సాక్షి, ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ రైట్స్ ఇష్యూకు తేదీ ప్రకటన, సంస్థకు పెట్టుబడుల వెల్లువ వార్తలతో ఇన్వెస్టర్ల ఆసక్తి భారీగా నెలకొంది. దీంతో సోమవారం నాటి మార్కెట్‌లో ఆర్‌ఐఎల్ షేర్లు రికార్డు స్థాయివైపు దూసుకుపోతోంది. ముఖ్యంగా రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు చర్చలు నేపథ్యంలో రిలయన్స్ రెండున్నర శాతం పైగా లాభంతో కొనసాగుతోంది. 2021 మార్చి నాటికి రిలయన్స్ సంస్థను రుణ రహిత సంస్థగా రూపొందించే ప్రణాళికలో ఉన్నట్టు ప్రకటించిన అధినేత ముకేశ్ అంబానీ ఆ దిశలో శరవేగంగా ముందుకు పోతుండటం పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. (మరో మెగా డీల్‌కు సిద్ధమవుతున్న అంబానీ)
వరుస మెగా డీల్స్ ప్రకటిస్తున్న రిలయన్స్ లో ట్రేడర్లు కొనుగోళ్లతో వరుసగా ఐదో రోజూ షేరు లాభాల్లో ఉంది. గత 3 నెలల్లో రిలయన్స్ వరుసగా ఐదు సెషన్ల పాటు లాభాల్లో కొనసాగడం ఇదే తొలిసారి. ఇంట్రాడేలో 3శాతం పైగా లాభపడిన షేర్ 52 వారాల గరిష్ట స్థాయి(రూ.1617.80)కి సమీపానికి వచ్చింది. ఇంట్రాడే గరిష్టం రూ.1615. మార్కెట్ క్యాప్ రూ.10 లక్షలకోట్ల ఎగువన స్థిరంగా వుంది.
కాగా సౌదీ అరేబియాకు చెందిన వెల్త్ ఫండ్, జనరల్ అట్లాంటిక్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకుఆసక్తి కనబరుస్తోందన్న వార్తలు మార్కెట్ వర్గాల్లో నెలకొన్నాయి. మరో 2-3 రోజుల్లో ఈ డీల్‌కు అనుమతి లభించే అవకాశముందని భావిస్తున్నారు. ఇప్పటికే ఫేస్ బుక్‌తో పాటు, సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పాట్నర్స్‌లు జియోలో మైనార్టీ వాటాను కొనుగోలు చేశాయి.సౌదీ డీల్ కూడా పూర్తియితే ఒక నెలరోజుల వ్యవధిలోనే రిలయన్స్ నాలుగు మెగా డీల్‌ను పూర్తి చేసినట్టు అవుతుంది. మరోవైపు దాదాపు 30 ఏళ్లలో తొలిసారిగా రూ.53,125 కోట్ల నిధుల్ని సమీకరించే ఉద్దేశంతో 1:15 నిష్పత్తిలో రైట్స్ ఇష్యూకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 14న ఇది ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment