఇది 19.8 శాతం పెంపుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా కూడా రిలయన్స్ దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా ఉన్న సంగతి తెలిసిందే. పెట్రో కెమికల్, రిఫైనరీ బిజినెస్‌లను మాత్రమే కాక, పెట్టుబడిదారులు టెలికాం రంగంపై కూడా ఎక్కువగా దృష్టిసారించారు. గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్లు 11.6 డాలర్ల నుంచి 11.3 డాలర్లకు పడిపోయే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. డిసెంబర్ క్వార్టర్‌లో రిలయన్స్‌కు చెందిన జియో టెలికాం వ్యాపారాలు లాభాలను నమోదు చేశాయి. మొత్తంగా ఈ ఏడాది కంపెనీ షేర్లు 34 శాతం ర్యాలీ జరిపాయి. నేడు వెల్లడించే ఫలితాల్లో ఈక్విటీ షేర్లపై డివిడెండ్‌ను కూడా కంపెనీ ప్రకటించనుందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment