కస్టమర్లకు జియో సమ్మర్ సర్‌ప్రైజ్
⇒ యూజర్లకు 3 నెలల కాంప్లిమెంటరీ ఆఫరు
⇒ రిలయన్స్ జియో చైర్మన్ ముకేశ్ అంబానీ వెల్లడి
న్యూఢిల్లీ: టెలికం సంస్థ రిలయన్స్ జియో తాజాగా తమ ప్రైమ్ ఆఫర్ కింద సభ్యత్వ నమోదు పథకాన్ని ఏప్రిల్ 15 దాకా పొడిగించింది. ఆలోగా సభ్యత్వం తీసుకోవడంతో పాటు రూ. 303 ప్లాన్ కొనుగోలు చేసిన వారికి మూడు నెలల పాటు కాంప్లిమెంటరీ ఆఫర్ ప్రకటించింది. సభ్యత్వ నమోదుకు భారీగా స్పందన రావడంతో రూ. 303, ఇతరత్రా ప్లాన్‌ల కొనుగోలుకు సంబంధించిన డెడ్‌లైన్‌ను మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు కస్టమర్లకు రాసిన లేఖలో జియో చైర్మన్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు.
వాస్తవానికి ఈ ఆఫరు మార్చి 31తో ముగియాల్సి ఉంది. ఇప్పటిదాకా 7.2 కోట్ల మంది పెయిడ్ సబ్‌స్క్రయిబర్స్ ప్రైమ్ సభ్యత్వం తీసుకున్నట్లు ఆయన వివరించారు. ‘ఉచితం నుంచి పెయిడ్‌కి మారే క్రమంలో యూజర్లకు సర్వీసుల్లో ఇబ్బందులు ఎదురవకుండా చూసేందుకు తుది గడువును పొడిగించడం జరిగింది. ఏ కారణం వల్లనైనా మార్చి 31లోగా జియో ప్రైమ్ సభ్యత్వం తీసుకోలేకపోయిన వారు ఏప్రిల్ 15 లోగా రూ. 99 చెల్లించడంతో పాటు రూ. 303 ప్లాన్ కొనుగోలు చేయడం ద్వారా సభ్యత్వం పొందవచ్చు‘ అని అంబానీ తెలిపారు.
అలాగే గడువులోగా రూ. 303 ప్లాన్ లేదా అంతకు మించిన ప్లాన్‌ని ఫస్ట్ పెయిడ్ రీచార్జ్ కింద కొనుగోలు చేసిన వారికి సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్ కింద తొలి మూడు నెలల సేవలు కాంప్లిమెంటరీ ప్రాతిపదికన ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. కాంప్లిమెంటరీ సర్వీసు గడువు పూర్తయ్యాకా జూలై నుంచి మాత్రమే పెయిడ్ టారిఫ్ ప్లాన్ అమల్లోకి వస్తుందని అంబానీ తెలిపారు. ఇక.. సర్వీసు నాణ్య తను మరింతగా మెరుగుపర్చే దిశగా నెట్‌వర్క్ విస్తరణపై భారీ పెట్టుబడులు పెడుతున్నట్లు పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబర్‌లో ఉచిత వాయిస్, డేటా ప్లాన్లను తొలిసారిగా ప్రవేశపెట్టిన రిలయన్స్ జియో .. ఆ తర్వాత ఉచిత ఆఫర్లను ఈ ఏడాది మార్చి 31దాకా పొడిగించిన సంగతి తెలిసిందే.