రిలయన్స్‌లో సౌదీ ఆరామ్‌కో పాగా! | Reliance Industries silent on stake sale talks with Saudi Aramco reports | Sakshi
Sakshi News home page

రిలయన్స్‌లో సౌదీ ఆరామ్‌కో పాగా!

Published Thu, Apr 18 2019 12:42 AM | Last Updated on Thu, Apr 18 2019 12:42 AM

Reliance Industries silent on stake sale talks with Saudi Aramco reports - Sakshi

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన  రిఫైనరీ, పెట్రో కెమికల్‌ వ్యాపారంలో 25% వాటా కొనుగోలు చేయాలని ప్రపంచంలోనే అతి పెద్ద చమురు సంస్థ, సౌదీ ఆరామ్‌కో ప్రయత్నాలు చేస్తోంది. దీనికి సంబంధించి రిలయన్స్‌తో  ఆరామ్‌కో గతంలోనే చర్చలు ప్రారంభించింది. అయితే నెలల కొద్దీ చర్చలు జరుగుతున్నా, ఇప్పటివరకైతే ఎలాంటి పురోగతి లేదని సమాచారం. అయితే తాజాగా 25% వాటా కోసం సౌదీ ఆరామ్‌కో 1,000–1,500 కోట్ల డాలర్లు పెట్టనున్నదని సమాచారం. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ జామ్‌ నగర్‌లో రెండు రిఫైనరీలను నిర్వహిస్తోంది. వాటి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 68.2 మిలియన్‌ టన్నులుగా ఉంది.  

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన రిఫైనరీ, పెట్రో కెమికల్స్‌ వ్యాపారంలో మైనారిటీ (25 శాతం)వాటా కోసం సౌదీ ఆరామ్‌కో కంపెనీ 1,000–1,500 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నదని వార్తలు వచ్చాయి. అయితే మంగళవారం నాటికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ విలువ రూ.8.5 లక్షల కోట్లని, దీంట్లో సగం అంటే రూ.4.25 లక్షల కోట్లు(సుమారుగా .6,000 కోట్ల డాలర్లు) రిఫైనరీ, పెట్రో కెమికల్‌ వ్యాపారం నుంచే వస్తోందని, ప్రీమియమ్‌ను పరిగణనలోకి తీసుకుంటే, ఆరామ్‌కో పెట్టుబడులు తగిన స్థాయిలో లేవని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ వార్తలపై స్పందించడానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నిరాకరించింది. మార్కెట్‌ ఊహాగానాలపై స్పందించడం తమ విధానం కాదని పేర్కొంది. సెబీ నిబంధనల ప్రకారం అవసరమైన వివరాలను అవసరమైన సమయంలో వెల్లడిస్తామని వివరించింది. మరోవైపు దీనికి సంబంధించిన చర్చలు సీరియస్‌గానే జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జూన్‌ కల్లా వాటా విక్రయానికి సంబంధించి ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు వెల్లడించారు. ఈ డీల్‌కు గోల్డ్‌మన్‌ శాక్స్‌ సలహాదారుగా వ్యవహరిస్తోందని సమాచారం.  మరోవైపు గత ఏడాది రూ.7.7 లక్షల కోట్ల లాభం ఆర్జించి ప్రపంచంలోనే అత్యధిక లాభాలు సాధించిన కంపెనీగా సౌదీ ఆరామ్‌కో  నిలిచింది.  

కొత్త ‘చమురు’ పెట్టుబడులు లేవు !  
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తన రిటైల్, టెలికం, ఇతర వినియోగ వ్యాపారాలను దూకుడుగా విస్తరిస్తోంది. ఆయిల్, గ్యాస్‌ వ్యాపారం కోసం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పెద్దగా పెట్టుబడులు పెట్టకపోవచ్చని పరిశ్రమ నిపుణులంటున్నారు. ఒక వేళ ఇన్వెస్ట్‌ చేయాల్సి వస్తే, కంపెనీ లేదా వాటాదారుల సొమ్ములు కాకుండా భాగస్వామి సంస్థల నిధులను వినియోగిస్తుందని వారంటున్నారు. జామ్‌నగర్‌ రిఫైనరీ విస్తరణ కోసం ఈ వదంతుల ఒప్పందాన్ని ఉపయోగించుకోవాలని రిలయన్స్‌ యోచిస్తోందని కొందరు అంచనా వేస్తున్నారు.  

ఆ ప్రాజెక్ట్‌ ఆలస్యం కావడంతో.... 
మూడు ప్రభుత్వ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు–బీపీసీఎల్, ఐఓసీ, హెచ్‌పీసీఎల్‌లు మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ప్రపంచంలోనే అతి పెద్ద రిఫైనరీ–కమ్‌ పెట్రో కెమికల్స్‌ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయనున్నాయి. రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు కానున్న  ఈ ప్రాజెక్ట్‌లో 50%వాటాను  యూఏఈకి చెందిన ఆడ్‌నాక్‌ కంపెనీతో కలిసి తీసుకోవాలని సౌదీ ఆరామ్‌కో భావిస్తోంది. అయితే  ఈ ప్రాజెక్ట్‌కు కావలసిన భూ సమీకరణ ప్రణాళికలను మహారాష్ట్రలోని అధికార బీజేపీ  ప్రభుత్వం అటకెక్కించడంతో ఈ ప్రాజెక్ట్‌ ఆలస్యమవుతోంది. దీంతో ఇప్పుడు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో రిఫైనరీ, పెట్రో కెమికల్స్‌ వ్యాపారంలో మైనారిటీ వాటాను కొనుగోలు చేయాలని సౌదీ ఆరామ్‌కో యోచిస్తోంది.  ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఇంధన మార్కెటైన భారత్‌లో ప్రవేశించాలని సౌదీ ఆరామ్‌కో వివిధ ప్రయత్నాలు చేస్తోంది. ఇంధన రిటైల్‌ మార్కెట్లోకి కూడా ప్రవేశించాలని యోచిస్తోంది.

ఆరు ఈథేన్‌ షిప్పు కంపెనీల్లో వాటా విక్రయం  
అతి పెద్ద ఈ«థేన్‌ షిప్పులను నిర్వహించే ఆరు కంపెనీల్లో వాటాలను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ విక్రయించనున్నది. ఈ వాటాలను జపాన్‌కు చెందిన మిత్సు ఓఎస్‌కే లైన్స్‌(ఎమ్‌ఓఎల్‌) కొనుగోలు చేయనున్నది. ఈ మేరకు సింగపూర్‌లో నమోదైన తమ అనుబంధ కంపెనీ, రిలయన్స్‌ ఈథేన్‌ హోల్డింగ్‌ పీటీఈ లిమిటెడ్, ఎమ్‌ఐఎల్‌  సంస్థల మధ్య నిశ్చయాత్మక ఒప్పందం కుదిరిందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వెల్లడించింది. వాటా విక్రయానికి సంబంధించిన ఆర్థిక వివరాలు వెల్లడి కాలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement