ఆఫ్రికా ఆయిల్ రిటైల్ బిజినెస్కు రిలయన్స్ గుడ్బై
♦ గ్యాప్‌కోలో 76% వాటా విక్రయం..
♦ కొనుగోలు చేసిన ఫ్రాన్స్ దిగ్గజం.. టోటల్
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) ఆఫ్రికాలోని పెట్రో ఉత్పత్తుల రిటైల్ వ్యాపారానికి గుడ్‌బై చెప్పింది. గల్ఫ్ ఆఫ్రికా పెట్రోలియం కార్పొరేషన్(గ్యాప్‌కో)లో తనకున్న 76 శాతం పూర్తి వాటాను ఫ్రాన్స్ దిగ్గజం టోటల్‌కు విక్రయించినట్లు ఆర్‌ఐఎల్ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే, ఈ డీల్ విలువ ఎంతనేది మాత్రం వెల్లడించలేదు. ఒప్పందం ప్రకారం గ్యాప్‌కోకు కెన్యా, ఉగాండా, టాంజేనియాల్లో ఉన్న కార్యకలాపాలు, ఆస్తులు మొత్తం టోటల్‌కు దక్కుతాయి.
గ్యాప్‌కోలో ఆర్‌ఐఎల్ విదేశీ అనుబంధ సంస్థ రిలయన్స్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ డీఎంసీసీకి ఈ 76 శాతం వాటా ఉండగా, మిగిలిన 24 శాతం వాటా మారిషస్‌కు చెందిన ఫార్చూన్ ఆయిల్ కార్పొరేషన్‌కు ఉంది. ఫార్చూన్ ఆయిల్ నుంచి కూడా టోటల్ 24 శాతం వాటాను కొనుగోలు చేస్తోంది. ఈ నెల 30న తమ అనుబంధ సంస్థ టోటల్‌తో ఒప్పందంపై సంతకాలు చేసినట్లు ఆర్‌ఐఎల్ ఓ ప్రకటన తెలిపింది.
2007 సెప్టెంబర్‌లో ఆర్‌ఐఎల్ తన అనుబంధ సంస్థ ద్వారా గ్యాప్‌కోలో 76 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఆ తర్వాత క్రమంగా తూర్పు ఆఫ్రికాలోని దిగ్గజ పెట్రోలియం మార్కెటింగ్ కంపెనీల్లో ఒకటిగా గ్యాప్‌కో ఎదిగింది. ప్రస్తుతం దీనికి 2,60,000 కిలోలీటర్ల నిల్వ సామర్థ్యంతో పాటు 108 బంకుల నెట్‌వర్క్ ఉంది.
ఆఫ్రికా పెట్రో రిటైల్ రంగంలో అగ్రగామిగా ఉన్న టోటల్.. తాజా డీల్‌తో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోనుంది. గ్యాప్‌కోలో పూర్తి 100 శాతం వాటా కొనుగోలు నేపథ్యంలో రిటైల్ సర్వీస్ స్టేషన్ల(బంకులు) నెట్‌వర్క్‌తో పాటు కెన్యాలోని మొంబాసా, టాంజేనియాలోని దారుస్సలామ్ లాజిస్టిక్ టర్మినల్స్ కూడా టోటల్‌కు లభించనున్నాయి. కాగా, వివిధ నియంత్రణ సంస్థల నుంచి అనుమతులకు లోబడి ఈ ఒప్పందం కొద్ది నెలల్లోనే పూర్తవుతుందని ఆర్‌ఐఎల్ పేర్కొంది.