రిలయన్స్ జియో కోసం రూ.15 వేల కోట్ల రైట్స్ ఇష్యూ
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ తన టెలికం విభాగం రిలయన్స్ జియోలో మరో 15,000 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. రైట్స్ ఇష్యూ ద్వారా ఈ నిధులు సమీకరిస్తామని, ఈ నెల 14న జరిగిన డెరైక్టర్ల బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని సంస్థ తెలియజేసింది. రైట్స్ ఇష్యూలో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుత వాటాదారులకు ఒక్కోటి రూ.10 విలువ గల 1,500 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేస్తుంది.
మూడు నెలల్లో ఈ రైట్స్ ఇష్యూ పూర్తవుతుందని పేర్కొంది. ఈ తాజా రైట్స్ ఇష్యూతో రిలయన్స్ జియో ఈక్విటీ రూ.45,000 కోట్ల నుంచి రూ.60,000 కోట్లకు పెరగనున్నది. స్పెక్ట్రంకోసం వెచ్చించిన మొత్తంతో సహా రిలయన్స్ జియో కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటికే రూ.1,30,000 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు చెబుతోంది. మొత్తం పెట్టుబడులు రూ.1.5 లక్షల కోట్ల మేరకు ఉంటాయని తెలియజేసింది.